కమలం ‘ఉక్కు’రి బిక్కిరి!

742

ఎమ్మెల్యే, ఎంపీలపై రాజీనామాలపై ఒత్తిళ్లు
ఇప్పటికే బీజేపీకి బడ్జెట్, పెట్రోలు ధర, ప్రత్యేకహోదా సంకటం
కొత్తగా విశాఖ ఉక్కు అమ్మకం కలవరం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో మరింత బలహీనమవుతోంది. తాజాగా నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి చూపింది. ఈ క్రమంలో ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడంతో ఆంధ్రుల దృష్టిలో బీజేపీ ముద్దాయిగా నిలిచినట్టయింది.

ఏపీలో అధికారం సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీకి, తాజా పరిణామాలు ప్రజామద్దతును దూరంచేసేలా మారుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెడుతున్న వైనం ఉత్తరాంధ్రను ఉడికిస్తోంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా అక్కడ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయానికి నిరసనగా, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి,నాన్ పొలిటికల్ జేఏసీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీనితో విశాఖ వైసీపీ ఎంపి సత్యనారాయణ కూడా విశాఖ ఉక్కును ప్రైవీటీకరిస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ కూడా ఉక్కు ప్యాక్టరీపై ప్రధానికి లేఖ రాశారు.

 గంటా, సత్యనారాయణ రాజీనామా ప్రస్తావనతో విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యే-ఎంపీలపై ఒత్తిళ్లు ప్రారంభమ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రతిష్ఠాత్మకమైన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి, సామూహిక రాజీనామా అస్త్రాలే శరణ్మమన్న డిమాండ్ ప్రజల్లో బలపడటం ప్రజాప్రతినిధులకు సంకటంగా మారింది. ఇది గతంలో జరిగిన,  సమైక్యాంధ్ర-ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల నాటి పరిస్థితిని పునరావృతం చేసేలా కనిపిస్తోంది. ఉద్యమాకారులు ప్రజాప్రనిధుల ఇళ్ల ముట్టడి వంటి పిలుపు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

పైగా విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో తొలినుంచీ, అంతో ఇంతో బలం ఉన్నది కూడా విశాఖ జిల్లానే. దశాబ్దాల క్రితమే  విశాఖ మేయర్‌ను కూడా బీజేపీ సాధించింది. తాజా పరిస్థితిలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా, రాజీనామా చేయకతప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. టీడీపీ-వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే, బీజేపీ మౌనంగా ఉంటే ప్రజలకు ఆ పార్టీ దూరంకాక తప్పని సంకటస్థితి.

అటు ఇటీవలి కాలంలో పెట్రోల్ ధర లీటరుకు వంద రూపాయలు పెరగడం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడాన్ని ఏపీ ప్రజలు కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి, మీడియా సమావేశాలు పెట్టి వివరణ ఇస్తున్నా ప్రజల ఆగ్రహం చల్లారే పరిస్థితి కనిపించడంలేదు. అటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ, ఇటు ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా తెగనమ్మేందుకు సిద్ధం కావడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు.

అయితే.. కేంద్రం తీసుకుంటున్న ఈ వరస నిర్ణయాల వల్ల బీజేపీకి కొత్తగా వచ్చే నష్టమేమీ లేకపోయినా, ఏపీలో పాగా వేయాలన్న లక్ష్యం మాత్రం నెరవేరడం కష్టమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై ప్రభావం చూపించటం ఖాయమన్న ఆందోళన అటు బీజేపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.