“ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?

807

ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టొద్దనీ, దానివల్ల తమ భూములు పోతాయనో, పర్యావరణం దెబ్బతింటుందనో, మరొకటనో, ఇంకొకటనో… పెద్ద కర్మాగారాలు పెట్టకుండా, బడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా, సాధారణంగా ప్రజా ఉద్యమాలు, ఎన్నో ఆందోళనలు జరుగుతాయి… కానీ, 32 మంది అమరవీరులు ఆత్మార్పణ బలిదానం చేసి మరీ, యావత్ తెలుగు జాతి ఏకమై మరీ, ఆంధ్రుల హక్కుగా ఏళ్లతరబడి అఖండ ప్రజా పోరాట ఉద్యమం చేసి మరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం భారత చరత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టం.

కానీ, ఇంత ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకున్న విశ్వ విఖ్యాత ‘విశాఖ ఉక్కు’ కర్మాగారాన్ని దొడ్డిదారిన ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం, మన పాలకులు… ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో కొరియన్ స్టీల్ కంపెనీ ‘పోస్కొ’ కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్నారు… దీని తర్వాత అందరికీ తెలిసిన “ఒంటె-గుడారం- షెల్టర్” కథ సరిగ్గా వర్తిస్తుంది… ఇప్పుడు కేంద్ర పాలకులు అదే ‘పోస్కొ’ కంపెనీ కి ‘ఉస్కో’ అంటూ కారుచవగ్గా, చులాగ్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది…!

మన దేశంలోని రెండవ అతి పెద్ద  ప్రభుత్వరంగంలోని స్టీల్‌ కంపెనీ మన విశాఖ ఉక్కు కర్మాగారం… స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) తరవాత అతి పెద్ద స్టీల్ కంపెనీ ఇది… స్థానిక ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ఎంతో ప్రాముఖ్యత ఉన్న కర్మాగారం ఇది… ఈ ప్లాంటుకు భూములు ఇచ్చింది స్థానికులు, రైతులు, ఆంధ్రా ప్రభుత్వమే…మరి ఇక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రభుత్వానికి, మన గౌరనీయులైన ముఖ్యమంత్రి గారికి కనీస సమాచారం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇంత దుస్సాహసం ఎలా చేస్తుంది?… స్థానిక ప్రజల్ని, ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టి వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఆంధ్రా రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని ఎంతో అలుసు చేసి మరీ అవమానించడం కాదా…?

ప్రపంచంలోనే సముద్రతీరంలోఉన్న ఏకైక అతిపెద్ద ఉక్కు కర్మాగారం మన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్… ప్రకృతి సిద్ధమైన విశాఖ తీరం పోర్ట్, సమీపంలోని గంగవరం పోర్టుల ద్వారా ఆసియా దేశాల వైపు ఉన్న మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఉక్కు ఎగుమతులు చేయగలగడం దీని ప్రత్యేకత… ఇది వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కూడా…!… కానీ, దురదృష్టవశాత్తు ఇంతవరకూ అన్ని కేంద్ర ప్రభుత్వాలూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో రాజకీయాలు మాత్రమే చేశాయి…! చిత్తశద్ధితో అభివృద్ధి చేసే ప్రయత్నం ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు…!

ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో ఉండటం దీని బలం… ఇలాంటి అధ్భుత సౌకర్యాలు ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రపంచంలో మరెక్కడా లేదు… మొత్తమ్మీద ఆంధ్ర రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం ఒక పెద్ద కుట్ర, మహా కుతంత్రం…

ఇంతటి మహోజ్వల చరిత్రగలిగిన  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని ఎంతో  నయవంచనతో, చాలా చులాగ్గా, దొడ్డిదారిన కుట్రతో ప్రైవేటుపరం చేయడానికి మన కేంద్ర పాలకులు ప్రయత్నాన్ని ఆరంభించడం ఆంధ్ర జాతికి, ఆంధ్ర ప్రజలకు అనాదిగా జరుగుతున్న, జరగబోతున్న వంచనాకాండకు ఇది ఒక పరాకాష్ట…
ఆరోజుల్లో విశాఖ ఉక్కుకు భూముల్ని పెద్దమనసుతో ఒకరకంగా ఎంతో ఉదారంగా, స్వచ్చoదంగా ఇచ్చిన రైతులకు దక్కిన పరిహారం ఎకరానికి రెండువేలైతే నేడు అదే భూమి థర మార్కెట్ అంచనాల ప్రకారం అక్షరాలా ఐదారు కోట్లు పైమాటే!… అంటే 22 వేల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం కనీస విలువ రెండు లక్షల కోట్లు పైమాటే… కానీ, ఇప్పుడు ఎంతో తక్కువకు ఓ కొరియన్ కంపెనీకి కట్టబెడ్తున్నా  ఇది కేవలం డబ్బు తోనే విలువ లెక్కించే అంశం కాదు… ఇది ఆంధ్రుల మనోభావాలతో, గౌరవంతో ఆత్మాభిమానంతో ముడిపడిన విషయం…

సుమారు 50 వేలమందికి పైగా ప్రజలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పిస్తున్న ఇంతటి మహోన్నతమైన సంస్థ పట్ల మొదట్నుంచీ కేంద్ర ప్రభుత్వాల, పాలకులకు సవితి తల్లి ప్రేమే…! ఇంతవరకూ మన విశాఖ ఉక్కుకు ఆరు దశాబ్దాలుగా సొంత గనులు కేటాయించకుండా, పరోక్షంగా నష్టాల పాలుచేస్తూ ఇప్పుడు ఏకంగా ఉన్న ఏకైక స్టీల్ ఫ్యాక్టరీనే ప్రైవేటీకణ చేయబూనడం కేంద్ర ప్రభుత్వాల ద్వంద్వ నీతికి, అన్యాయానికి, సవతి తల్లి ప్రేమ కు పరాకాష్ట…!

మరోసారి ఆంధ్రుల హక్కులను భంగపరిచే కుట్రలకు తెరతీశారు…  భారతదేశ చరిత్రలో మరే ఇతర రాష్ట్రంపట్ల, ఇతర జాతి పట్ల ఇంత అన్యాయాన్ని, ఇంత వివక్షను చూపడం జరగలేదు… ఎందుకో భారత దేశానికి స్వాతంత్రం వచ్చినదగ్గరనించి ఆంధ్ర రాష్ట్రం పట్ల, ఆంధ్ర జాతి పట్ల అంతులేని నిర్లక్షాన్ని, అనంతమైన అధర్మాన్ని చూపుతున్నారు మన ఘనత వహించిన కేంద్ర పాలకులు – మన నాయకులు…
నెహ్రూ దగ్గరనుండి నరేంద్ర మోడీ వరకూ ఘనతవహించిన భారత ప్రధానులు, మహా నాయకులూ, కేంద్ర పాలకులులందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రులను వారి వారి అవకాశవాద రాజకీయాలకోసం, స్వార్ధ స్వప్రయోజనాలకోసం అడుగడుగునా అక్రమాలతో, అన్యాయం చేయటంలో పోటీలు పడుతున్నారు.

ఆంధ్రుల హక్కైన ఇంతటి అతి పెద్ద విశాఖ ఉక్కు కర్మగారాన్ని అకస్మాత్తుగా ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన ఎలా తీసుకున్నారు…?… తొలుత ఏ ప్రతిపాదన అయినా సంబంధిత శాఖ నుంచి రావాలి… దాన్ని ఆర్థిక, న్యాయ శాఖలకు పంపాలి… ముఖ్యంగా ఆర్థిక శాఖ నుంచి వచ్చిన సూచనలు, సలహాలను ప్రత్యేక కేబినెట్‌ కమిటీ పరిశీలించిన మీదటే నిర్ణయం తీసుకోవాలి… తరవాత కేబినెట్‌కు పంపాలి… ప్రధాని అధ్యక్షతన దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించాలి…ఢిల్లీలో ఉన్న మన ప్రభుత్వ ప్రతినిధులు, గౌరవనీయులైన మన సీఎంకు, ఎంపీలకు పాపం ఈ విషయాలు, ఇన్నాళ్ళూ ఈ పాపం గురించి తెలియదా…?…  ఢిల్లీలో ఇన్ని శాఖల్లో వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఫైల్‌ కొన్ని నెలలుగా జోరుగా తిరుగుతుంటే మనమెన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులంతా ఏం చేస్తున్నట్టు…?

మొదటినుండీ, ఆంధ్రులను ఒక సంచార జాతిగా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక వలస రాష్ట్రం మార్చారు… ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా అవమానాలు, అన్యాయాలు… ఆంధ్రా రాజధాని అంటేనే రాక్షసమైన రాజకీయాలు, క్షమార్హం కాని కుట్రలు… ఆంధ్రుల హక్కులంటే అందరికీ అంత అలుసా…?
మద్రాస్ నుండి మెడ పట్టి కర్నూలు పంపే వరకూ ఎన్నెన్నో అన్యాయాలు… మళ్ళీ కర్నూలు నుండి బలవంతంగా ఇష్టంలేని కాపురానికి హైదరాబాద్ కు పంపడం లో మరెన్నో అవకాశవాద రాజకీయాలు… మరోసారి మళ్ళీ హైదరాబాద్ నుండి అమరావతి కు తన్నితరిమేయడంలో కపటమైన కుట్రలు-కుతంత్రాలు, వికృతమైన నీచ-నికృష్ట రాజకీయాలు…

భవిష్యత్తులో ఇంకెన్ని కుట్రలకూ, కుతంత్రాలకూ ఆంధ్రులు, ఆంధ్ర రాష్ట్రం బలికావాలో…! ఇన్నేళ్ళలో, ఇంతకాలం, ఇంతవరకూ ఆంధ్రా రాష్ట్రానికి, ఆంధ్రా ప్రజలకు ఎప్పుడూ సమ న్యాయం – సమ ధర్మం అనేవి ఎన్నడూ దొరకలేదు కేవలం నమ్మకద్రోహం, వంచన, వెన్నుపోటు తప్ప…!
భవిష్యత్తులో ఆంధ్రా ప్రజలతో, ఆంధ్రా రాష్ట్రంతో ఇంకెన్ని”కేంద్ర” ప్రభుత్వాలు, పాలకులు, ఇంకెన్నిస్వార్ధ రాజకీయాలు చేస్తారో కాలమే చెప్పాలి…! మరీ ఇంత వివాక్షా…?… మరీ ఇంత అన్యాయమా…?… మరీ ఇంత అధర్మమా…?… ఒక్కొక్కసారి, ఆంధ్రా ప్రజలకు ఆంధ్రా రాష్ట్రం అనేది భారతదేశం లో ఒక భాగమేనా అనే అనుమానం కలిగితే ఎంతమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు…!

స్వాతంత్రమొచ్చిన 74 ఏళ్లలో ఆంధ్రా ప్రజలకు, ఆంధ్రా రాష్ట్రానికి జరిగిన అనుభవాలు, అన్యాయాలు, అక్రమాలు అలాంటివి… ఇందులో కేంద్ర పాలకుల, ప్రభుత్వాల పాత్ర ఎంతుందో మన స్వార్థ, వంచక, నయవంచక, వెన్నుపోటు రాజకీయ నాయకుల పాత్ర కూడా అంతే ఉంది… వారి స్వార్ధపూరిత, స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రానికే, తమ సొంత ప్రజలకే నమ్మక ద్రోహం చేసిన, చేస్తున్నవంచక రాజకీయ నాయకులు మనమధ్యే ఉండటం ఆంధ్రా ప్రజలు, ఆంధ్రా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం…
ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారు చౌకగా, చాల చులాగ్గా ప్రైవేట్ పరం చేస్తున్నా ఆంధ్ర ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతున్నా, కేవలం ఒక ఉత్తరం, కొందరి కంటి తుడుపు ప్రకటనలు, ఇంకొందరి ఆవేదనలు, మరికొందరి రాజకీయ ప్రకటనలు తప్పితే మొత్తం మీద నోరువిప్పడానికి కూడా భయపడుతున్నఎందరో రాజకీయనాయకులు, ఎన్నో పార్టీలు…!

ఎవరు గట్టిగా మాట్లాడితే ఏమైతుందో, కేంద్రంలోని, రాష్ట్రంలోని పెద్దల ఆగ్రహానికి గురవ్వాల్సివొస్తుందేమో అని  అనుకుంటూ జరిగిన అన్యాయాన్ని ఖండించడానికే భయపడుతున్న రాష్ట్ర నాయకులు…! పార్టీలకు అతీతంగా అందరూ సంఘటితమై పోరాడాల్సిన విషయంలో ఇంత నిర్లిప్తత ఏమిటి…? కొత్త ఫ్యాక్టరీలు పెట్టడం దేవుడెరుగు…!… ఉన్న గొప్ప ఫ్యాక్టరీలను కూడా ఇలా అన్యాయం చేసి, అధర్మంగా నష్టాల బాట పట్టించి, కారు చవగ్గా అమ్ముకోవడం ఏమిటి…?

మన ఆంధ్రా హక్కు-విశాఖ ఉక్కు ను విచ్ఛిన్నం చేస్తున్నా, మన ఆంధ్రుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నా, మన ఆత్మాభిమానాల్ని చంపుతున్నా మన నాయకుల్లో, మనం ఎన్నుకున్న మన ప్రభుత్వంలో సరైన స్పందన ఎందుకు లేదు…? కనీసం పార్లమెంటులో గట్టిగా నిలదీయని, పోరాటం చేయని మన ఎంపీలను మనం ఎందుకు ఎన్నుకున్నట్లు…? ఇదెక్కడి రాజకీయం…?

విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం విశాఖపట్టణానికో, ఉత్తరాంధ్రకో పరిమితమైన అంశం కాదు… ఆరు దశాబ్దాలక్రితం, ఇంచుమించు ఒక దశాబ్ద కాలం పాటు యావత్ తెలుగుజాతి కుల, మత, ప్రాంత విభేదాలకతీతంగా చేసిన అచంచల పోరాటఫలితంగా ఎందరో త్యాగాల పునాదులపై ఏర్పడిన ఒక గొప్ప సంస్థ…

ఇది తెలుగు ప్రజల ఉమ్మడి ఆస్థి… మన ఆంధ్రుల ఆత్మగౌరవం… మన ఆత్మ విశ్వాసాన్ని నిలిపిన మహోన్నత సంస్థ ఇది… 32 మంది అమరవీరుల బలిదానం, ఆత్మార్పణ వృధాకాకూడదు… వారి త్యాగాలను సదా స్మరించుకోవడం, ముఖ్యం గా ఆ స్ఫూర్తిని నిలుపుకోవడం ఎంతో అవసరం…

ఈరోజు ప్రజా సేవకులుగా చెప్పుకుంటున్న మన నాయకులు, ప్రభుత్వాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు… తమ సొంత రాష్ట్ర, సొంత ప్రజల ప్రయోజనాలకన్నా తమ స్వప్రయోజనాలు, స్వార్ధం, వ్యక్తిగత లబ్దికోసం మన రాష్ట్రాన్ని, ప్రజల్నికేవలం తమ రక్షణకోసమే ఒక కవచం లాగా వాడుకుంటున్నారు… ఇది చాలా దురదృష్టకరం… ఎంతో ఆందోళనకరం… దయచేసి ఇకనైనా మారండి ప్లీజ్…

విశాఖ ఉక్కు – మన ఆంధ్రుల హక్కు… ఇది ఆంధ్రుల ఆత్మాభిమాన, ఆత్మగౌరవ సమస్య… ఆత్మగౌరవం లేని జాతి చరిత్రలో మనజాలదు… ఆంధ్రుల ఆత్మగౌరవం కేవలం మాటల మూట కాదని ఇప్పుడు నిరూపించుకోలేకపోతే ఇక ఎన్నడూ, ఎప్పటికీ నిరూపించుకోలేము… పోరాటంతో పోయేదేమీ లేదు… మన జాతి గౌరవాన్ని నిలుపుకోవడం తప్ప…!

మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, పార్టీలకతీతంగా, కుల మత ప్రాంతీయతలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశవైఖరికి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి… విశాఖ ఉక్కును కాపాడుకోవాలి… కొన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని, స్వచ్చందంగా రైతులు, ప్రజలిచ్చిన కొన్నివేల ఎకరాలనూ స్వార్ధ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు, బ్రోకర్లకు, లంచావతరాలకు, ప్రైవేటుపరం చేయడం ద్వారా లబ్ది చేకూరనివ్వకూడదు…

ఆంధ్రుల హక్కులంటే అందరికీ అంత అలుసా…? ఆంధ్రా మేధావుల్లారా ఇకనైనా మీ మత్తువదలండి… నిద్ర లేవండి… కళ్ళు తెరవండి…! అలా కాకపొతే, ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, ఎందరో తెలుగు ప్రజల త్యాగాలకు, మహోన్నత పోరాటానికి ఇది ఒక తీరని అవమానం…దయచేసి మీ నిర్లిప్తతను, అలక్ష్యాన్ని, అరంభసూరత్వాన్ని వీడి మన విశాఖ ఉక్కు కర్మగారాన్ని నిలుపుకోండి… మన ఆంధ్రులకు ఎంతో గర్వకారణమైన మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ని కాపాడండి…

-పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