పాక్ లో దేవాలయాలకు రక్షణ ఏదీ ?

509

పాకిస్థాన్ ‌లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు సరైన ఆదరణకు నోచుకోక జీర్ణావస్థలో ఉన్నాయి. పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాల తీరుతెన్నులను పరిశీలించిన కమిషన్‌ ఫిబ్రవరి 5న ఈ నివేదికను పాకిస్థాన్‌ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ ఆలయాలను నిర్వహించాల్సిన బాధ్యత ఎవక్యూ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ)దేనని ఆ నివేదికలో పేర్కొన్నారు. వారు ఈ చారిత్రక ప్రాచీన ఆలయాలను సంరక్షించడంలో విఫలమయ్యారని తెలిపారు. డాక్టర్‌ సొహైబ్‌ సుద్లే నేతృత్వంలోని ఈ కమిషన్‌లో డాక్టర్‌ రమేశ్‌, సాకిబ్‌ జిలానీ, పాకిస్థాన్‌ అటార్నీజనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ లు‌ సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించే కార్యక్రమాలు ప్రారంభించాలని ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు హిందూ, సిక్కు దేవాలయాలను పరిరక్షించేందుకు ఈటీపీబీ చట్టాల్లో సవరణలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. దేవాలయాల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.

గతేడాది డిసెంబరులో పాక్‌లోని ఓ హిందూ దేవాలయానికి కొందరు మంటలు పెట్టారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలవగా దానిని పునర్నిర్మించాలని సుప్రీం ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు పాకిస్థాన్‌లో ఈటీపీబీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఈటీపీబీ వివరాల ప్రకారం మొత్తం 365 దేవాలయాలు ఉండగా వాటిలో 13 ఆలయాలను మాత్రమే ఈటీపీబీ నిర్వహిస్తోందని తెలిపారు. 65 దేవాలయాలు హిందువులు నడుపుతుండగా మిగిలినవన్నీ కబ్జాకు గురయ్యాయని వారు తెలిపారు. ఈటీపీబీ స్పందనపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. సాంకేతికత మెరుగ్గా ఉన్న ఈ కాలంలో కూడా ఆలయాలను, వాటి ఆస్తులను రక్షించలేకపోవడం సరికాదన్నారు.

అధికారిక వివరాల ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 75లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం సింధ్‌ ప్రావిన్స్ ‌లోనే జీవిస్తున్నట్లు తెలుస్తోంది.

( VSK ANDHRAPRADESH )