విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

0
151

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. చినముషిడివాడలోని పీఠం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు గురువందనంతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యవేక్షణలో వార్షికోత్సవాలను ఏర్పాట్లు చేపట్టినట్లు ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. విశాఖ నగరంలో వేద ధ్వని ప్రతిధ్వనించేలా వేదోక్తమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఉత్సవాల్లో భాగంగా దేశ రక్షణార్ధం రాజశ్యామల యాగం, లోక కళ్యాణార్ధం చతుర్వేద పారాయణ నిర్వహిస్తున్నామని అన్నారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ నిత్యం విశేష హోమాలు, యజ్ఞ యాగాదులు తలపెడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా 17వ తేదీన విద్యాభివృద్ధి కోసం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, వ్యాపారాభివృద్ధి కోసం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం, 18వ తేదీన మానవాళి రక్షణ కోసం మనుస్యూక్త హోమం, 19వ తేదీన  ఐశ్వర్యాభివృద్ధి, భోగప్రాప్తి కోసం రుద్రహోమం, 20వ తేదీన వివాహసిద్ధి, సంతాన ప్రాప్తి కోసం షణ్ముఖ యాగం చేపడతామని తెలిపారు.

ఈ వార్షికోత్సవాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం అధిష్టాన దైవం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తూ లక్షతులసిపూజ, లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన ఉంటాయన్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు నిత్య పీఠ పూజ ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాత్రి 7 గంటలకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు  చెప్పారు. విశాఖ తీరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. యజ్ఞ యాగాదులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. హైందవ ధర్మ పరిరక్షణకు దోహదపడేలా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. విశేష పండితులను ఈ వేదికపై సత్కరిస్తామని స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు.