చంద్రబాబు మాదిరిగా వెన్ను”పోటుగాడి”ని కాదు:మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

426

చంద్రబాబుకు  జగన్ ఫోబియా పట్టుకుంది..
పంచాయితీ ఫలితాల తర్వాత.. కుప్పంలో తన భవిష్యత్తేమిటో చంద్రబాబుకు కళ్ళముందు కనిపిస్తుంది.
జగన్ మోహన్ రెడ్డి చరిష్మా ముందు నిలబడలేకే చంద్రబాబు పిచ్చివాగుడు
పంచాయితీరాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

‘‘పంచాయితీ మొదటి దశ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తన ఓటమి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంది. అందుకే ఫలితాలను జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు.   పార్టీల రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవమైతే.. ఆ పంచాయితీలకు ప్రోత్సాహకాలు అయితేనేమీ, ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం చేస్తే.. చంద్రబాబు నల్లచట్టం అని మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించడం చంద్రబాబుకు నల్ల చట్టాల్లా కనిపిస్తున్నాయంటే.. ఎన్నికలంటే చంద్రబాబు ఎంతగా భయపడిపోతున్నాడో అర్థమవుతుంది. అవిలేకుండా ఎన్నికలు చేయలేమన్నది చంద్రబాబు భావనలా ఉంది  ’’ అని  పెద్దిరెడ్డి  ధ్వజమెత్తారు. .

జగన్ మోహన్ రెడ్డి అంటే.. చంద్రబాబు ఒకరకమైన ఫోబియా వచ్చింది.  పంచాయితీ ఎన్నికల్లో తప్పులు చేసినవారు శిక్ష అనుభవించాలని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఆ శిక్ష ఈరోజు చంద్రబాబే అనుభవిస్తున్నాడు. గతంలో 600కు పైగా హామీలు ఇచ్చి.. ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో టీడీపీని 23 స్థానాలకు ప్రజలు పరిమితం  చేశారు.  ఏ రాష్ట్రంలో లేనటువంంటి గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి.. సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గుమ్మం ముందుకే తీసుకొచ్చే పరిపాలన జగన్ మోహన్ రెడ్డిగారు తెచ్చారు. ఈరోజు దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ గారు మొదటి స్థానాల్లో ఉన్నారు. మిగతా రాష్ట్రాలన్నింటికీ జగన్ పథకాలే ఇప్పుడు ఆదర్శం అయ్యాయి అన్నారు..

జగన్ మోహన్ రెడ్డి చరిష్మా ముందు చంద్రబాబు నిలబడలేక, ఆయనకు ఏదో ఆవహించినట్టు పిచ్చివాగుడు వాగుతూ,  ప్రతి ఒక్కరిపై విమర్శలు చేస్తున్నాడు. మీడియా ముందు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. ఈరోజు రాష్ట్రంలో శాచురేషన్ విధానంలో కులం, మతం, పార్టీలు చూడకుండా కేవలం అర్హతను బట్టే ఈ ప్రభుత్వం  సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకూ అందిస్తోంది. పంచాయితీ ఎన్నికలు ఇంత సజావుగా, ప్రశాంతంగా జరుగుతుంటే.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇంత పకడ్బందీగా చేస్తే.. రౌడీలు, గూండాలు అని చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు వారి నియోజకవర్గాల్లో చేసిన రౌడీయిజం చంద్రబాబుకు కనిపించదా.. ఎప్పుడూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవారిపైనే నిందలు వేయటం ఎంతవరకు సమంజసం..? అన్నారు.

జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆఖరికి  టీడీపీ కార్యకర్తలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆ పార్టీకి చెందిన వారు కూడా ఈ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. ఇవన్నీ చంద్రబాబు కళ్ళకు ఎందుకు కనిపించడం లేదు. అవినీతి, పక్షపాతం లేకుండా శాచురేషన్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరిపాలనను ప్రజలు ఎక్కడికక్కడ దీవిస్తున్నారు. చంద్రబాబు అన్నట్టు..  నేను(రామచంద్రారెడ్డి) పోటుగాడ్నే.. అయితే చంద్రబాబు లాంటి పోటుగాడ్ని నేను కాదు. చంద్రబాబు మాదిరిగా సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన పోటుగాడ్ని కాదు. జిల్లాలో ప్రజాబలం నాకు ఉంది. చంద్రబాబు ఏరోజు అయినా జిల్లాలో మెజార్టీ సాధించాడా..?  నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి,  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలిసి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా.. మిమ్మల్ని ఓడించి వైయస్ఆర్సీపీని గెలిపించాను  అన్నారు.20 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలు అమలు చేసిన ఒక చరిష్మా ఉన్న జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. అందుకు గర్విస్తున్నాం.

విశాఖ స్టీలు గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. పోక్సో అంతర్జాతీయ సంస్థ. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ  అయిన విశాఖ స్టీల్ ను పోక్సో తీసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వాన్నో, ప్రధానినో, కేంద్ర మంత్రులనో కలుస్తారు తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడా కలవరు. కర్టసీ కోసమే పోస్కో వాళ్ళు గతంలో ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి జగన్ ని కలిస్తే.. ముఖ్యమంత్రి కొనేస్తారంటూ టీడీపీ తప్పుడు మాటలు మాట్లాడుతుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు అన్నారు.

భారతదేశంలో అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్య నాయుడు గారు, నాడు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించారు. ఈరోజు బీజేపీనే కేంద్రంలో ఉంది, మరి  ఆయన విశాఖ స్టీల్ పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను తీసుకొచ్చాడా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, నాడు ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్ పీటీసీలను ఏ విధంగా బెదిరించి, లొంగదీసుకుని, అరాచకాలు చేశారో ప్రజలంతా చూశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే.. ఒక న్యాయం… లేకపోతే మరో న్యాయం. చంద్రబాబుది ఎప్పుడూ రెండు నాల్కల విధానం  అన్నారు.
పుంగనూరులో ఏకగ్రీవం అవుతాయని చంద్రబాబు నాయుడికి కూడా ముందే తెలుసు. తీరా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత.. ఏదోరకంగా ఒక నెపం పెట్టి, తన ఓటమిని కూడా గెలుపుగా చూపించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు బలమేమిటో అందరికీ తెలుసు  అన్నారు.