పవన్ ఆదేశాలతోనే టీడీపీతో పొత్తు?

1141

అమిత్‌షాకు సోముపై పవన్ ఫిర్యాదు?
ఎన్నికల ప్రచారంలో కమలదళానికి దూరంగా జనసేన
ఈసారి కలసివస్తున్న కాపు కార్డు
( మార్తి సుబ్రహ్మణ్యం)

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన చెట్టపట్టాల్ వెనుక జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. స్థానికంగా బీజేపీకి ఎక్కడా కనీస బలం లేకపోవడం, కనీస స్థాయిలో కూడా  పోటీ చేసే అభ్యర్ధులు తగినంతమంది లేకపోవడమే,  పవన్ నిర్ణయానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీతో కలసి పనిచేస్తేనే, క్షేత్రస్థాయిలో తమ పార్టీ ఉనికి ఉంటుందన్న దూరదృష్టితోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తొలి- రెండవ దశ ఎన్నికల్లో జనసేనకు సంతృప్తికర ఫలితాలు వచ్చాయని జనసేన నేతలు కూడా చెబుతున్నారు.

నిజానికి ఎన్నికల్లో బీజేపీతో కలసి పనిచేయాలని భావించిన జనసేనకు, గ్రామస్థాయిలో బీజేపీ అసలు బలమేమిటో బోధపడింది. జాతీయ పార్టీ, దానికితోడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీకి సర్పంచులను పక్కకుపెడితే, కనీసం వార్డుల్లో పోటీ చేసేంత స్థాయి, సంఖ్యలో అభ్యర్ధులు లేకవడం జనసైనికులను ఖంగుతినింపించింది. నామినేషన్లు వేసిన అభ్యర్ధుల్లో  చాలామంది నాన్ సీరియస్‌గా వ్యవహరించటం, ప్రచారంలో తమను ఎక్కడా ఆహ్వానించకపోవడం  జనసైనికులను ఆందోళనకు గురిచేసింది.దీనితో నాయకత్వం అనుమతి అవసరం లేకుండానే,  జనసైనికులు  ఎక్కడికక్కడ  స్థానికంగా టీడీపీ నేతలతో కలసి ఎన్నికల రంగంలోకి దిగారు. ఇది అటు వైసీపీతో ఒంటరి పోరాటం చేస్తున్న టీడీపీకి సైతం ఉత్సాహం ఇచ్చింది. దానితో తాము గెలవలేని చోట్ల జనసేనకు, ఆ పార్టీ ఉనికి ఉన్న చోట్ల టీడీపీ ఒక అవగాహన మేరకు పోటీలో దిగాయి.

దీనితో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలు గమనించిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్, స్థానికంగా టీడీపీతో కలసి సర్దుబాట్లు చేసుకోవాలని సూచించినట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఉనికి- నేతల సత్తా  మీడియాలోనే తప్ప.. జనంలో లేదన్న వాస్తవాన్ని గ్రహించిన తర్వాతనే పవన్, తన పార్టీ మనుగడ కోసం, తప్పనిసరి పరిస్థితిలూనే  ‘దేశం’తో దోస్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కాగా కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పవన్ భేటీ అయ్యారు. ఆ సందర్భంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రధానంగా అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలపైనే, పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీర్రాజు  పొంతన లేకుండా చేస్తున్న ప్రకటనల వల్ల గందరగోళం పెరుగుతోందన్నారు. ఇటీవల బీసీ నేతకు సీఎం పదవి ఇస్తామన్న వీర్రాజు వ్యాఖ్యలపై, తమ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసిందని, దానిపై తమ నాయకులు వివరణ అడిగిన తర్వాతనే వీర్రాజు మాటమార్చారని వివరించారు.

ముఖ్యంగా స్థానికంగా జరిగే ఆందోళన కార్యక్రమాలకు జనసేన నేతలకు సమాచారం ఇవ్వనందున, తమ కార్యకర్తలు కూడా వాటికి దూరంగా ఉండాల్సి వస్తోందని వివరించారు. ఇదే విధానం కొనసాగితే  బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలసి పనిచేయడం కష్టమవుతుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.  ఇక తిరుపతి ఉప ఎన్నికలో బలం లేని బీజేపీ కంటే, క్యాడర్ బలం ఉన్న జనసేన పోటీ చే స్తేనే ఫలితాలు వస్తాయని అమిత్‌షాకు సూచించినట్లు సమాచారం. అయితే అమిత్‌షా దానిపై స్పందించకపోయినా, తిరుపతి వచ్చినప్పుడు దానిపై చర్చిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు,  కాపు కులం కార్డు బాగా పనికివస్తున్నట్లు పోటీ తీరు స్పష్టం చేసింది. జనసేన అభ్యర్ధులు పెద్దగా గెలవకపోయినప్పటికీ.. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాల్లో కాపులే సర్పంచి, వార్డు మెంబర్లకు ఎక్కువ గా పోటీ పడుతుండటం ప్రస్తావనార్హం. కాపు-బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే జనసేన అభ్యర్ధులు బరిలో దిగుతుండగా, స్థానిక పరిస్థితుల మేరకు టీడీపీ కూడా వారికి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా కలసిరాని కాపు కార్డు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికిరావడం జనసైనికులలో ఉత్సాహం నింపింది.