‘స్థానిక’ సమరంలో టీడీపీ..జనసేన..బీజేపీ సర్దుబాట్లు!

0
392

జనసేన బలం ముందు తేలిపోయిన బీజేపీ
ఫాఫం..పురందీశ్వరి కారంచేడులో టీడీపీ గెలుపు
బీజేపీ అగ్రనేతల ఇలాకాలో పత్తా లేని అభ్యర్ధులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులను కలిపాయి. పైస్థాయిలో బీజేపీ నాయకత్వం టీడీపీపై విరుచుకుపడుతుంటే, కిందిస్థాయి కార్యకర్తలు మాత్రం ఆ పార్టీతో కలసి పనిచేస్తున్న వైచిత్రి ఫలితాలలో కనిపించింది. ముఖ్యంగా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బీజేపీ-టీడీపీ కొన్నిచోట్ల, టీడీపీ-జనసేన మరికొన్ని చోట్ల సర్దుబాట్లతో విజయం సాధించిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీకి, అసలు కింది స్థాయిలో ఎలాంటి బలం లేదని తేలిపోగా, విజయం సాధించిన వాటిలో బీజేపీ కంటే జనసేన స్థానాలు ఎక్కువగా ఉండటంతో.. జనసేన బలమే బీజేపీకి ఆధారమన్న విషయం స్పష్టమయింది. పైగా ఎన్నికల్లో ఎక్కడా జనసేన అభ్యర్ధులు బీజేపీ సాయం కాకుండా, టీడీపీ శ్రేణులతో కలసి పనిచేసి పోటీ చేయడం కమల నాయకత్వాన్ని ఖంగుతినిపించింది.

స్థానిక సంస్ధల ఎన్నికలు చిత్ర విచిత్ర ఫలితాలను ఆవిష్కరిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం  పులిమేరు గ్రామం పి.వేమవరంలో, జనసేన బలపరచిన అభ్యర్ధికి టీడీపీ మద్దతునివ్వడంతో సర్పంచిగా జనసేన అభ్యర్ధి విజయం సాధించారు. అమలాపురం నియోజకవర్గం లొల్ల గ్రామంలో టీడీపీ బలపరచిన బీజేపీ అభ్యర్ధి విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడు గ్రామం. దానితో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టారు. అయితే అక్కడ సాంకేతిక కారణాలతో వైసీపీ అభ్యర్ధి బరినుంచి తప్పుకోవలసి వచ్చింది. దానితో బరిలో టీడీపీ-బీజేపీ అభ్యర్ధులే రంగంలో నిలిచారు.రంగంలోకి దిగిన కంటిపూడి రాజీ ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఆ ప్రకారంగా.. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్ధి విజయం సాధించినట్లు ప్రకటించాలన్న ఒప్పందం కుదిరింది. దానికి స్థానిక బీజేపీ నేతలు అంగీకరించిన వెంటనే, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు రంగంలోకి దిగి, గెలిచిన బీజేపీ అభ్యర్ధికి పూలదండ వేసి.. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్ధి విజయం సాధించినట్లు ప్రకటించారు. ఆ ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు జిల్లాలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ రాష్ట్ర నేత పాతూరి నాగభూషణంను పిలిపించి ఆయనతో గెలిచిన టీడీపీ అభ్యర్ధికి, బీజేపీ కండపువా వేయించిన ఫొటోలు అటు సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ అవుతున్నాయి. కాకినాడ పార్లమెంటు పిఠాపురం పరిథిలోని గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో, బీజేపీ నేతలు వైసీపీతో కలసి పనిచేయటం చర్చనీయాంశమయింది.

పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో బీజేపీ అభ్యర్ధులు,  పెద్దగా పోటీ చేసిన దాఖలాలు ఎక్కడా లేదు. వైసీపీ-టీడీపీ తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేసిన స్థానాలను ప్రకటిస్తుంటే, జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇప్పటిదాకా ఎన్ని పోటీ చేసింది? ఎన్ని గెలిచిందన్న వివరాలను ఇప్పటిదాకా ప్రకటించకుండా రహస్యంగా ఉంచడం బట్టి,  ఆ పార్టీకి ఏపీకి బలమెంతో స్పష్టమవుతోంది. ఇక జనసేన బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో సర్పంచి అభ్యర్ధులుగా గెలిచారు. అది కూడా బీజేపీ సహకారం లేకుండా, స్థానికంగా టీడీపీతో సర్దుబాటుతో విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల్లో పోటీ-ఫలితాలు విశ్లేషిస్తే.. జనసేన వల్ల బీజేపీకి ఉపయోగం తప్ప, బీజేపీతో జనసేనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టమయింది. కాగా బీజేపీ జాతీయ- రాష్ట్ర అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత మండలాల్లో కూడా, అభ్యర్ధులు  పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది.

పురందీశ్వరి గ్రామంలో టీడీపీ గెలుపు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి సొంత కారంచేడు గ్రామంలో,  టీడీపీ అభ్యర్థి బాలిగ శివపార్వతి  సర్పంచిగా గెలిచారు. అక్కడ పోటీ వైసీపీ-టీడీపీ మధ్యనే జరిగింది. అసలు ఈ గ్రామంలో ఇప్పటిదాకా బీజేపీ బూత్‌కమిటీలు కూడా పూర్తి స్థాయిలో వేయలేదన్న విమర్శలు కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సొంత గ్రామంలోనే, పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో పోటీ చేసిన కడియం నియోజకవర్గంలో కూడా, బీజేపీ ఎక్కడా విజయం సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. ఆయన ప్రాతినిధ్యం విహ స్తున్న తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ కంటే, జనసేన అభ్యర్ధులే ఎక్కువ సంఖ్యలో గెలవడం విశేషం.

కాకినాడ రూరల్ మాధవపట్నం మండలం, మాగా గ్రామంలో పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర నేత వెంకటరమణకు 19 ఓట్లు, తిమ్మాపురంలో బీజేపీ అభ్యర్ధికి 25 ఓట్లు పోలయ్యాయి. చందుర్తిలో బీజేపీ నేతలు వైసీపీతో కలసి ప్రచారం చేసిన ఫొటోలు, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కదిరిలో,  ఏబీవీపీ నేత వైసీపీ నుంచి పోటీ చేసి  సర్పంచిగా గెలిచారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒక్కరే ఆ జిల్లాలో  పార్టీ కోసం  ప్రచారం చేశారు. మిగిలిన పంచాయతీలలో బీజేపీ ఉనికి ఎక్కడా కనిపించలేదు.దీన్ని బట్టి ఏపీలో  బీజేపీ బలమేమిటో స్పష్టమవుతోంది.

ఇక కర్నూలు జిల్లాలోనే బీజేపీ కొద్దో గొప్పో పోటీ ఇవ్వగలిగింది. ఇక్కడ బీజేపీలో చేరిన పాత టీడీపీ నేతలు, తమ పట్టు నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అనంతపురం ధర్మవరం వంటి నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి సొంత కదిరి నియోజకవర్గంలోని ఆయన గ్రామమయిన తుమ్మలలో,  పార్టీ నుంచి పోటీ చేసే దిక్కులేదు. పార్టీ మరో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ బాగానే పోటీ ఇచ్చింది.