జులై 8 నుంచి షర్మిల తెలంగాణలో పాదయాత్ర?

335

ఏడాది పాటు పర్యటన?
వైఎస్సార్‌టీపీ జెండా ఖరారు?
      ( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల, తన తండ్రి జన్మదినమైన జులై 8 నుంచి.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏడాదిపాటు ఈ పాదయాత్ర ఉంటుందని పార్టీ వ ర్గాలు చెబుతున్నాయి. ఆలోగా జిల్లా పర్యటనలు, కమిటీలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే, లోటస్‌పాండ్ కార్యాలయం సోదరుడు జగన్‌ది కావడంతో, పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగిస్తే,  జగన్-షర్మిల ఒక అవగాహనతోనే రాజకీయాలు నడిపిస్తున్నారన్న  సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీనితో పార్టీ కార్యాలయం అక్కడే ఉంచాలా? వేరే ప్రాంతంలో తీసుకోవాలా? అని తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా వైఎస్సార్‌టీపీ జెండా డిజైన్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ పేరు, జండా డిజైన్‌ను త్వరలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత పార్టీ నమోదు, ఆ తర్వాతనే డిజైన్‌ను సమర్పిస్తారు. ఆ మేరకు కొందరు న్యాయవాదులను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. గతంలో సిరిసిల్లలో కేటీఆర్ మీద పోటీ చేసిన ఓడిపోయిన ఓ న్యాయవాదిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆర్కేతో మంతనాల మర్మమేమిటి?

కాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాజాగా షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌తో హైదరాబాద్ లోటర్‌పాండ్‌లోని కార్యాలయంలో  భేటీ కావడం చర్చనీయాంశమమయింది. గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు, తొలిరోజు నుంచి చివరి వర కూ ఆర్కే ఒక్కరే ఆమె వెంట ఉన్నారు. దానికి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలు కూడా ఆయనే చూశారన్న ప్రచారం పార్టీలో ఉంది. జగన్ తల్లి విజయమ్మ కూడా ఆర్కే సలహాలు తీసుకుంటారన్న ప్రచారం లేకపోలేదు. గత ఎన్నికల్లో  ఆర్కే తరఫున షర్మిల ప్రచారం కూడా నిర్వహించారు. దీన్నిబట్టి విజయమ్మ కుటుంబంతో ఆర్కే ఎంత సన్నిహితంగా ఉంటారో స్పష్టమవుతుంది.

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనున్న నేపథ్యంలో, ఆర్కే ఆమెతో భేటీ కావటం చర్చనీయాంశమయింది. అయితే, తన  సోదరుడైన వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి తెలియకుండా,  ఆళ్ల ఆమెను కలిసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నారు. షర్మిల ఆహ్వానిస్తేనే ఆళ్ల ఆమె కార్యాలయానికి వెళ్లారే తప్ప, ఆయనంతట ఆయన వెళ్లే అవకాశం లేదని ఆర్కే సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల జగన్‌కు రాజకీయంగా వచ్చే ఇబ్బందులు, తెలంగాణ-ఏపీకి ప్రభుత్వపరంగా తలెత్తే సమస్యలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే రాజకీయంగా జగన్‌కు ఇబ్బందిలేకుండా చూడాలని, ఆర్కే ఆమెకు సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి లాభం కలిగించకూడదని, ఆయన సలహా ఇచ్చినట్లు ఆర్కే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.