ప్రభుత్వ ప్రభావంలో పీఠాథిపతులు?

545

– ఈనెలాఖరులో తిరుపతిలో పోటీ ధర్మాచార్యుల సభ
–  కేంద్ర మాజీ మంత్రి, ఓ పీఠాథిపతి  డైరక్షన్?
– టీటీడీ బోర్డు మెంబర్ యాక్షన్?
– సర్కారుకు  బాసటగా నిలవనున్న మరో వర్గం స్వాములు
     ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో  స్వాముల ‘పీఠాలు’ కదులుతున్నాయి.  సర్వసంగ పరిత్యాగులు సైతం ప్రభావితులయేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించి, కార్యాచరణ ప్రకటించేందుకు ఈనెల 13న తమిళనాడు సరిహద్దు వద్ద కొందరు పీఠాథిపతులు భేటీ అయ్యారు. ఇది హిందూ సమాజంలో కొత్త ఆలోచన రేకెత్తించింది. దానితో సర్కారులో కదలిక వచ్చింది. ఫలితంగా ధార్మిక వ్యవహారాల్లో జగన్ సర్కారుకు, దిశానిర్దేశం చేస్తున్న ఓ పీఠాథిపతిని ప్రభుత్వం తెరపైకి తీసుకువ చ్చింది. ఆయన అధ్యక్షతన పోటీగా మరో ధర్మాచార్యుల సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..  ఈనెల 13న తమిళనాడు సరిహద్దులో జరిగిన పీఠాథిపతుల భేటీకి, సదరు సర్కారీ స్వామిని దూరంగా ఉంచారు. ఇప్పుడు సర్కారు ప్రోత్సాహంతో ఈనెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో, తిరుపతిలో  నిర్వహించనున్న  ధర్మాచార్యుల పోటీ సభకు, సదరు పీఠాథిపతి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. టీటీడీ ఆర్ధిక సహాయంతో ఈ సభ నిర్వహించనున్నారు. దానికి కంచి స్వామిని కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ధర్మాచార్య సభ ఆయన ఏర్పాటుచేసినదే. కంచి స్వామితో పాటు, ఈనెల 13న హాజరయిన పీథాథిపతులను కూడా ఆహ్వానించటం ద్వారా, ప్రభుత్వం పై చేయి సాధించాలన్న లక్ష్యం కనిపిస్తోంది.

వారు కాకుండా మిగిలిన స్వాములను కూడా ఆహ్వానించి, వారితోనే ప్రభుత్వం హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తోందని ప్రకటింపచేయడమే.. త్వరలో నిర్వహించనున్న  ధర్మాచార్యసభ లక్ష్యమని తెలుస్తోంది. ఆ రకంగా హిందువులలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడంతోపాటు, విశ్వాసం కల్పించడమే ఈ సభ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదంతా హిందువుల కళ్లను పీఠాథిపతుల వేళ్లతో హిందువులతో పొడిపించడమేనన్న వ్యాఖ్యలు హిందూ సంస్థల్లో వినిపిస్తున్నాయి.

నిజానికి ఈనెల 13న ధర్మాచార్యుల సభ జరిగిన తర్వాత, ఆసక్తికర సంఘటనలు జరిగినట్లు సమాచారం. ఆ భేటీ తర్వాత బీజేపీకి చెందిన ఓ కేంద్ర మాజీ మంత్రి రంగంలోకి దిగారు. ఆయనతో పాటు తెలంగాణ సర్కారుకు అత్యంత సన్నిహితుడైన మరో పీఠాథిపతి కూడా తోడయ్యారు.  ఇప్పటికే సదరు కేంద్ర మాజీ మంత్రి  టీటీడీ వ్యవహారాలను సమర్థించడంతోపాటు, జగన్ క్రైస్తవుడంటూ వస్తున్న ఆరోపణలను ఖండించి, ఆయన నిజమైన హిందువంటూ సమర్ధిస్తున్నారు. సదరు మాజీ మంత్రి-తెలంగాణ సర్కారు ప్రేమించే మరో పీఠాథిపతి దిశానిర్దేశంలో, తెలంగాణకు చెందిన ఓ టీటీడీ బోర్డు సభ్యుడు రంగంలోకి దిగారు. 13న జరిగిన ధర్మాచార్యుల సభకు హాజరయిన పీఠాథిపతుల వద్దకు వెళ్లిన  సదరు టీటీడీ బోర్డు సభ్యుడు, కేవలం జగన్ సర్కారుపై అసంతృప్తితోనే ధర్మాచార్యుల సభ నిర్వహించారని వివరించారు. నిజానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో దాడులు లేవని పీఠాథిపతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం లేదని, అవన్నీ స్థానిక కారణాలతో జరుగుతున్నవేనని చెప్పారు.  అందుకు బాధ్యులను కూడా అరెస్టు చేశారని, తన వద్ద ఉన్న నివేదికను పీఠాథిపతులకు అందించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో 25 కోట్లతో 500 దేవాలయాలు నిర్మిస్తున్నామని విరరించారు. దానితోపాటు పనిలోపనిగా.. తాము తిరుపతిలో ఈనెలాఖరులో నిర్వహించనున్న, ధర్మాచార్యుల సభకు హాజరుకావాలని ఆహ్వానించినట్లు సమాచారం. దానితో పీఠాథిపతులు కూడా సంతృప్తి చెందినట్లు ప్రచారం జరుగుతోంది.

వీటికిమించి.. పీఠాలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయం చేస్తుందని, సదరు టీటీడీ సభ్యుడు వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. కంచి పీఠానికి అతి సన్నిహితంగా వ్యవహరించే, ఈ టీటీడీ సభ్యుడి రాయబారం ఫలించినట్లే హిందూ సంస్థల్లో ప్రచారం జరుగుతోంది. విశాఖ పీఠాధిపతి ఆశీస్సులతో టీటీడీ పదవి పొందిన సదరు సభ్యుడు, తిరుపతిలో ఈనెలాఖరులో నిర్వహించనున్న ధర్మాచార్యుల సభకు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుండటం విశేషం.