అప్పులతో టీడీపీ నేతల తిప్పలు!

593

‘స్థానిక’ ఎన్నికల్లో సొమ్ముల్లేక సొమ్మసిల్లిన సీనియర్లు
నయా పైసా ఇవ్వని నాయకత్వం
( మార్తి సుమ్రహ్మణ్యం)

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పుంజుకోకపోవడానికి స్థానిక నేతల ఆర్ధిక సమస్యలే కారణమన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికార వైసీపీ ఒక్కో పంచాయితీకి 15-25 లక్షలు ఖర్చుపెడితే, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న టీడీపీ అగ్ర నేతలు మాత్రం.. అభ్యర్ధుల నామినేషన్, ఊరేగింపు ఖర్చులు, పన్ను బకాయిలను చెల్లించి చేతులుదులిపేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇన్చార్జులు లేక, పార్టీ బరువు  మోయని నియోజకవర్గాల్లో అయితే దానికీ దిక్కులేదు. అధికారంలో ఉన్న సమయంలో షాపూర్జీ, మెగా వంటి బడా కంపెనీలకు బిల్లులు చెల్లించిన బాబు సర్కారు… గ్రామాల్లో రోడ్లు పనులు చేసిన పార్టీ నేతలకు మాత్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన పాపమే ఇప్పుడు, ఎన్నికల్లో శాపంగా మారిందన్న ఆవేదన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సుదీర్ఘకాలం అధికారంలో ఉండి, కేంద్రంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నాయకత్వం.. స్థానిక ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్ధులకు కనీస సాయం కూడా చేయకుండా, బీద అరుపులు అరుస్తుండటం ఆ పార్టీ సీనియర్లను విస్మయపరుస్తోంది. మాజీ మంత్రులు, ఫ్యాక్షన్ ఉన్న నియోజకవర్గాల్లో మినహా రాష్ట్రంలో ఏ ఒక్క పంచాయితీలోనూ టీడీపీ అభ్యర్ధులకు,  నాయకత్వం ఆర్ధిక సాయం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత చిత్తూరు జిల్లాలోనే అభ్యర్ధులకు కొంత మేరకు ఆర్ధిక సాయం చేసినట్లు చెబుతున్నారు.

అటు వైసీపీ నేతల బెదిరింపులు, పోలీసు కేసులకు ఎదురొడ్డి నిలిచిన సీనియర్లు, తమ నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు నయా పైసా సాయం చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. గత అసెంబ్లీ-ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వం భరోసాతో చేసిన అప్పులను ఇప్పటికీ తీర్చలేక టీడీపీ సీనియర్లు సతమతమవుతున్నారు. పాత అప్పులు చెల్లించకపోవడంతో,  వడ్డీ వ్యాపారులు కొత్త అప్పు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది.దీనితో సీనియర్లు కేవలం మీడియాకే పరిమితమయి, ఎన్నికలు ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల ముందు పార్టీ అభ్యర్ధులు, ఒక్కో అభ్యర్ధి 3 నుంచి 5 కోట్ల వరకూ అప్పులు చేశారు. బయట నుంచి వచ్చే నిధుల దారులను బీజేపీ సర్కారు మూసివేసింది. దానితో నిధులు సర్దుబాటు చేయలేని టీడీపీ నాయకత్వం, స్థానికంగా అభ్యర్ధులనే నిధులు సేకరించుకోవాలని సూచించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల ముందు పార్టీపరంగా పత్రికలు-టీవీ చానెళ్లకు ఇచ్చిన ప్రకటనల డబ్బులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ, ఇలా బకాయిలు పడి, వాటిని చెల్లించకుండా ముఖం చాటేయడమే సీనియర్లను విస్మయపరుస్తోంది.

తమ ఆర్ధిక పరిస్థితిని చెప్పుకునేందుకు నాయకత్వం అందుబాటులో లేకపోవడం, ఒకవేళ కలిసినా తర్వాత చూద్దామంటూ దాటవేస్తుండటంతో.. ఇక నాయకత్వం నుంచి తమకు డబ్బులు రావని నాటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు నిర్థారణ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో, పార్టీ ప్రతిష్ఠ కోసం స్థానికంగా అభ్యర్ధులను నిలబెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. చచ్చీ చెడీ ఎలాగోలా అభ్యర్ధులను నిలబెట్టినా, వారికి కనీసం రెండు లక్షలు కూడా ఇవ్వలేని దారుణ పరిస్థితి. కర్నూలు, అనంతపురం, కడప వంటి ఫ్యాక్షన్ జిల్లాల్లో టీడీపీ సీనియర్లు నియోజవర్గానికి 20 లక్షలు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. అయితే వైసీపీ తన అభ్యర్ధులకు ఒక్క పంచాయితీకే 25 లక్షలు ఖర్చు పెడుతున్న పరిస్థితి టీడీపీని కలవరపరుస్తోంది.

అయితే ఈ పరిస్థితికి తమ నాయకత్వమే కారణమని టీడీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉండగా, గ్రామ స్ధాయి నేతలు చేసిన రోడ్డు పనులకు అప్పుడే బిల్లులు చెల్లించి ఉంటే, ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడేది కాదని చెబుతున్నారు. బిల్లులు ఇవ్వకుండా వృధా పథకాలు పెట్టి, గ్రామాల్లో పార్టీ నేతలను ఆర్ధికంగా నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్ధులకు ఆ బిల్లుల ఆశ చూపి, పోటీ నుంచి తప్పిస్తుంటే తాము కూడా ఏమీ చేయలేని నిస్సహాయులమవుతున్నాయమని ఓ మాజీ మంత్రి వాపోయారు. అయినా సుదీర్ఘ కాలం రాష్ట్ర-జాతీయ రాజకీయాలను శాసించిన తమ పార్టీ నాయకత్వం వద్ద,  డబ్బులు లేవన్న సమాధానమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కనీసం గత ఎన్నికల బకాయిలనా ఇస్తే, పంచాయితీ ఎన్నికల నుంచి బయటపడతామని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. బకాయిలు అడిగినప్పుడల్లా, నాయకత్వం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

అసలు  చంద్రబాబునాయుడు స్వయం పర్యవేక్షణలో, పార్టీ ఇలాంటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని సీనియర్లు చెబుతున్నారు. ఎలాంటి ఎన్నికలయినా భారీగా ఖర్చు పెట్టే మనస్తత్వం, డబ్బుకు ఎక్కడా రాజీ పడని ధోరణి ఉన్న చంద్రబాబు, ప్రస్తుత ఎన్నికల్లో నిస్సహాయంగా ఉండటమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, ఎన్నికలయ్యాక మిగిలిన నిధులు తిరిగి తీసుకువచ్చిన వారిపై,  ఆయన అసహనం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ డబ్బు కూడా ఖర్చు చేసి ఉంటే ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేదని, డబ్బులు తిరిగి ఇచ్చిన వారిని సున్నితంగా మందలించిన సందర్భాలు కోకొల్లలని చెబుతున్నారు.

చివరకు టీడీపీ విపక్షంలో ఉన్నా, తొలి దశ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ కంటే ఎక్కువ ఖర్చు చేయడాన్ని చూసి,  నాటి సీఎం వైఎస్ కూడా భయపడ్డారని నాటి ఎన్నికలను గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలు చంద్రబాబు నాయుడు చేతి నుంచి,  కుటుంబం చేతిలోకి వెళ్లాయని, అందుకే అన్నీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో  బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకే గత ఎన్నికల బకాయిలు ఇప్పటిదాకా తీర్చడం లేదని, అదే చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉంటే ఎప్పుడో చెల్లించేవారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.