ఐటీఐఆర్ ప్రాజెక్టు పైన బీజేపీది అసత్య ప్రచారం- మంత్రి కేటీఆర్

0
354

• రాష్ట్రం ఏర్పడిన తొలి నాటి నుంచే కేంద్రానికి పదేపదే ఐటీఐఆర్ పైన విజ్ఞప్తులు చేసిన తెలంగాణ ప్రభుత్వం
• రెండు సార్లు కేంద్రానికి డి పి ఆర్ ల సమర్పణ
• కనీసం 10 సార్లు కేంద్రానికి ప్రత్యేకంగా ఐటీఐఆర్ పైన లేఖలు రాశామన్న మంత్రి కేటీఆర్
• తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సార్లు సమాచారం అందించినా, కేంద్రానికి ఎలాంటి సమాచారం రాలేదని పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రి సంజయ్ దొత్రే
• అసత్యాల ఆధారంగా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలన్న మంత్రి కేటీఆర్
• 2016 లోనే కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి తెలంగాణ ప్రభుత్వం అందించిన సమాచారం మరియు డిపిఆర్ లను స్వయంగా అందించానన్న మంత్రి కేటీఆర్

ఐటీఐఆర్ ప్రాజెక్టు పైన స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం పైన మంత్రి  కేటీఆర్ స్పందించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావాలనే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే తమ ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ నెలలోనే ముఖ్యమంత్రి  కే. చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ఒక లేఖ సైతం రాశారని, మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ తదుపరి కనీసం 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో లేఖల ద్వారా మరియు ప్రత్యక్షంగా కలిసి ఐటిఐఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మినిస్టర్ ఫర్ స్టేట్ సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఐటీఐఆర్ కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం, లోక్ సభను తప్పుదోవ పట్టించడమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడిగినా పూర్తి సమాచారంతో పాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( డి పి ఆర్) లను సైతం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని, ఆ తర్వాత ఐటిఐఆర్ కు సంబంధించి అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని సైతం కేంద్ర మంత్రి దాచిపెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం ఐటీఐఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం సమర్పించలేదన్న మాట చెప్పినప్పుడు, 2016లో నేను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వెళ్ళిన ప్రతి సమాచారాన్ని అందించి వచ్చానని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన డీపీఆర్ ని సైతం అందించానని, కనీసం ఇప్పుడైనా  ఐటీఐఆర్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయ గారిని కోరిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న అప్పటి కేంద్రమంత్రి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళతామని హామీ ఇచ్చిన విషయాన్ని సైతం మంత్రి సందర్భంగా గుర్తు చేశారు.

స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 జూన్ నెల నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐటిఐఆర్ పైన సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటీ పరిశ్రమకి మరింత ఊతం అందించాలని పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తి ప్రజల దృష్టిలో ఉన్నదని మంత్రి అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఐటిఐఆర్ కు సంబంధించిన డీపీఆర్ లను సమర్పించింది అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిలన్నింటినీ బుట్టదాఖలు చేసిన కేంద్రం పూర్తిగా ఐటిఐఆర్ ని రద్దు చేసిందన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానంలోనూ ఐటీఐఆర్ ను రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గుర్తించాలని అన్నారు. కేవలం అసత్యాలు, దుష్ప్రచారంతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టాలనే, బీజేపీ వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు