స్థానిక సమరంలో కుమిలిన ‘కమలం’

0
349

అగ్రనేతల ఇలాకాల్లో వికసించని ‘పువ్వు’
ఆ జిల్లాల్లో ఖాతానే తెరవని దయనీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

గుర్రం గుడ్డిదయినా దాణాకు లోటులేదన్న తెలుగు సామెత..  జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఏపీ వరకూ బాగా సరిపోయింది. పేరుకు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ. చెప్పుకోవడానికి మాత్రం డజన్ల సంఖ్యలో జాతీయ-రాష్ట్ర స్థాయి నాయకులు. అలంకారానికేమో ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు. ఎవరి నోట విన్నా ‘రానున్న ఎన్నికల్లో మాదే అధికారం’ అనే డాంబికాలు. మరి ఇంత హడావిడి చేసే నాయకులకు, వారు ప్రాతినిధ్యం వహించే పార్టీకి జనంలో ఎంత బలం ఉండాలి? ఏ స్థాయిలో కార్యకర్తలుండాలి? నేడో,రేపో ఏపీలో ప్రభుత్వ  పగ్గాలు చేపట్టబోయే పార్టీకి.. ఎలాంటి ఎన్నికల్లోనయినా కనీసం సగం జిల్లాలయినా తన ఖాతాలో జమ కావాలి కదా? అధమంగా ఒక్క జిల్లాలోనయినా కమలం వికసించాలి కదా? మరి బీజేపీ అనే జాతీయ పార్టీ,  ఆఫ్టరాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్ధులతో పోరాడలేక, అలా సొమ్మసిల్లి బాల్చీ తన్నేయడమేమిటి? జిల్లాల్లో జీరోలతో సొమ్మసిల్లిపోవడమేమిటి? రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే  చర్చ.

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలువడిన రెండో దశ ఫలితాలు,  జాతీయ పార్టీ అయిన బీజేపీని దారుణంగా దెబ్బతీశాయి. కనీసం ఒక్క జిల్లాలో కూడా ఎక్కడా రెండో స్థానంలో కనిపించలేదు.  ఫలితాల్లో మిత్రపక్షమైన జనసేన పక్కన, చిన్నబోయి నిలబడాల్సివచ్చింది. మొత్తంగా అనేక జిల్లాల్లో జీరో సాధించిన అవమానకర  పరిస్థితి. తొలి దశ ఫలితాల్లో బీజేపీ-జనసేన కలిసి 46 స్థానాలు సాధించగా, అందులో బీజేపీ కేవలం 6 సర్పంచులను మాత్రమే గెలుచుకుంది. రెండోదశ ఎన్నికల ఫలితాల్లో 32 సర్పంచులు గెలవగా,  అందులో బీజేపీ గెలిచినవి 5 మాత్రమే. అంటే రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచినవి కేవలం పదకొండు స్థానాలే కావడం గమనార్హం. దీన్నిబట్టి జసనేన వల్ల బీజేపీకి లాభం తప్ప, రాజకీయంగా బీజేపీతో జనసేనకు ఎలాంటి ప్రయోజనం లేదని రుజువయింది.

రెండవ దశ ఫలితాల్లో చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లోనే ఒకటి, రెండు చోట్ల ఖాతాలు తెరవగా, మిగిలిన జిల్లాల్లో అసలు పార్టీ పత్తా లేకుండా పోయింది. వందల పంచాయితీలూ అసలు పోటీనే చేయకపోవడం మరో దయనీయం. తొలి దశ ఎన్నికల ఫలితాల్లో విజయనగరం, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఒకటో, రెండో చోట్ల ఖాతా తెరవగలిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో బీజేపీ సాధించిన సీట్లు సున్నా. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర నేతలెవరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ మేరకు స్వయంగా అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, రాష్ట్ర-జిల్లా నేతలకు బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతా ప్రతిరోజూ పత్రికలు, చానళ్లలో కనిపించేందుకు ప్రయత్నించారే తప్ప, ఏ ఒక్క జిల్లాలోనూ గ్రామాల్లో తిష్ట వేసిన దాఖలాలు లేవని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఏపీలో బీజేపీకి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు, ఎంపీ సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లా, ఎంపీ సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా, మరొక ఎంపీ టిజి వెంకటేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి సొంత ప్రకాశం జిల్లా, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సొంత కడప జిల్లాతోపాటు.. ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి సొంత అనంతపురం జిల్లాల్లో బీజేపీ సున్నా సీట్లతో చతికిలపడటం విశేషం.  పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పార్టీ ఘోర పరాజయం కాగా, ఆయన సొంత తూర్పు గోదావరి జిల్లాలో తొలిదశలో 1, రెండవ దశలో ఒక చోట సర్పంచి పదవి సాధించింది. మరో ప్రధా కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ సొంత విశాఖ జిల్లాలో రెండు దశలు కలపి 2 సీట్లు సాధించింది. వీరితోపోలిస్తే.. తన సొంత గ్రామం రాజంపేట నియోజకవర్గం కూచివారిపల్లెలో ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకుని, సర్పంచిని గెలిపించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఒక్కరే మొనగాడనిపించుకున్నారు.

దీన్నిబట్టి.. ఏపీలో బీజేపీ నేతలకు స్థానికంగా ఎంత బలం ఉందో స్పష్టమయింది. అయితే దానికి మించి నేతల ప్రగల్భాలు, ప్రచారపటాటోపం మాత్రం.. వెయ్యి సీట్లు వచ్చేంత హడావిడి చేయడమే కార్యకర్తలను విస్మయపరుస్తోంది. ప్రధానంగా పురందీశ్వరి, సత్యకుమార్ ఇద్దరూ జాతీయ స్థాయి నాయకులయినప్పటికీ, వారి సొంత నియోజకవర్గం-సొంత జిల్లాల్లో మాత్రం ఒక్క సర్పంచి కూడా గెలవలేకపోవడం బట్టి.. బీజేపీ నేతలు పేపర్ టైగర్లు తప్ప జనంలో వారికెలాంటి బలం లేదని స్పష్టమయింది. పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేతలకు ఎన్నికల ముందే జిల్లాలకు ఇన్చార్జులను నియమించని తమ రాష్ట్ర నాయకత్వ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.