రాజ్యసభ వేదికగా బహిర్గతమైన ప్రయివేటీకరణ పథకం!

0
44

దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి కంపెనీ పోస్కోతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు కర్మాగారం) మధ్య 2019 అక్టోబరు మాసంలోనే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందం మేరకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ ఒప్పందం మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం భూముల్లో “గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ఫ్యాక్టరీ”ని పోస్కో నెలకొల్పుతుంది.
ఆ ఫ్యాక్టరీలో 50% వాటా పోస్కోకు, విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చే భూముల విలువ ఆధారంగా ఆర్.ఐ.యన్.యల్.కు వాటా ఇవ్వడం జరుగుతుందని ఒప్పందంలో పేర్కోబడిందని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజ్యసభలో  విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేడు వెల్లడించారు.

పోస్కో – హూండాయ్ – దక్షిణ కొరియా రాయబారి అక్టోబరు 22, 2018 వ తేదీన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించారని, ఆ సందర్భంగా జరిగిన సంయుక్త సమావేశంలో భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వశాఖ – యన్.యం.డి.సి. – ఆర్.ఐ.యన్.యల్. ప్రతినిథులు పాల్గొన్నారని తెలియజేశారు.

పోస్కో ప్రతినిథులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 2019 జూలై 9, సెప్టంబరు 23 మరియు 2020 ఫిబ్రవరి 20 తేదీలలో ప్లాంట్ నెలకొల్పే పనిపై సందర్శించారని కూడా తెలియజేశారు.  పోస్కో ప్రతినిథివర్గం, కేంద్ర ఉక్కు శాఖా మంత్రి  ధర్మేంద్రప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని గతంలో కలిసినట్లు ప్రసారమాధ్యమాలలో వార్తలు వచ్చాయి.

ఇంత తతంగం జరిగాకే కేంద్ర మంత్రివర్గం తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% అమ్మకానికి తెరలేపుతూ నిర్ణయం తీసుకొన్నది.  ఏమీ తెలియదన్నట్లు అమాయకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆందోళన పూర్వరంగంలో ప్రధాన మంత్రికి ఉత్తరం వ్రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రుణ భారం నుండి బయట పడవేయడానికి అవసరమైతే కొంత భూమిని అమ్మివేయాలని వై.యస్.ఆర్.సి.పి. పార్లమెంటు సభ్యుడు సూచించినట్లు ప్రసారమాధ్యమాల్లో వార్త చూశాను. అంటే శల్యసారథ్యం చేస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బహుళ జాతి సంస్థలకు లేదా భారతీయ కార్పోరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టారని విస్పష్టంగా వెల్లడయ్యింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సి ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, ప్రజలు రాజీలేని పోరాటం ద్వారానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో పరిరక్షించుకోగలం.

– టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు