వెబ్‌సైట్‌తో టీడీపీ ప్రచారానికి వైసీపీ చెక్

474

గెలిచిన అభ్యర్ధుల ఫొటోలు వెబ్‌సైట్‌లో
టీడీపీ అగ్రనేతల ఇలాకాలో పార్టీ ఓటమి
( మార్తి సుబ్రహ్మణ్యం)

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ విజయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ నిర్ణయించింది. ఆ మేరకు తమ పార్టీ  నుంచి గెలిచిన  మద్దతుదారుల ఫొటోలను వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాట్లు చేస్తోంది.  ఇప్పటికే కొన్ని జిల్లాల సమాచారాన్ని మీడియా వెబ్‌సైట్‌లో ఉంచింది. పూర్తి స్థాయి సమాచారం వచ్చేకొద్దీ వాటిని పార్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చే యనుంది. దీనిద్వారా, టీడీపీది మైండ్‌గేమ్ అన్న విషయాన్ని ప్రజలకు చెప్పడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

పంచాయితీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ, ఆ ప్రభావం మిగిలిన దశ ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌పై పడకుండా ఉండేందుకే, గెలుపు సంఖ్యపై పొలిటికల్ గేమ్ ఆడుతోందని వైసీపీ భావిస్తోంది. తొలి దశ ఫలితాల్లో తాము 38.74 శాతం ఓట్లు సాధించామని చంద్రబాబు ప్రకటించారు. తొలిదశ ఫలితాల తర్వాత టీడీపీ క్యాడర్ పార్టీ ఆఫీసు వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ పరిణామాలు స్థానిక కారణాల వల్ల, నిస్సహాయంగా ఉన్న టీడీపీ వర్గాలకు ఉత్సాహం తెప్పించింది. దీనితో నష్టనివారణకు దిగిన వైసీపీ, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల సంఖ్యను పార్టీల వారీగా,  ఫొటోలతో సహా విడుదల చేసే ఏర్పాట్లు చేస్తోంది.

అటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా,  ఎన్నికల ఫలితాల గణాంకాలు విడుదల చేశారు. ఆ ప్రకారంగా వైసీపీ 264ం, టీడీపీ 510 మంది సర్పంచిలను గెలిచినట్లు తేలింది. అయితే టీడీపీ భవిష్యత్తులో కూడా తన లెక్కల ప్రచారాన్ని కొనసాగించే ప్రమాదం ఉందని ఊహించిన వైసీపీ.. తొలి విడత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్ధుల వివరాలను, ఫొటోలతో సహా పార్టీ వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాటుచేస్తోంది. ముందుగా తన మీడియాకు సంబంధించిన ఈ-పేపర్‌లో అభ్యర్ధుల ఫొటోలను జిల్లాల వారీగా ఉంచింది. పార్టీ కండువాలున్న అభ్యర్ధుల ఫొటోలను ఉంచినందున, ప్రజలకు నిజానిజాలు తెలిసే అవకాశం ఉందన్న భావనతోనే, ఈ సాంకేతిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు క నిపిస్తోంది.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తమపై మాటల యుద్ధం చేస్తున్న టీడీపీ అగ్రనేతల సొంత ఇలాకాలో,  ఆ పార్టీని ఓడించడంపై వైసీపీలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలో,  టీడీపీ మరోసారి ఓడిపోవడంపై వైసీపీ నేతల్లో ఆనందం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 454 స్థానాలకు ఎన్నికలు జరిగితే. అందులో వైసీపీకి 362, టీడీపీకి 82 సర్పంచి స్థానాలు దక్కాయి. తొలి విడత ఫలితాల్లో టీడీపీకి ఎక్కువగా వచ్చిన సర్పంచులు కూడా,  చిత్తూరు జిల్లానే కావడం విశేషం.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో,  135 పంచాయతీలకు 112 చోట్ల వైసీపీ గెలిచింది.  లోకేష్  ఓడిపోయిన మంగళగిరిలో మొత్తం 18 పంచాయితీలుండగా అందులో 14 వైసీపీ గెలిచింది. టీడీపీలో నెంబర్‌టూగా ఉన్న యనమల సొంత తుని నియోజకవర్గంలో 58 పంచాయితీలుండగా, 54 చోట్ల వైసీపీ గెలిచింది. చివరకు యనమల సోదరుడి కొడుకు కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇలాకాలోని మైలవరంలో, 48 పంచాయితీలకు 44 వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇలాకాలోని పెద్దాపురంలో 41 పంచాయితీలకు,  34 పంచాయితీలను వైసీపీ గెలుచుకుంది.

ఈ ఫలితాలు తమకు మరింత ఉత్సాహం ఇచ్చేవేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.  ‘‘ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో మా పార్టీకి  బలం తగ్గలేదన్న నిజాన్ని రుజువు చేశాయి. ఇవి వచ్చే మరిన్ని ఎన్నికలకు టానిక్‌లా పనిచేస్తాయి. టీడీపీ లేని విజయాలను ప్రచారం చేసుకుంటూ భ్రమల ప్రపంచంలో బ్రతుకుతోంది. ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికయినా వాస్తవాలు గ్రహించి, వైసీపీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మద్దతిస్తే కనీసం ప్రజల్లో అయినా వారికి గుర్తింపు ఉంటుంద’ని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.