కేసీఆర్‌ది కుటుంబపార్టీ

401

– కిషన్‌రెడ్డి ధ్వజం
– బీజేపీలో భారీ చేరికలు

సికింద్రాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ది కుటుంబపార్టీ అయితే, బీజేపీ దేశం కోసం ఆలోచించే ఏకైక రాజకీయ పార్టీ అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడెవరనేది దేవుడికీ తెలియదని, అదే ప్రాంతీయ పార్టీలో అయితే కొడుకులు, కూతుళ్లో అధ్యక్షులని చెప్పేస్తారని వ్యాఖ్యానించారు. పరాయి దేశంలో పట్టుపడిన సైనికులను నాలుగురోజుల్లోనే స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. యువత బీజేపీకే పట్టం కట్టాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచందర్‌రావును గెలిపించడం ద్వారా, సభలో విద్యాధికుల సమస్యల ప్రస్తావనకు చోటివ్వాలని కోరారు.

సికింద్రాబాద్ స్వరాజ్య ఫంక్షన్ హాల్‌లో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా సమావేశం జరిగింది. అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ నాయకత్వంలో పలువురు మహిళలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. అంతకుముందు ఖైరతాబాద్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే 12 కోట్ల మంది సభ్యులున్న ఏకైక అతిపెద్ద పార్టీలో చేరుతున్న కుటుంబసభ్యులను అభినందించారు. గతంలో చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యులున్న పార్టీగా ఉండేదని, ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందని చెప్పారు. దేశంలో పంజాబ్ కేంద్రంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నామో, అందులో ఉన్న రైతులకే తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. రైతుకు గిట్టుబాటు థరతోపాటు, పండించిన పంటను దేశంలో ఎక్కడైనా పండించే హక్కును కల్పించడమే మోదీ ప్రభుత్వం చేసిన తప్పా అని ప్రశ్నించారు.

ఈ దేశంలో ఆరేళ్ల నుంచి ఒక్క రోజు సెలవు కూడా తీసుకోకుండా పనిచేసే ఏకైక ప్రధాని మోదీ ఉండటం ప్రజల అదృష్టమన్నారు. గతంలో చెలరేగిన ఉగ్రవాదులు, ఇప్పుడు దేశం వైపు చూసేందుకే భయపడుతున్నారని చెప్పారు. ఫాంహౌస్‌లో పడుకుని పరిపాలించే కేసీఆర్‌కు ఓటువేసిన ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారన్నారు. కేటీఆర్ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ మనుమడు సీఎం అయేందుకు అప్పుడే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని విమర్శించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధి రాంచందర్‌రావును గెలిపించడం ద్వారా, బీజేపీ సత్తా వరోసారి చాటాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు మాట్లాడుతూ, తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. రెండు ఎన్నికల్లో కేసీఆర్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన ప్రజలు, అదే స్ఫూర్తితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రామచందర్‌రావును గెలిపించి, ఫాంహౌస్ పాలనకు తెరదించాలని పిలుపునిచ్చారు. ప్రజలను కుక్కలుగా అభివర్ణించిన కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు గమనించాలన్నారు.

బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాంచందర్‌రావు మాట్లాడుతూ, సభలో ప్రతిపక్షం లేకుండా గొంతునొక్కుతున్న టీఆర్‌ఎస్ గొంతును ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విధ్యాధికులు శాశ్వతంగా మూయాల్సిన అవసం ఉందన్నారు. ఉద్యోగులకు పీఆర్పీ ఇంతవరకూ ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా  ఇవ్వలేదని, చివరకు ఉద్యమానికి కేంద్రబిందువయిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల గొంతు నులిమేసిన కేసీఆర్ సర్కారుకు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించడం ద్వారా, ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌కు స్పష్టం చేయాలన్నారు.పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ మేయర్  సుభాష్‌చందర్జీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచందర్‌రావును గెలిపించేందుకు కార్యకర్తలు ఒక వ్యూహం ప్రనిచేయాలన్నారు. తమకు అప్పగించిన బూత్‌లకు వెళ్లి, బీజేపీ అభ్యర్ధి గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని వివరించాలన్నారు.  ఈ సందర్భంగా  బీజేీపీలో చేరిన వారికి  కిషన్‌రెడ్డి  కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పార్టీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌జీ, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్, రాష్ట్ర కోశాధికారి భవారీలాల్‌వర్మ, రాజశేఖర్‌రెడ్డి, రాచమల్లు కృష్ణమూర్తి, మేకల సారంగపాణి,  జంపన ప్రతాప్, ప్రభుగుప్త, రామకృష్ణ, భానుక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.