బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొడుస్తున్న పొత్తు!

541

సోము వీర్రాజు ఇలాకాలో కలసి పోటీ
టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి ఫ్లెక్సీలు
                        ( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తు బంధం తెంచుకున్నా, కిందిస్థాయిలో మాత్రం వారి స్నేహం కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీ జీవీఎల్ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, గ్రామ స్థాయిలో మాత్రం టీడీపీ-బీజేపీ-జనసేన  కలసిమెలసి రాజకీయంగా అడుగులు వేస్తున్న వైచిత్రి పంచాయితీ ఎన్నికలు ఆవిష్కరిస్తున్నాయి. ఇది ఒకరకంగా రాష్ట్ర-పార్టీ జాతీయ నాయకత్వాలకు శరాఘాతమే. అంటే జాతీయ నాయకత్వం- కింది స్థాయి కార్యకర్తల ఆలోచనకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నది స్పష్టమవుతోంది.

పంచాయితీ ఎన్నికల రెండవ దశలో కూడా, టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. నామినేషన్లు వేసేందుకు వైసీపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటనలు చేయడం మినహా,  ఎలాంటి సాయం చేయలేకపోతోంది. అగ్రనేతలంతా ప్రెస్‌మీట్లకు, వీడియోలకు, టీవీ చర్చలకు పరిమితమయ్యారు. ప్రతిపక్షాల మాదిరిగా జిల్లా ఎస్పీలు, డీజీపీ, ఎస్‌ఈసీని కలసి ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉన్నారు. దానితో ఈ మూడు పార్టీల నేతలు..  స్థానికంగా తమలో ఎవరికి బలం ఉంటే, వారు పోటీ చేస్తూ మిగిలిన రెండు పార్టీల సాయం తీసుకుంటున్నారు.   తొలి దశ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ-బీజేపీ, మరికొన్ని చోట్ల టీడీపీ-జనసేన బరపరచిన అభ్యర్ధులు ఒక అవగాహనతో కలసిపోటీచేశారు. రెండవదశ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.

స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్, గతంలో ఆయన పోటీ చేసి ఓడిన కడియం నియోజకవర్గంలో అయితే.. మూడు పార్టీల కార్యకర్తలు కలసి ప్రచారం నిర్వహించడం, రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్ధులు ఏకంగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, వాటిపై మోదీ-పవన్-సోము వీర్రాజు-గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఫొటోలు ఏర్పాటుచేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. గత ఎన్నికల ముందు విడిపోయిన ఈ పార్టీలు, మళ్లీ రెండేళ్లకు కలసి పోటీ చేస్తుండటమే విశేషం.ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన అభ్యర్ధులు ఒక అవగాహనతో సగం సగం ప్రాతిపదికన కలసిపోటీ చేస్తున్నారు. ఎక్కువగా టీడీపీ-జనసేన కలసి పనిచేస్తున్నాయి. వారితో బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు.  కలసిపోటీ చేయడమే కాదు. మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రచారంలో తమ పార్టీల కండువాలు వేసుకుని మరీ ప్రచారంలో పాల్గొనడం బట్టి… పొత్తు పుటుక్కుమన్నప్పటికీ, కింది స్థాయి కార్యకర్తల మధ్య ఇంకా మానసిక బంధం కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది పార్టీ జాతీయ నాయకత్వానికి పంపుతున్న సంకేతంగానే అర్ధమవుతోంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమండ్రి రూరల్‌లో నెలకొన్న ఈ విచిత్ర పరిస్థితిపై ఓ రాష్ట్ర బీజేపీ ప్రముఖుడు ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆయనను ఎవరూ లెక్కచేయలేదట. దానితో ఆయనే దిగివచ్చి.. ‘సరే అయితే. నా ఫొటో కూడా ఫ్లెక్సీల్లో పెట్టండి’ అని కోరాల్సి వచ్చిందట.

 రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, గతంలో ఆయన పోటీ చేసిన కడియం నియోజకవర్గంలో బీజేపీ.. రేపటి పంచాయితీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఆసక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డికి చెందిన అనంతపురం, ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కడప, ఎంపీ టిజి వెంకటేష్‌కు చెందిన కర్నూలు, మరో ఎఱపీ జీవీఎల్‌కు చెందిన గుంటూరు  జిల్లాలోనూ కనిపిస్తోంది. అయితే బీజేపీ చాలాచోట్ల అసలు పోటీనే పెట్టలేదని ప్రచారం జరుగుతోంది.

నిజానికి తొలిదశ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది? ఎన్ని గెలుచుకుందన్న విషయాన్ని అన్ని పార్టీలు ప్రకటించాయి.  కానీ బీజేపీ మాత్రం ఇప్పటిదాకా ఆ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచింది. జిల్లాల నుంచి అధ్యక్షులు వివరాలు పంపించినా, వాటిని ఇప్పటివరకూ ప్రకటించే సాహసం చేయలేకపోతోంది. ఈ విషయంలో జనసేన మెరుగ్గా ఉంది. తమకు ఈ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు వచ్చాయని ధైర్యంగా ప్రకటించుకుంది. బీజేపీ ఆ సాహసం కూడా చేయలేకపోవడమే ఆశ్చర్యం. పోటీకి దిగేందుకు తగినంతమంది అభ్యర్ధులు దొరక్కపోవడమే దానికి కారణమన్నది బహిరంగ రహస్యం.

తొలి దశ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన అభ్యర్ధులే ఎక్కువమంది పోటీ చేశారు. వారికి అభ్యర్ధులు దొరకడం కొంత కష్టమయినప్పటికీ, మొత్తానికి పోటీ చేయించడంలో విజయం సాధించింది. అయితే బీజేపీకి మాత్రం అభ్యర్ధులు దొరక్కపోవడంతో, చాలాచోట్ల నిలబెట్టలేకపోయారు. అభ్యర్ధులున్న చోట్ల మాత్రం టీడీపీతో అవగాహన చేసుకుని బరిలో నిలిచారు. బీజేపీ జిల్లా అధ్యక్షులే చచ్చీ చెడీ, మిలలిన పార్టీలతో అవగాహనతో కొన్ని చోట్ల పోటీ చేయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. రెండో దశ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు,  స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి నియోజకవర్గంలోనే రుజువయింది. కాగా పంచాయితీ ఎన్నికల తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేనకు 1.33 శాతం ఓట్లు వచ్చాయి.