విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్మగలుగుతుందో చంద్రబాబు చెప్పాలి?

155

బీజేపీ పార్టనర్ గా  కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కు లేదా..?
కేంద్రాన్ని ఒప్పించలేకపోతే అది పార్ట‌న‌ర్ పవన్ కళ్యాణ్ అసమర్థత కాదా..?
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి విశాఖ ఉక్కు కాపాడమని అడిగారా..? లేక తిరుపతి సీటు కోసం అడుక్కున్నారా..?
రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే అవకాశమే ఉంటే.. 54 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మినట్టు పప్పుబెల్లాల్లా చంద్రబాబు ఎప్పుడో అమ్మేసేవాడు..
1995-2004 మ‌ధ్య చంద్ర‌బాబు 54 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశాడు.
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు
వైయస్ఆర్ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయ ప్రయోజనాలు కాదు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో  కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి చాలా బాధాకరమైన అంశం. విశాఖ స్టీల్ రాష్ట్రంలో ఏర్పడటానికి ప్రజలు ఎన్నో కష్టనష్టాలకోర్చి విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్దఎత్తున పోరాటం చేసి, 32 మంది  ప్రాణ త్యాగాలు చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్రం దిగి వచ్చింది.  ఆ ఉద్య‌మ ఫ‌లితంగా విశాఖ‌లో ఉక్కు క‌ర్మాగారం వ‌చ్చిది అనేక వేల మందికి జీవ‌నోపాధి కల్పిస్తుంది. సుమారుగా 18వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి, 20వేల పైచిలుకు కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు ల‌క్ష‌పైచిలుకు కుటుంబాలు దీనిపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారని వైసీపీ సీనియర్ ఎమెల్యే అంబటి రాంబాబు  చెప్పారు. ధ్వజమెత్తారు.

విశాఖ ఉక్కు అంటే కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కాదు.. అది ఆంధ్రుల హక్కుగా భావిస్తున్నాం. విశాఖ స్టీలు ప్లాంటు విశాఖతో పాటు రాష్ట్రానికే తలమానికం లాంటింది. అటువంటి సంస్థలో కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పున‌రాలోచించాల‌ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో కేంద్రంపై  ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అన్ని రాజకీయ పక్షాలపైన, ప్ర‌భుత్వంపైన, ప్ర‌జ‌ల‌పైన‌ ఉంది అన్నారు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’… ఆ హక్కును కాపాడేందుకే సీఎంగారు ప్రధానికి ఉత్తరం రాశారు  ఇది విశాఖకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి ఆభరణం. దీన్ని కాపాడుకోవాలన్నదే జగన్‌గారి ఆలోచన ఆంధ్రుల హక్కును కాపాడాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత కేంద్రం పై కూడా ఉంది.  విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి చేయాల్సిన పనులు చేయకుండా..  దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు ఉద్యమం చేస్తాం.. పోరాటం చేస్తాం, రాజీనామాలు చేస్తాం.. అంటూ ఒకవైపు రాజకీయాలు చేస్తూ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, చంద్రబాబు.. ఒక అడుగు ముందుకు వేసి.. విశాఖ స్టీల్ ను పోస్కో కంపెనీకి అమ్మేస్తున్నారంటూ రాజకీయ లబ్ధి కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అన్నారు.

తెలుగుదేశంతో మొన్నటిదాకా జత కట్టి, ఈరోజు కేంద్రంలోని బీజేపీతో జతకట్టిన పార్టీ జనసేన. కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్ళి వచ్చి ఏం మాట్లాడారు..? మేం చెప్పాల్సింది చెప్పాము, నిర్ణయం వాళ్లదే అంటారా..? కాపాడుకుంటాం.. పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు.. మేము అయితే చెప్పాం.. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. 22 మంది వైయస్ఆర్సీపీ ఎంపీలు ఇంకా చేయొచ్చు అని మాట్లాడుతున్నారు అన్నారు.

బీజేపీతో కలిసి సంసారం చేస్తూ.. కేంద్రంతో మాట్లాడి, ఒప్పించాల్సిన బాధ్యత జనసేనకు ఉందా.. లేదా?  కేంద్రం త‌న నిర్ణయం వెనక్కు తీసుకోనేలా చేయాల్సిన‌ బాధ్యత, కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఉంది. ఇక్కడేమో ప్రగల్భాలు పలికి.. ఢిల్లీ వెళ్ళి విశాఖ ఉక్కు గురించి డిమాండ్ చేశారా..? లేక తిరుపతి సీటు గురించి అడుక్కునే పని చేశారా అన్నారు.

బీజేపీతో సయోధ్యగా ఉండి, కలిసి పోటీ చేసే పరిస్థితిలో ఉండి, కేంద్రాన్ని ఒప్పించకపోతే అది పవన్ కళ్యాణ్ అసమర్థత.  చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పోస్కో కంపెనీ వాళ్ళు ఎప్పుడో జగన్ గారితో మాట్లాడారట. దాంతో అమ్మేస్తున్నారని బుద్ధీ, జ్ఞానం లేకుండా  మాట్లాడుతున్నారు అన్నారు.

పోస్కో కంపెనీ వాళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాలేదా..? అప్పుడు చంద్రబాబు ఫోటోలు దిగలేదా..? 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు లాభాల్లో ఉంది. చంద్రబాబు పరిపాలన వచ్చాక 2016 నుంచి నష్టాల్లోకి వచ్చింది. అప్పుడే దీన్ని ప్రైవేటు పరం చేయటానికి రంగం సిద్ధమయింది. ఈ విషయం 2018 నాటికే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినా.. చంద్రబాబు నోరెత్తలేదు. అప్పటి సీఎం చంద్రబాబు ఆమోదించారన్న భావనతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అన్నారు.

ఇప్పటి సీఎం దీన్ని తాను ఆమోదించటం లేదని ఎటువంటి అనుమానాలకూ తావు లేకుండా ప్రకటించారు.  దీనిమీద జగన్ గారు ప్రధాని కి లేఖ కూడా రాశారు. ఆరోజు చంద్రబాబు కనీసం లేఖ అయినా రాశారా..  కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా.. అంటే లేదు.  కాబట్టే ఉత్తుత్తి మాటలతో సరిపెట్టకుండా ఎలా కాపాడుకోవాలో ప్రత్యామ్నాయాలతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గారు ఉత్తరం రాశారు.  ఎంప్లాయ్‌మెంట్‌ పరంగా మాత్రమే కాకుండా, విశాఖ ఉక్కు మన రాష్ట్ర చరిత్ర ఎనలేని త్యాగాలు, రాష్ట్రమంతా కలిసి చేసిన పోరాటానికి చిహ్నం అన్నారు.

నష్టాల్లో ఉన్నంత మాత్రాన పెట్టుబడులు ఉపసంహరించుకోవద్దు. దీన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఈ మార్గాలు ఉన్నాయని సీఎంగారు లేఖ రాశారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలంటే సొంత గనులు కేటాయించాలని సూచించారు. గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ. 200 కోట్లు లాభాలు ఆర్జిస్తున్న ఈ సంస్థ, ఇదే పనితీరు కనబరిస్తే మరో రెండేళ్ళలో లాభాల బాటలోకి వచ్చేస్తుంది, అప్పులు రూ. 22 వేల కోట్లు ఉన్నాయి, 14 శాతం వడ్డీ భారం పడుతుంది. వీటన్నింటి నుంచి కాపాడండి.. ఈ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం పూర్తిగా పోవటంతోపాటు… విశాఖ స్టీల్‌ కూడా స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో లిస్టు అవుతుంది. తద్వారా స్టాక్‌ మార్కెట్‌ నుంచి నిధులు సేకరించటం కూడా కుదురుతుంది అన్నారు.

ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నామ‌ని జగన్ గారు లేఖ రాశారు.  లెటర్ రాయంగానే సరిపోతుందా అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అమిత్ షాను నిన్న కలిశారు. మోడీ, అమిత్ షా ఇద్దరు అనుకుంటే.. దీన్ని ఆపేస్తారు కదా.. మరి, పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఒత్తిడి ఎందుకు తేలేకపోయారు.  రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే అవకాశమే ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా ఉంచేవాళ్ళా.. ప‌ప్పుబెల్లాలు అమ్ముకున్నట్టు అప్పుడే అమ్మేసేవాడే కదా..! -చంద్రబాబు 1995-2004 వరకు 54 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశాడు అన్నారు.

చంద్రబాబుకు విశాఖ స్టీల్ గురించి తెలియదు.. ఆయనకు తెలిసిందల్లా సుజనా స్టీల్ మాత్రమే.. బాబుగారు బీజేపీలోకి పంపిన ఫ్రెండుగారు ఆయన…  ఉక్కు ఉత్పత్తితో సంబంధం లేకుండా ఏకంగా దేశాన్ని రూ. 8 వేల కోట్లకు పైగా ముంచేశారు. దేశంలోని బ్యాంకుల్ని దివాలా తీయించటంలో సుజన, లగడపాటి, రాయపాటి, కావూరి, లింగమనేని… ఇలా వేల కోట్ల మోసగాళ్ళంతా చంద్రబాబు మిత్రబృందమే. వీరంతా కలిసి శుభోదయాన ప్రవచనకర్తల్లా మనకు రోజూ నీతులు చెప్పటం… మనం వినాల్సి రావటం బాధాక‌రం! ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అన్నారు. 2014 నుంచి 2018 వరకు టీడీపీ కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్న రోజుల్లోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయి. ఆ రోజుల్లో చోద్యం చూశారు.

విశాఖ స్టీల్ ను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేఖ రాస్తే.. జగన్ గారి మీద బురదజల్లుదాం, ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని  చూస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కి పార్టనర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి.  పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకు తొలి అడుగు పడినప్పుడు  ఏం చేశారో చంద్రబాబు ఆలోచించుకోవాలి. -ప్రతిదానిలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు అన్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్  రాష్ట్ర ప్రజల  ప్రయోజనాలను నిరంతరం కాపాడేందుకు ముందుంటారు.  ఏ విధంగా లాభాల్లో తీసుకురావాలో, కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పించాలో చూస్తాం. 2019లో పోస్కో కంపెనీ వాళ్ళు వచ్చారు.. రాష్ట్రంలో పెట్టుబడులు గురించి జగన్ గారితో మాట్లాడారు, కానీ విశాఖ ఉక్కు గురించి మాట్లాడలేదు. ఇది సత్యం అన్నారు.

లోకేశ్ వ్యాఖ్య‌లు ఎలా ఉన్నాయంటే… తన కంటే గొప్పవాళ్ళు తన పార్టీలో ఉన్నారని,  510 మంది ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం సర్పంచులుగా గెలిచారని ఒప్పుకున్నట్టుంది.

పంచాయితీ ఎన్నికల్లో పతనం ప్రారంభమైందని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. పట్టుమని పది పంచాయితీలు రాని టీడీపీ మాట్లాడటమా..? -లోకేష్ కు తాను పోటీచేసిన చోట కూడా గెలవటం చేతకాదు గానీ, పంచాయితీలు గెలిచామని అంటారు. నిజాలు చెప్పటం చంద్రబాబు లోకేష్ కు నేర్పడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినా నూటికి 90 శాతం వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ మద్దతుదారులు గెలుస్తారు అన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుందనుకుంటే.. తప్పకుండా చేద్దాం. రాష్ట్ర  ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోవాలో.. అవన్నీ చేయటానికి సిద్ధం. -రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం, రాజకీయ ప్రయోజనాలు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల సంగతి చూస్తాం. విశాఖ ఉక్కును కాపాడుకోవడం మా బాధ్యత అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం  కనుక కేంద్రంపై ఒత్తిడి ఏ విధంగా పెంచాలో అలా చేస్తాం. బురదజల్లాలని ప్రయత్నిస్తే మేం లెక్కచేయం. ఆకాశం మీద ఉమ్ము వేస్తే.. ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వం మీద పసలేని విమర్శలు చేస్తే..  పవన్, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగులుతారు అన్నారు.