మాఘమాసం విశిష్టత ఏమిటి?

878

‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.

మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం.”స్నాన సమయంలో, ‘ప్రయాగ’ ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.”   మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. మాఘపూర్ణిమ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

 మాఘమాసం మహిమ

‘అఘము’ అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. “మాఘము” అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.

మాఘమాసం మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

 మాఘ విశిష్టత

ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

 ఈ మాసంలోని ముఖ్య తిథులు:

1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.

2. శుద్ధ విదియ
3. శుద్ధ చవితి
4. శుద్ధ పంచమి
5. శుద్ధ షష్టి
6. శుద్ధ సప్తమి
7. అష్టమి
8. నవమి
9. ఏకాదశి
10. ద్వాదశి
11. త్రయోదశి
12. మాఘ పూర్ణిమ
13. కృష్ణపాడ్యమి
14. కృష్ణ సప్తమి
15. కృష్ణ ఏకాదశి
16. కృష్ణద్వాదశి
17. కృష్ణ చతుర్దశి
18. కృష్ణ అమావాస్య

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి” అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్తవ్రతము, పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతలచేత సైతం పూజలందుకుంటారని కాశీఖండములో తెలియజేశారు. “కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని ‘కాలదర్శనం’ లో చెప్పబడింది. అయితే “సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం” అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.

మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన, జప, తపములు చాలా ఉత్తమమైనవి.

ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు…… “దుఃఖ దారిద్ర్య నాశాయ, శ్రీవిష్ణోతోషణాయచ! ప్రాతఃస్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!”
అని చేసిన తరువాత,   “సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిభ్రష్టం, పాపం యాతు సస్రదా!” అని చదవి సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇవ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.
ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట.

“మాఘశుద్ద పంచమి” ని “శ్రీ పంచమి” అంటారు. ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీమన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీపంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.

ఇక మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి” అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో “ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.” స్నానానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కార ప్రియఃసూర్యః అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది.

ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి, కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.” సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యాజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి.

 రథసప్తమి నాటి స్నానం –  

సప్త సప్త మహాసప్త, సప్త ద్వీపా వసుంధరా!
సప్తార్క పర్ణమాధాయ సప్తమి రథసప్తమి
అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేసినట్లైతే, పాప విముక్తి కలిగిస్తుందట.

 భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి

మాఘమాసస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!
ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్యఃప్రాప్తే దివాకరే!”

శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమి నాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు మహిమాన్వితాలే.
ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి” వరకూ అన్ని పర్వదినాలే.