ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వమే కాపాడవలసిన అవసరం ఉంది

407

నా పేరు సందిటి  భాస్కర్ రెడ్డి.  నేను నా 9వ తరగతి మరియు పదవ తరగతి ని 1988-90 సంవత్సరాల మధ్య రామగుండం లోని ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(F. C. I) లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవడం జరిగింది.. ఎరువుల కర్మాగారం కాంపౌండ్ వాల్ కు ఆనుకునే మా ఇల్లు ఉండేది.
నా బాల్యంలో ఎక్కువ భాగం ఈ ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లోనే గడిచింది.ఈ ఎరువుల కర్మాగారం అప్పటికే తీవ్ర నష్టాల పాలై ఉన్నది. అంతవరకు ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎరువుల కర్మాగారం యొక్క నష్టనివారణ చర్యలకు తీసుకున్న చర్యలేవి ఫలించలేదు. అక్కడి కర్మాగారంలో ని అధికారుల అవినీతి, అలసత్వం, అసమర్థత నేను కళ్ళారా చూడడం జరిగింది.

అప్పటి స్వార్థపూరిత కమ్యూనిస్టు కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను  పూర్తిగా వ్యతిరేకించాయి. ఫలితంగా కొద్ది సంవత్సరాల్లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మూసివేసింది. ఫలితంగా వేలాది మంది కార్మికుల జీవితాలు, దానిపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు అంధకారం లోకి నెట్టి వేయబడ్డాయి.
అత్యంత వైభవోపేతంగా వెలిగిన ఎరువుల కర్మాగారం యొక్క టౌన్షిప్ ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. ఉద్యోగాలు పోగొట్టుకున్న పర్మినెంటు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల చీకటి జీవితాలను నేను నా కళ్ళారా చూడడం జరిగింది.

ముందు చూపులేని అప్పటి ప్రభుత్వ అసమర్థత, కర్మాగారం లోని కమ్యూనిస్టు సంఘాల స్వార్థపూరితమైన మూర్ఖత్వం వల్ల దాదాపు 30 సంవత్సరాలు ఎరువుల కర్మాగారం టౌన్షిప్ మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోవడం జరిగింది. అంతకుముందు వైభవంగా జీవించిన ఈ ఎరువుల కర్మాగారం లోని నా క్లాస్ మేట్ యొక్క కుటుంబాల యొక్క ఘోర ఆర్థికపతనాన్ని నేను నా కళ్ళారా చూడడం జరిగింది.

2014 తర్వాత ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మూసివేయబడిన ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు అనేక ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎరువుల కర్మాగారం యొక్క పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే కొద్ది నెలల్లో ఈ కర్మాగారం తిరిగి ప్రారంభం కాబోతున్నది.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు ఉండి,ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆ కర్మాగారం యొక్క నాణ్యత ప్రమాణాలు పెంచినట్లయితే లక్షలాది మంది కుటుంబాల జీవితాలు  ఆర్థిక పతనం చెందేవి కాదు. కాబట్టి ప్రభుత్వాలు సరైన సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో సంస్థలు నష్టాల పాలై మూత పడే అవకాశం ఉండదు.. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం అనేది నేడు ఒక అద్భుతంగా విజయవంతమైన మోడల్.

హైదరాబాద్ మెట్రో రైల్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే  నడపబడుతున్నవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి  కూడా ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు వచ్చిన దుస్థితి రాకుండా తక్షణమే వ్యూహాత్మక భాగస్వామ్యం తో వైజాగ్ ఉక్కు కర్మాగారం యొక్క నష్టాలు  గట్టెక్కించి ఆ సంస్థను కాపాడవలసినదిగా కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.
కాలం చెల్లిన, పనికిమాలిన, మూర్ఖపు వాదనలు చేసే స్వార్థపూరిత కుహనా మేధావులు, కమ్యూనిస్టు సంస్థల వాదనను ఎంతమాత్రం లెక్కచేయకుండా కఠిన  నిర్ణయాలు తీసుకొని సంస్థను, వేలాది కార్మికుల, లక్షలాది ప్రజల జీవితాలు కాపాడవలసినదిగా నా విజ్ఞప్తి.

-సందిటి భాస్కర్ రెడ్డి
                                                                                          9505868225