విశాఖ ఉక్కును కేవలం కర్మాగారంగానే చూడొద్దు…

0
228

ప్రజల మనోభావాలకు ప్రతీకగా చూడాలి
32 మంది బలిదానాల తరవాత వచ్చింది విశాఖ ఉక్కు కర్మాగారం
విశాఖ ఉక్కు నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయమని అమిత్ షాని కోరాం
మేము వచ్చి విజ్ఞాపన ఇచ్చాము… మరి 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎంతో చేయవచ్చు
మార్చి 3, 4 తేదీల్లో అమిత్ షాని తిరుపతి పర్యటనలో మరోసారి చర్చలు….
జనసేన – బీజేపీ రూట్ మ్యాప్ పై చర్చ
 జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ఏ విధంగా ప్రత్యేకమైనదో కేంద్ర హోమ్ శాఖ మంత్రి  అమిత్ షాకి వివరించి.. ఈ కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులు, ఆలయాలపై దాడులు, ఆర్ధిక పరిస్థితులు, నివర్ తుపాను మూలంగా రాష్ట్ర రైతాంగం ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలను అమిత్ షాకి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచనపై చర్చించారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి  మురళీధరన్ , కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డిలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంలో పలువురు పార్లమెంట్ సభ్యులు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై అమిత్ షాతో చర్చించాం.  18 వేల మంది నేరుగా ఉపాధి తీసుకుంటూ ఉన్నారు. 20 వేల మందిపైగా కాంట్రాక్టు లేబర్ ఉన్నారు. లక్ష పైచిలుకు దీని మీద ఆదారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునరాలోచన చేయాలని కోరడం జరిగింది. మావంతుగా ఏమేమి చేయాలో తెలియచేశాం.  ప్రత్యేక పరిస్థితుల్లో దాదాపు 32 మంది బలిదానాల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీన్ని కేవలం ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించి సూక్ష్మంగా చూడాలన్న అంశాన్ని కూడా నాయకులందరి దృష్టికి తీసుకువెళ్లాం. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ ని కూడా కలవడం జరిగింది. ఆయనతో చర్చ సందర్భంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని ప్రస్తావించాం.ఈ అంశంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించాం. దేవాలయాలపై దాడులు సాగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించాం.

వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షాని వారి తిరుపతి పర్యటనలో మరోసారి కలిసి చర్చిస్తాం. జనసేన – బీజేపీల రూట్ మ్యాప్ ఎలా ఉండాలి.. ఎన్నికల వరకూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కోర్ కమిటీలో చర్చిద్దామని అమిత్ షా తెలిపారు. శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. వీటన్నింటి మీద లోతుగా మాట్లాడేందుకు వచ్చే నెలలో దానిపై చర్చిస్తాం.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ రాత్రికి రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పునరాలోచించమని చెప్పాం. ఈ అంశంపై వైసీపీ మనస్ఫూర్తిగా పని చేయాలి అనుకుంటే సాధ్యపడుతుంది. వారు చేయకూడదు అనుకుంటే మనమేం చేయలేం. ఇంత దూరం మేము వచ్చి కలిసి కేంద్రానికి విజ్ఞాపన ఇచ్చినప్పుడు 22 మంది ఎంపిలు ఉన్న వైసీపీ చాలా చేయొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షా తిరుపతి పర్యటనలో చర్చించాక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది” అన్నారు.

* ఒప్పందం గురించి తెలిసీ లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటి?

కొరియా కంపెనీతో ఒప్పందం గతేడాది జరిగిందనే అంశంపై ఓ విలేఖరి ప్రశ్నించగా ‘కొరియా కంపెనీతో ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు? ఒప్పందం జరిగింది అని వైసీపీ నేతలు అంటున్నప్పుడు ప్రత్యేకించి జగన్ రెడ్డి లెటర్ రాయడంలో అంతర్యం ఏంటి?  మా కార్యకర్తలు చాలా రోజుల నుంచి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ కేడర్ కూడా పాల్గొంటున్నారు’ అని సమాధానమిచ్చారు. షర్మిల పార్టీ ఏర్పాటుపై మరో విలేకరి ప్రశ్నించగా ‘పార్టీ ఫామ్ చేసి వారి విధి విధానాలు చూసిన తర్వాత స్పందిద్దాం. ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది. వారి విధివిధానాలు వచ్చాక స్పష్టత తీసుకుందాం. కేసీఆర్ పరిపాలనపై నేను హైదరాబాద్ లో మాట్లాడుతా’ ప్రత్యుత్తరమిచ్చారు. రాష్ట్ర అప్పుల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్ధిక వ్యవస్థపై  వారికి అవగాహన ఉంది కాబట్టి, వారి చేతుల్లో ఉంది కాబట్టి వారు వివరిస్తే బాగుంటుంది అన్నారు.

* ప్రజల్ని మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసి.. విశాఖ ఉక్కు కొంటాం అంటోంది

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రపంచం మొత్తానికి తెలుసు

జనసేన పి.ఏ.సి. చైర్మన్  నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసి) చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ  “కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో ఖచ్చితంగా మావంతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని దెబ్బ తీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాపై ఉందని  పవన్ కల్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మూడు రోజుల పర్యటనలో చాలా మందిని కలిశాం. వినతిపత్రాలు ఇచ్చాం. ఈ అంశంపై పునరాలోచించమని చెప్పాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు వాళ్లు కూడా తెప్పించుకోవాలి. ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి  పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు అంశాన్ని సమగ్రంగా తీసుకెళ్లారు. తప్పకుండా సానుకూల నిర్ణయం ఉంటుందని మేము నమ్ముతున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉత్తరం రాసింది., దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రధాన మంత్రిని మేము విన్నవించాం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొంటాం అని ప్రచారం చేసుకొంటోంది.. ఒక వైపు మన ఆర్ధిక పరిస్థితి ప్రపంచం మొత్తానికి తెలుసు.  ఒక స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆసక్తిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉంటుందేమో? ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. కేంద్ర మంత్రి  మురళీధరన్ తో లోతుగా మాట్లాడినప్పుడు త్రివేండ్రం ఎయిర్ పోర్టు ప్రయివేటీకరణపై అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వారు సానుకూలంగానే స్పందిస్తారని నమ్ముతున్నాం.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఇక్కడికి వచ్చాం. రెండు రోజుల నుంచి కేంద్ర పెద్దలను ఎందుకు కలుస్తున్నాం? రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడేందుకే. బహుశా ఒక పాలసీ విధానంలో ముందుకు వెళ్తున్నారేమో గాని. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మాత్రం ఒక సెంటిమెంట్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా పునరాలోచించాలని కోరాం. మేము కలసిన పెద్దలంతా సానుకూలంగా స్పందించారు. అయితే మనం కొంత సమయం ఇవ్వాలి. పూర్తి సమాచారం తెప్పించుకుని స్పందిస్తారన్న నమ్మకం మాలో ఉంది” అన్నారు.