మధ్యప్రదేశ్‌లో కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

0
56

ఘోర దుర్ఘటనలో 47 మంది జలసమాధి..

సీధీ/రీవా, ఫిబ్రవరి 16 (న్యూస్‌టైమ్): మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.. రహదారిపై వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 47 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. సీధీ జిల్లా, పట్నా గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనా స్థలం నుంచి మొత్తం 47 మృతదేహాలను వెలికి తీసినట్టు రేవా డివిజినల్‌ కమిషనర్‌ రాజేశ్‌ జైన్‌ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది రైల్వే, ఎన్‌టీపీసీ, ఏఎన్‌ఎం తదితర ఉద్యోగ పరీక్షలు రాయడానికి బయల్దేరిన వారేనని ఆయన వెల్లడించారు. పరిహార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు రోజూ సీధీ-సత్నా మధ్య ప్రయాణికులను తీసుకెళ్తుంటుంది.

దీనిలో గరిష్ఠంగా 32 మందిని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా, మంగళవారం తెల్లవారుజామున సీధీలో 58 మందిని ఎక్కించుకున్నారు. వీరిలో ఎక్కువమంది సత్నాలో పరీక్షలు రాయడానికి బయల్దేరినవారే. నిజానికి ఈ బస్సు 39వ జాతీయ రహదారి మీదుగా వెళ్లాలి. కానీ… రద్దీని, ట్రాఫిక్‌ సిగ్నళ్లను తప్పించుకుని, త్వరగా గమ్యస్థానం చేరుకునేందుకని సదరు డ్రైవరు వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించాడు. సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత… రాంపుర్‌ నైకిన్‌ తాలూకా పట్నా వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పక్కనే ఉన్న బన్‌సాగర్‌ ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లింది.

బస్సు దుర్ఘటన పట్ల రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. బస్సు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

నీటిలో వ్యాను బోల్తా.. అయిదుగురి మృతి

కాలువలో వ్యాను బోల్తా పడిన ఘటనలో అయిదుగురు మృతి చెందగా.. మరో 26 మందికి గాయాలయ్యాయి. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా పాళై మణపడైవీడు, తిరుమలైకోళుందుపురం ప్రాంతాలకు చెందిన 31 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కూలి పనులకు వ్యానులో బయలుదేరారు. మణియాచ్చి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో రోడ్డు మలుపులో వారి వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి కాలువలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బయటపడేందుకు జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు మహిళలు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. తూత్తుకుడి ఎస్పీ జయకుమార్‌, మణియాచ్చి డీఎస్పీ శంకర్‌, ఇన్‌స్పెక్టరు పట్టాణి, మణియాచ్చి ఎమ్మెల్యే షణ్ముగయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతులను పేచ్చియమ్మాళ్‌(30), ఈశ్వరి(27), మలైయరసి(48), పేచ్చియమ్మాళ్‌(54), గోమతి(65)గా గుర్తించారు. క్షతగాత్రులను తూత్తుకుడి ప్రభుత్వ వైద్యకళాశాల, ఒట్టపిడారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.