విదేశీయులకు రైతు ఉద్యమంతో ఏం పని?

301

అంతర్జాతీయ సెలెబ్రిటీలమంటూ కొంత మంది అసలు వాళ్లకేమాత్రం సంబంధంలేని, భారత దేశంలో రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా గత రెండు రోజులుగా ట్వీట్లు చేస్తున్న విషయం విదితమే. ట్వీట్లు చేసిన వాళ్ళల్లో కొంత మంది పాప్ స్టార్లు, ఇతరులు, అందరూ వారి వారి రంగాలలో సరైన అవకాశాలు లేక, గుర్తింపు కోసం ప్రాకులాడే వారే. సరే అయితే ఉన్నట్లుండి ఈ ఉద్యమం గురించి సదరు స్టార్లు ఎందుకు ట్వీట్లు చేశారు? దానికి ఎందుకింత ప్రచారం? మొత్తం ఎలా జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం.

కొన్ని రోజులుగా రైతుల పేరుతో ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు, కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అలాగే ఉద్యమం చేస్తున్న వారి అసలు లక్ష్యం వేరని, అందుకే రైతు నాయకులు చర్చలకు కూడా సిద్ధపడడం లేదనేది కేంద్రం వాదన.

వారి మాటలు నిజం అనేలా రిపబ్లిక్ దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండలో సంఘ విద్రోహశక్తులు యధేచ్చగా ఢిల్లీ నడివీధుల్లో స్వైర విహారం చేశాయి. ఆ దృశ్యాలు చూసిన యావత్ దేశం ఆగ్రహంతో రగిలి పోయింది.

అసలు ఇన్ని రోజులు అంత మంది అలా ఉద్యమం ఎలా చేస్తున్నారు? వారికి నిధులు ఎవరు సమీకరిస్తున్నారు? అంటే….. దేశ, విదేశీ భారత వ్యతిరేక శక్తులు, ప్రధాని మోడీ అంటే ద్వేషంతో రగిలిపోయే కొంత మంది స్వదేశీ నాయకుల అండ దండలు ఈ ఉద్యమానికి దండిగా ఉన్నాయి.

రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనలతో ఉద్యమం మసకబారింది. త్రివర్ణ పతాకాన్ని అవమానించడంతో దేశ ప్రజల్లో ఉద్యమనాయకుల పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానితో మసకబారిన తమ ఉద్యమానికి తిరిగి ఊపు తేవాలి, సిక్కు సోదరుల్లో దేశం మీద ద్వేషం కలిగించాలని ఖలిస్థాన్ వేర్పాటు వాదులు, భారత వ్యతిరేక శక్తులు పన్నిన కుట్రలో భాగమే ఈ సెలెబ్రిటీల చేత ట్వీట్లు చేయించే కార్యక్రమం.

ఖలిస్థాన్ వేర్పాటు గ్రూపులకు డబ్బుకు కొదవలేదు. ఆ డబ్బుతోనే కొంత మంది మసకబారిన తారలను రంగంలోకి దించారు. వారి ద్వారా సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు. నిజానికి భారత ప్రభుత్వం గట్టిగా అనుకుని ఉంటే ఉద్యమాన్ని మొదట్లోనే ఆపేసుండేది అనే వాదన కొందరిలో ఉంది. కానీ అది ప్రజాస్వామ్య హక్కులను కాల రాయడమే అవుతుంది. అందుకే ప్రభుత్వం సహనంతో చర్చలు జరుపుతూ వచ్చింది.

పాప్ స్టార్ ఒకావిడ ….. “రైతులకు కరెంట్ ఆపేశారు, ఇంటర్నెట్ ఆపారు, వాళ్ల మీద దాడులు చేశారు” అని ట్వీట్లు చేశారు. నిజానికి మొన్న ఢిల్లీలో అరాచకవాదుల హింస జరిగే వరకూ వాళ్ళకి అందుతున్న సౌకర్యాలు ఏమీ ఆపలేదు. వాళ్ళు బరితెగించి ఎర్రకోటపై దాడికి పాల్పడ్డ తర్వాతే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిజానికి సదరు పాప్ సింగరు పాప రైతుల పేరుతో నడుపుతున్న ఉద్యమంపై CNN వార్తా సంస్థ ప్రచురించిన ఒక వార్తా కథనం ఆధారంగానే ట్వీట్ చేసింది. అంటే నిజాలు తెలుపవలసిన ప్రముఖ వార్తా సంస్థలే తప్పుడు కథనాలను ప్రచురించి ప్రచారం చేస్తున్నాయన్నమాట.

