ఏపీలో ఎరువులకు కొరతే లేదు

603

రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఎరువులకు కొరతే లేదు. డీఎపీ, ఎంవోపీ, ఎన్‌పీకే వంటి రసాయనిక ఎరువులకు కొరత ఏర్పడకుండా ఫెర్టిలైజర్‌ విభాగం వాటిని తగినంత పరిణామంలో అందుబాటులో ఉంచినట్లు ఎరువులు, రసాయనాల మంత్రి  డీ.వీ. సదానంద గౌడ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ గడచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో డిఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేఎస్‌ వంటి ఎరువులకు డిమాండ్‌ నిలకడగా ఉండటం లేదని తెలిపారు. 2017-18లో డీఏపీ డిమాండ్‌ 3.75 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా 2020-21 నాటికి అది 4 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఎంవోపీకి 2.41 లక్షల టన్నుల డిమాండ్‌ ఉండగా ప్రస్తుతం అది 2.80 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంది. అలాగే ఎన్‌పీకేఎస్‌కు 2017-18లో 11.50 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా 2020-21 నాటికి అది 13.50 లక్షల టన్నులకు చేరినట్లు మంత్రి తెలిపారు.

ఎఫ్‌డీఐ ప్రభుత్వ మార్గం నుంచే రావాలి
భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశానికి చెందిన ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టాలని భావిస్తే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి, ప్రభుత్వ అనుమతులతో మాత్రమే వచ్చే విధంగా విదేశీ పెట్టుబడులకు సంబంధించిన భారత్‌ విధానాన్ని 2020లో ప్రభుత్వం సవరించగా దీనిపై చైనా అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు రాజ్యసభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు.  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అంతర్జాతీయ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో) కింద ఏర్పాటైన సేవల వాణిజ్య మండలి సమావేశాలలో రెండు దఫాలు ఎఫ్‌డీఐ విధానానికి భారత్‌ చేసిన ఈ సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేసిందని చెప్పారు. దీనికి స్పందనగా చైనాతో సహా డబ్ల్యూటీవో సభ్య దేశాలు ఏవైనా కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అభ్యంతరం లేదని తెలపడం జరిగింది. భారత్‌ ఎఫ్‌డీఐ విధానానికి చేపట్టిన సవరణలు డబ్య్లూటీవో నిబంధనలను ఏమాత్రం అతిక్రమించవని స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెరుగుతున్నఎఫ్‌డీఐ
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో విదేశా ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం క్రమంగా పుంజుకుంటున్నదని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తెలి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ 2018-19లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 628.24 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ రాగా, 2019-20 నాటికి అది 904.7 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. అనుమతించిన రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఎలాంటి విధానపరమైన అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కోకుండా ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా వచ్చేందుకు ప్రభుత్వ ఎఫ్‌డీఐ విధానంలో పారదర్శకతను తీసుకువచ్చి దానిని సరళతరం చేసిందని మంత్రి అన్నారు. ఎఫ్‌డీఐ ప్రవాహాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల గురించి ఆయన వివరిస్తూ ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమం ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే సంస్థలు, దేశాల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెసిలిటేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్టుబడులతో వచ్చే వారిని ఈ విభాగం చేయి పట్టి ముందుకు నడిపిస్తుంది. వివిధ దశల్లో వారికి అవసరమైన అన్ని అంశాలలో సహకరిస్తుంది. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఎఫ్‌డీఐను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ విదేశాలలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను, వెబినార్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.