ఇండియన్ రైల్వే బోర్డ్ చైర్మన్ సునీత్ శర్మతో బండి సంజయ్ భేటీ

314

కరీంనగర్ లోక్ సభ నియోకవర్గ అభివృద్ధి కోసం ఎం.పి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్  అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలో రైల్వేప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల విషయమై బుధవారం దిల్లీలో ఇండియన్ రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో సునీత్ శర్మ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

కరీంనగర్ లోని తీగలగుట్టపల్లీ దగ్గర LC no.18 (T) వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహన రద్దీ పెరగడంతో లెవల్ క్రాసింగ్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సత్వరమే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని  సునీత్ శర్మ ని బండి సంజయ్ కుమార్  కోరారు. దక్షిణ మధ్య రైల్వే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపిందని, దీన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి పరిష్కరించాల్సిందిగా కోరారు. అలాగే LC no.26 కొత్తపల్లి నుంచి గంగాధర (రామడుగు గేట్) వైపుగా వెళ్లే మార్గంలో రైల్వే క్రాసింగ్ ను రద్దు చేసి  ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేదుకు దోహదపడాలని కోరారు.

పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట్-పెద్దపల్లి మార్గంలో బైపాస్ లైన్ నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని, నిధుల లభ్యతను బట్టి ముందడుగు వేయాలన్నారు. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.325 కోట్ల కేటాయించగా, వాటి పనులు వేగవంతం చేయాలని కోరారు. రాజధానిని అనుసంధానించే మార్గం కారణంగా సత్వరమే ఈ పనులు పూర్తిచేయాలని, రెండేళ్ల కాలవ్యవధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ మందకొడి పనుల కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు.

కరీంనగర్ – హసన్ పర్తి వయా హుజూరాబాద్ మీదుగా మధ్య కొత్త లైన్ నిర్మాణం సర్వే పనులకు గతంలోనే మంజూరయ్యాయని, ఈ లైన్ కు ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్ లో ఈ లైన్ కు కేటాయింపులు జరగలేదని తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రాబోయే సప్లిమెంటరీ బడ్జెట్ లోనైనా ఈ లైన్ కు తగిన నిధులు కేటాయించేలా చూడగలరని విజ్ఞప్తి చేశారు.కరీంనగర్ నుంచి చెన్నై, ముంబై, షిరిడి సహా దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను నడిపించాలని కోరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో లిఫ్ట్, ఎస్కలేటర్లతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మరొక ప్రవేశ ద్వారం, లోడింగ్-అన్ లోడింగ్ వసతులు, మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్సు నిర్మించాలన్నారు.

కరీంనగర్ నియోజకవర్గంలో రైల్వేలఅభివృద్ధిపై దృష్టి సారించి పనులు ముందుకు జరిగేలా తగిన చొరవ చూపాలని కోరుతూ ఇండియన్ రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో  సునీత్ శర్మ ని బండి సంజయ్ కుమార్ కోరారు. దీనిపట్ల  సునీత్ శర్మ  సానుకూలంగా స్పందించారు.