షర్మిలపై పులివెందుల ఓటరు’ ముద్ర!

647

తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ పేరు వర్కవుటవుతుందా?
ఆ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా నష్టమేనా?
                     ( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ షర్మిల వ్యాఖ్యలు, తెలంగాణలో కొత్త పార్టీ ప్రయత్నాలపై అప్పుడే చర్చ మొదలయింది. తెలంగాణకు తాను అడ్డం కాదు నిలువూ కాదని వెటకారంగా మాట్లాడి, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతోప్రారంభించనున్న, షర్మిల  రాజకీయ పార్టీ ఉనికిపై తెలంగాణ ఉద్యమ సంస్థల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ కోసం ఢిల్లీ పాలకులను ముచ్చెమటలు పట్టించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తెలంగాణ సమాజం, ఆంధ్రా మూలాలున్న షర్మిలను ఎలా ఆదరిస్తారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సినీ గ్లామర్ ఉన్న విజయశాంతి అంతటి స్టారే పార్టీ పెట్టి చేతులెత్తేస్తే, ఆంధ్రా ముద్ర ఉన్న షర్మిలను ఆదరిస్తారనుకోవడం అవివేకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం, విభజిత రాష్ట్రంలో పవన్ జనసేన విఫలమయిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సభలకు వచ్చి చప్పట్లు కొట్టే వారంతా ఓట్లు వేయరన్న వాస్తవం వారి విషయంలోనే రుజువయిందని చెబుతున్నారు.

అసలు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిల.. ఇప్పటివరకూ పులివెందుల ఓటరుగానే ఉన్నారంటూ, ఆమె పేరు ఉన్న ఓటరులిస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారం కింది స్థాయికి చేరితే ఆమెపై ‘పులివెందుల ముద్ర’ పడే ప్రమాదం లేకపోలేదు. పైగా తాను జీవించి ఉన్నంత వరకూ తెలంగాణ రాకుండా అడ్డుకున్న వైఎస్ పేరుతో,  షర్మిల పెట్టే పార్టీ వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయన్న చర్చ జరుగుతోంది.  వైఎస్ జీవించిన సమయంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో, లక్షలాది మంది తెలంగాణ వర్గాలు  లబ్థి చేకూరిన మాట నిజమయినా, ఇప్పుడు వైఎస్‌ను గుర్తుంచుకునే వారెవరూ ఉండ రని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుకు ఎన్టీఆర్, రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్‌కు వైఎస్ వారసత్వం ఒక్కసారి మాత్రమే పనికివచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వారిద్దరూ, ఎన్టీఆర్-వైఎస్ పేర్లను పెద్దగా ప్రచారం చేసుకోలేదు. వారిద్దరి పేర్లు పథకాలకు మాత్రమే పరమితమయ్యాయి. కేటీఆర్, కవితకు సైతం కేసీఆర్ పేరు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడింది. తర్వాత వారే స్వయంప్రతిభతో ఈ స్థాయికి చేరిన విషయాన్ని విశ్లేస్తున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో పాదయాత్ర మాత్రమే జగన్‌కు ఉపయోగపడింది తప్ప, వైఎస్ వారసత్వం తెరపైకి రాలేదు. వైఎస్ వారసత్వం జగన్‌కు, తొలి ఎన్నికలకు మాత్రమే పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా రాష్ట్ర విభజనకు ముందు కూడా,  తెలంగాణలో వైసీపీ వైఎస్ ఫొటోతోనే పోటీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో షర్మిలకు కొత్తగా వైఎస్ పేరు పెద్దగా అక్కరకు రాకపోవచ్చంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌కే తెలంగాణ సమాజం అత్తెరసు మెజారిటీ ఇవ్వనందుకే, ఇతర పార్టీల వారిని ఆకర్షించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.  కేసీఆర్ ప్రతి వర్గానికీ, ప్రతి కులానికీ లబ్థి చేకూర్చే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ చతికిల పడింది. గ్రే టర్ ఎన్నికల ముందు వచ్చిన భారీ వరదలకు నష్టపోయిన వారికి పదవివేలు ఇచ్చినా, టీఆర్‌ఎస్ పూర్తి స్థాయి విజయం సాధించలేదు. ఇక తెలంగాణ పేరుతో పార్టీలు పెట్టిన కోదండరామ్, చెరకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డినే ప్రజలు ఆదరించని విషయాన్ని తెలంగాణ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణను అడ్డుకున్న వైఎస్ కుమార్తెగా  తెరపైకి వచ్చిన షర్మిల స్థాపించబోయే పార్టీని,  తెలంగాణ సమాజం ఎలా ఆదరిస్తుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా షర్మిల ఇంకా పులివెందుల ఓటరేనంటూ సోషల్‌మీడియాలో మొదలయిన చర్చ, తెలంగాణవాదులకు ఆగ్రహం కలిగించే దే. పైగా పోరాడి సాధించుకున్న తెలంగాణపై, ఇంకా ఆంధ్రా నేతల పెత్తనమేమిటన్న కొత్త ఆగ్రహానికి తెరలేపేదే. బెంగళూరు, పులివెందులలో ఉండే షర్మిల.. తెలంగాణ సమస్యలను ఏం పరిష్కరిస్తారన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో మొదలయ్యాయి. వైఎస్ ఆశయాలను నెరవేర్చాలంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాలే తప్ప, తెలంగాణలో పెడితే ఉపయోగం ఏమిటన్న కామెంట్లు కూడా సోషల్‌మీడియాలో వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో షర్మిలతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీలయినా, దెబ్బతినక తప్పదన్న మరో చర్చ మొదలయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరును,  కేసీఆర్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుని విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆంధ్రా పార్టీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంది? కాంగ్రెస్ గెలిస్తే నిర్ణయాల కోసం అమరావతి వెళుతుందన్న మైండ్‌గేమ్‌తో కేసీఆర్,  కాంగ్రెస్‌ను చావుదెబ్బతీశారు. ఇప్పుడు షర్మిల పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా, అదే పరిస్థితి పునరావృతం కాకతప్పదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.