వైసీపీలో ‘స్థానిక’ సమరోత్సాహం

558

అందుకే మిగిలిన ఎన్నికలకూ సై
జగన్ ఇప్పుడే దారిలోకి వస్తున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అనుభవమయితే గానీ తత్వం బోధపడదు. ఏపీ సీఎం జగన్‌కు స్థానిక ఎన్నికలు అనుభవం నేర్పాయి. దానితో తత్వం బోధపడినట్టయింది.  స్థానిక సంస్థల ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉన్న వైసీపీ సర్కారు,  మిగిలిన ఎన్నికలకూ సిద్ధమని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ఈ అంశంలో జగన్ సర్కారు మునుపటి మాదిరిగా మొండిపట్టుదలకు పోకుండా, రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించడం అటు పార్టీ నేతలనూ విస్మయపరిచింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న జగన్‌లో వస్తున్న ఈ మార్పు శుభపరిణామమేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిమ్మగడ్డ ఒక్కరే ఏమీ చేయలేరన్న విషయాన్ని తమ అధినేత జగన్, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారన్న వ్యాఖ్యలు అటు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే, ఆ మేరకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. దానితో సహజంగా తమ పార్టీ అధినేత, సీఎం జగన్ యధావిథిగా మళ్లీ కోర్టును ఆశ్రయించి, ఆ ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని వైసీపీ నేతలు భావించారు. కానీ అందుకు భిన్నంగా, రానున్న అన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పక్షాన సంసిద్ధత వ్యక్తం చేయడం వారిని విస్మయపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయమే, జగన్ సర్కారు సంసిద్ధతకు కారణంగా స్పష్టమవుతోంది.

పంచాయితీ తొలి, రెండవ దశ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులే 80 శాతం విజయం సాధించారు. అంటే వైసీపీకి 81.25 శాతం, టీడీపీ 15.63, జనసేన-బీజేపీ 1.41 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. దీన్నిబట్టి గ్రామసీమలు తమవైపే ఉన్నాయన్న నిర్థారణకు వచ్చిన జగన్ సర్కారు, మిగిలిన ఎన్నికలకూ సిద్ధమేనని తనంతట తాను ముందుకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలు చేయించడం ద్వారా, జగన్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నారు.

అటు టీడీపీ కూడా ఆర్ధిక ఇబ్బందులతోపాటు, స్థానికంగా తలెత్తిన సమస్యలకు లొంగిపోవలసి వచ్చింది. కొద్దిమంది మాజీ మంత్రులు, సీనియర్లు మాత్రమే.. తమ ఇలాకాలో జరిగిన ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, ఆ మాత్రం ఫలితాలయినా సాథించగలిగారు. ఇక బీజేపీకి పోటీచేసేందుకు అభ్యర్ధులే దిక్కులేని విషాద పరిస్థితి. జనసేన మాత్రమే ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టి పోటీ ఇచ్చింది. జనసేన-టీడీపీ-బీజేపీ అభ్యర్ధులు కలసి పోటీ చేయడమే ఈ ఎన్నికల్లో కొత్త పరిణామం.

ఈ వాస్తవాలను గ్రహించిన తర్వాతనే జగన్, తన వైఖరి మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.  విపక్షాలు బలహీనంగా ఉన్న సమయంలోనే, మిగిలిన ఎన్నికలు కూడా నిర్వహించడం మేలన్న అభిప్రాయానికి ఆయన వ చ్చినట్లు కనిపిస్తోంది. పంచాయితీకి-మున్సిపాలిటీ ఎన్నికలకు తేడా ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పనితీరుపై ఇచ్చే తీర్పునుబట్టి పాలనలో మార్పు చేర్పులు చేసుకోవాలని భావిస్తున్నట్లు,  జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బట్టి అర్ధమవుతోంది.

నిజానికి, తొలుత పంచాయితీ ఎన్నికలను  వ్యతిరేకిస్తూ, సర్కారు  కోర్టుకు వెళ్లటాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. అధికారం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రతిపక్షాల బలహీనతోపాటు.. మరో మూడేళ్లు తమ ప్రభుత్వమే ఉన్నందున, ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పరన్నది ఆ పార్టీ సీనియర్ల వాదన. అయితే.. నిమ్మగడ్డ రమేష్ ఆ స్థానంలో ఉన్నంతవరకూ, ఎలాంటి ఎన్నికలూ జరపకూడదన్న జగన్ మొండిపట్టుదల, ఇగోనే ఈ పరిస్థితి తెచ్చిందన్న భావన పార్టీ నేతల్లో ఇప్పటికీ లేకపోలేదు.

దీనిపై ‘సూర్య’లో సైతం వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.  చివరకు ప్రస్తుత ఫలితాల్లో తమ వాదనే గెలిచిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేదో ముందే అంగీకరించి ఉంటే, నాయకత్వం అహం దెబ్బతిని, కోర్టులో ఎదురుదెబ్బ తగిలేది కాదంటున్నారు. ఇప్పటికయినా మేల్కొని, వాస్తవాలు గ్రహించి మిగిలిన ఎన్నికలకు సిద్ధపడటం, శుభపరిణామమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అనుభవాల  దృష్యా.. ఇకనయినా జగన్,  సీనియర్ల సలహాలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి.. ‘స్థానికం’పై బాబు చేసిన తప్పే.. జగన్ చేస్తున్నారా?