స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కృషి

328

టీడీపీ , జనసేన , ఇతర పార్టీలు కలిసి రావాలి
సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూడొద్దు
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జగన్ వెంటే ప్రజలు
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

వైజగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు.

శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు . వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని వైజాగ్ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారన్నారు . పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రిక్వస్ట్ చేసి వచ్చారని , ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడన్నారు . స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు .

తెలుగుదేశం , జనసేన , ఇతర పార్టీలు కూడా కలిసి రావాలన్నారు . ప్రజాపోరాటం చేయాల్సి వస్తే అందరూ సిద్ధపడాలని , అలా కాకుండా ఈ సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూస్తున్నారన్నారు . పార్లమెంట్ లో , బయట కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా వైసీపీ కృషి చేస్తుందన్నారు . చంద్రబాబు పెద్ద డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అని , ఆయన దెబ్బకు ఎన్టీఆరే కిందపడిపోయారన్నారు . గత 30 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాటకాలను చూస్తూనే ఉన్నారని , ఆయన తీసేసిన తహసీల్దార్ అని , ప్రజలెప్పుడో రాజకీయ సమాధి కట్టారన్నారు . రాష్ట్రంలో టీడీపీ ఏదో విధంగా నిలబడాలంటే ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు , క్యాడర్ మెడపెట్టి బయటకు గెంటాలన్నారు .

అలా కాకుండా చంద్రబాబును పెట్టుకుని పార్టీ నడిస్తే టీడీపీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు . పంచాయతీ ఎన్నికల దగ్గర నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలనైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుందన్నారు . రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు జగన్మోహనరెడ్డి వెంటే ఉంటారన్నారు . ఎన్నికలంటే చంద్రబాబు వంటి చవట దద్దమ్మలు భయపడతారన్నారు . చంద్రబాబుకు ఉన్న కొద్దిపాటి మెదడు కూడా మొదటి విడత ఎన్నికల ఫలితాల తర్వాత పోయిందన్నారు . చంద్రబాబు మానసిక పరిస్థితి గురించి మెంటల్ డాక్టర్‌ను అడిగితే సరిగ్గా చెబుతారని , తనకు అంత నాలెడ్జ్ లేదని మంత్రి కొడాలి నాని అన్నారు .