చెయ్యి మెరిసింది–అవ్వ మురిసింది

282

గానవ్వ…. అదేనండీ….. జ్ఞానవ్వ….. అయోధ్యలో రాములోరి గుడి నిర్మాణం ప్రారంభమైందని తెలిసినప్పటినుంచి ఆ గుడికి డబ్బులెట్టా పంపాలా? అని తెగ ఆరాట పడిపోతోంది గానవ్వ. ఇదేం పేరు అనుకుంటున్నారా? ఆ ఊళ్లో అందరూ ఆ అవ్వని అలానే పిలుస్తారు. నిజానికి ఆమె పేరు కంచి జ్ఞానమ్మ. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామం.

అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైందని టీవీలో చూసినప్పటినుంచి ” ఒరే అబయా ఆ రాములోరి గుడికి మనం కూడా ఎంతోకొంత డబ్బులంపాల్రా. ఎట్టా అంపాలా? అదెట్నో కనుక్కోరా గురయ్యా.” అంటూ తన కొడుకు గురవయ్యకు చెబుతూనే ఉంది. ఈమధ్య అయోధ్య రామమందిర నిధి సేకరణ నిమిత్తం కొంతమంది రామ సేవకులు కడగుంట గ్రామానికి వెళ్లారు. ఊర్లో అన్ని ఇళ్లకూ వెళ్ళినట్లుగానే జ్ఞానవ్వ ఇంటికి కూడా వెళ్లారు. వాళ్లు వచ్చేటప్పటికి జ్ఞానవ్వ దగ్గర తన పింఛన్ డబ్బుల్లో వెయ్యి రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక చేసేదేమీలేక ఆ వెయ్యి రూపాయలు రామమందిర నిర్మాణ నిధికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించింది. వెళ్లిన రామ సేవకులు కూడా ఆమె భక్తి ప్రపత్తులకు, చిన్న కుటుంబమే అయినా వెయ్యి రూపాయలు సమర్పించిన ఆమె ఉదారతకు అబ్బుర పడ్డారు.

కానీ జ్ఞానవ్వకు మాత్రం ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. “రాములోరి గుడికి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇయ్యడమేంది? ఐదేలైనా (ఐదు వేలు) ఇయ్యకపోతే ఎట్టా? కానీ సమయానికి చేతిలో డబ్బుల్లేకుండా పొయినాయ్ ఎట్రా దేవుడా? అని రాత్రంతా మధనపడింది. పదే పదే దేవుడికి దండం పెట్టుకుంటోంది. అలా దండం పెట్టుకుంటూ ఉండగా బెడ్ లైటు వెలుగులో ఆమె చెయ్యి తళుక్కున మెరిసింది. ఏదో స్ఫురించిన దానిలా అవ్వ ముఖంలో చిరునవ్వు విరిసింది. వెంటనే హాయిగా నిద్ర పోయింది.

పొద్దున్నే లేచి చకచకా తయారై “ఒరే గురయ్యా రోంత పనుండాది గనా ఎంకటగిరి దాకా పొయ్యొస్తా.” అని కొడుక్కి ఓ మాట చెప్పి హడావుడిగా ఆటో ఎక్కింది. నేరుగా వెంకటగిరికి వెళ్లి రాత్రి బెడ్ లైటు వెలుగులో తన చేతిలో తళుక్కున మెరిసిన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని నాలుగు వేలకు కుదువపెట్టి, వెంకటగిరిలోని ఒక రామ సేవకుడి దగ్గరకు స్వయంగా వెళ్లి ఆయన చేతిలో ఆ డబ్బులుంచి ” ఇంద నాయనా రాములోరి గుడికి ఈ నాల్రూపాయలు కూడా కలేసి పంపు” అని చెప్పి హుషారుగా, సంతోషంగా కడగుంటకెళ్ళే ఆటో ఎక్కింది గానవ్వ. అవ్వ ముసి ముసి నవ్వులతో మురిసిపోతోంది. గానవ్వలాంటి కోట్లాదిమంది కల నిజమవుతున్న క్షణం….. దేశంలోని ప్రతి హృదయమూ పులకిస్తోంది. ఇలాగే స్పందిస్తోంది. శ్రీరామ మందిర నిర్మాణ నిధిని యధాశక్తి సమర్పిస్తోంది. జై శ్రీరామ్.

 (VSK ANDHRAPRADESH )