షర్మిల పార్టీతో షేకింగ్ ఎవరికి?

514

బీజేపీకి మరో జనసేన కానుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో కొత్త పార్టీకి సన్నాహాలు చేసుకుంటున్న షర్మిల ప్రయత్నాలతో, ఏ పార్టీకి నష్టం వాటిల్లబోతోందన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ భేటీ నిర్విహించిన షర్మిల, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని ప్రకటించారు. దానితో ఇప్పటివరకూ షర్మిల పార్టీ స్థాపనపై జరుగుతున్న ఊహాగానాలకు తెర పడినట్టయింది. అయితే ఆమె పార్టీ పేరుపై ఇంకా స్పష్టత లేకపోయినా, మరికొన్ని జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె వరస వెంట వరస ఆత్మీ భేటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు షర్మిల ప్రకటన స్పష్టం చేసింది.

అయితే, వచ్చే ఏడాది చివరి నుంచి దేశవ్యాప్తంగా జరగనున్న జమిలి ఎన్నికల నేపథ్యంలో, షర్మిల పార్టీ తెలంగాణలో ఏ పార్టీ ఓట్లు చీల్చనుంది? ఏపార్టీకి లబ్ధి చేకూర్చనుందన్న చర్చకు తెరలేచింది. తెలంగాణ రాజకీయ-ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గంలోని, వైఎస్ అభిమానుల ఓట్లను సాధించే లక్ష్యంగానే షర్మిల పార్టీ స్థాపన కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఆ సామాజికవర్గం అటుకాంగ్రెస్-ఇటు టీఆర్‌ఎస్‌లో స్థిరపడిపోయింది. రెడ్డి వర్గ బలం గ్రహించిన కేసీఆర్.. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో ఆ వర్గానికి చెందిన వారికే పదవులిస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి , మంత్రి జగదీష్‌రెడ్డి ఆప్తులుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన రెడ్డి నేతల్లో మెజారిటీ శాతం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో రెడ్డి సామాజికవర్గం, షర్మిల పార్టీ వైపు చూస్తుందనుకోలేమని టీఆర్‌ఎస్ అగ్రనేత ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే కొద్దిమేరకు తమ పార్టీకినష్టం వాటిల్ల వచ్చని చెబుతున్నారు. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ అభిమానులు టీఆర్‌ఎస్‌కు ఓటేశారని, గతంలో ఖమ్మం ఎంపీగా ఆ పార్టీ నేత గెలిచిన విషయాన్ని విస్మరించకూడదని విశ్లేషిస్తున్నారు.

అయితే… షర్మిల పార్టీ వెనుక బీజేపీ ప్రోత్సాహం ఉందన్న, మరొక బలమైన వాదన తెరపైకి వస్తోంది. ఏపీలో పవన్ కల్యాణ్ మాదిరిగా, తెలంగాణలో షర్మిలతో జత కట్టడం ద్వారా జిల్లాలపై పట్టు సాధించవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు. తెలంగాణలో రెడ్డి-క్రైస్తవుల ఓట్లు చీల్చడం ద్వారా, టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే వ్యూహం కనిపిస్తోందన్న అనుమానాలు అటు టీఆర్‌ఎస్ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ- మున్నూరు కాపు కార్డులతో ఇప్పటికే దూసుకుపోతున్న బీజేపీకి, షర్మిల పార్టీతో వచ్చే రెడ్డి-క్రైస్తవుల ఓట్ల శాతం వల్ల అదనపు బలమేనంటున్నారు. అయితే జనసేన చీఫ్ పవన్ స్థాయి ఇమేజ్ షర్మిలకు లేకపోయినా, జనాలను ఆకర్షించే శక్తి ఆమెకు ఉండటం కొంతవరకూ కలసివచ్చేదనంటున్నారు. షర్మిల పార్టీతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్ వల్ల ప్రయోజనం పొందిన వర్గాలు, షర్మిల పార్టీని అభిమానించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

మరోవైపు షర్మిల ప్రయత్నాల వల్ల తెలంగాణ వాదం సజీవంగా ఉండటంతోపాటు, అది మరింత బలపడి పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు లాభించే అవకాశం కూడా లేకపోలేదని టీఆర్‌ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించిన ప్రొఫెసర్ కోదండరామ్, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చెరకు సుధాకర్, అంతకుముందు విజయశాంతి వంటి ప్రముఖులే ఓడిపోయిన విషయాన్ని విస్మరించకూడదని టీఆర్‌ఎస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రాకు చెందిన షర్మిల పార్టీని, ప్రజలు ఆదరిస్తారనుకోవడం అత్యాశేనంటున్నారు. పైగా ఆంధ్రా పార్టీగా ముద్రపడితే, ఆమె పార్టీతో జతకట్టిన పార్టీలకూ ప్రమాదనమేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బలమైన యంత్రాంగం- కులబలం ఉన్న టీడీపీనే చతికిలపోతే ఇక షర్మిల పార్టీకి అవకాశాలు ఉంటాయనుకోవడం భ్రమేనని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు షర్మిల పార్టీ వెనుక, టీఆర్‌ఎస్ హస్తం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కొత్త పార్టీతో ఓట్లు చీలడం ద్వారా, విజయం సాధించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వాదనను టీఆర్‌ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

‘టీఆర్‌ఎస్‌కు ఎవరితోనూ పార్టీ పెట్టించాల్సిన అవసరం లేదు. ఆమె ఇంకా పార్టీ పేరే ప్రకటించలేదు. ఆమె వల్ల మాకేమీ నష్టం లేదు. లాభం లేదు. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు మరో పార్టీని కోరుకుంటారనుకోలేమ’ని టీఆర్‌ఎస్ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.