ఈ విషయంలో మన తెలుగు మీడియా కూడా ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన సదరు పనిలేని పాపలను అంతర్జాతీయ ప్రముఖులంటూ ఆకాశానికేత్తేస్తోంది. నిజానికి ఈనాటి వరకూ వాళ్ళ ముఖాలు కాదు కదా పేర్లు కూడా చాలామందికి తెలీదు.

రైతు ఉద్యమంలో ఖలిస్థాన్ ఉగ్రవాద మూకలున్నాయి, ఇస్లామిక్ తీవ్రవాదులున్నారు అని ఎంతగా, ఎందరు మొత్తుకుంటూ ఉన్నా మన మీడియా వినిపించుకోవడం లేదు. పదే పదే రైతులు, అన్నదాతలు అంటూ ఆ నకిలీ ఉద్యమాన్ని తలకెత్తుకుంటోంది. అసలు కొంతమంది ముస్లిములు సర్దార్జీలుగా వేషాలు వేసుకుని ఉద్యమంలో పాల్గొంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చాయి. సిక్కు వేషంలో ఉన్న ముస్లిములు కొందరు నమాజు చేస్తున్న దృశ్యాలు కూడా మాధ్యమాలలో దర్శనమిచ్చాయి. వీటిగురించి మన మీడియా ఎందుకు చెప్పదు? వీటిని ఎందుకు చూపించదు?

సరే రైతు ఉద్యమంగా చెప్పబడే ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ఏమైనా ఉందా? లేదు. కనీసం ఆ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలోనైనా దేశం మొత్తం మీది నుంచి రైతులు పాల్గొంటున్నారా? అదీ లేదు. కానీ మీడియా మాత్రం ఆ ఉద్యమాన్ని మహా గొప్ప ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇదెంతవరకూ సబబు? అసలు ఇదంతా చూస్తూ ఉంటే రైతుల పేరుతో ఉద్యమం నడిపిస్తున్న వారి నుంచి దానికి అనుకూలంగా వార్తలు వ్రాస్తున్న మీడియాకు ఏమైనా ముడుపులు అందుతున్నాయేమోనన్న సందేహం రాకమానదు ఎవరికైనా.

గతంలో మన దేశంలోని ప్రముఖులలో ఎక్కువమంది మీడియా మాయలో ఉండేవారు. మీడియా ఏ పాట పాడితే వారూ అదే పాట పాడేవారు. మీడియా ప్రాపు కోసం తగ ప్రాకులాడేవారు కూడా. కానీ సంతోషకరమైన విషయమేమిటంటే…. ఇప్పుడు అలాంటి వారిలో చాలా మార్పు కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే వారు స్పందిస్తున్నారిప్పుడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రగ్యాన్ ఓజా, ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీం కెప్టన్ విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు, కొందరు సినీ ప్రముఖులు కూడా భారతదేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీయుల జోక్యాన్ని ఖండిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెండూల్కరయితే “మీరు ప్రేక్షకులుగానే ఉండండి, పాత్రధారులు కాకండి” అని వారిని హెచ్చరించారు.

పాప్ స్టార్ రిహానా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, పర్యావరణవేత్త గ్రెటా థన్ బర్గ్ ల తోపాటు అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు హేలీ స్టీవెన్స్, మరో సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బంధువు మీనా హారిస్ లు భారత్ లో జరుగుతున్న నకిలీ రైతుల ఉద్యమంపై యధాశక్తి ఆందోళనలను వెలిబుచ్చారు. కానీ వీళ్ళ నోళ్ళు మూయించడానికే అన్నట్లుగా భారత్ చేసిన వ్యవసాయ చట్టాలు భేష్ అంటూ అగ్రదేశం అమెరికా కితాబిచ్చింది. ఏది ఏమైనా, ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, ఎవరెన్ని వ్రాతలు వ్రాసినా సాగు చట్టాలపై అమెరికా యొక్క సానుకూల స్పందన ముమ్మాటికీ ప్రభుత్వానికి నైతిక స్థైర్యాన్నిచ్చేదే. ఇంత జరిగాక ఇకనైనా ఆ ప్రముఖులనబడే పని/పస లేని స్టార్లు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉంటారని ఆశిద్దాం. అలాగే మన నసపిట్ట మీడియా కూడా అనవసరంగా అలాంటి వారిని నెత్తిన మోసి మన నెత్తిన రుద్దకుండా ఉంటుందని ఆశిద్దాం. అయినా మన అమ్ముడుపోయిన మీడియా ఎప్పటికైనా మారేనా?

                       (vskandhra.org)