ఏపీ బీజేపీ నేతలతో మోదీ భేటీ అనుమానమే?

585

ప్రధాని కోల్‌కతా వెళ్లే అవకాశం?
పురందీశ్వరి అసమ్మతి స్వరం
అది పార్టీ ధిక్కారమేనంటున్న ఒక వర్గం
( మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణతో ఉక్కిరిబిక్కరవుతున్న ఏపీ బీజేపీ నేతలు,బంతిని కేంద్రం కోర్టులో నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ ఈనెల 14వ తేదీన, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. రైతుల త్యాగం, అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే, ఏపీలో బీజేపీ ప్రజలకు శాశ్వతంగాదూరమవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని రగిలిపోతున్న ప్రజలకు, స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పుండుమీద కారం చల్లినట్టయింది.

తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి.. తాము ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. దీనితో సొంత పార్టీలోనే కేంద్ర నిర్ణయానికి మద్దతు లేదన్న సంకేతాలు వెళ్లాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేత, పార్టీకి మద్దతు ప్రకటించాల్సింది పోయి.. కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించడం అటు పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. దీనిని పార్టీలోని ఒకవర్గం క్రమశిక్షణా రాహిత్యంగానే భావిస్తున్నారు.

ఇటీవల జరిగిన పార్టీ కోర్ కమిటీలో కూడా.. రాష్ట్రంలోని దేవాలయాల నుంచి అయోధ్యకు మట్టి, నీరు తీసుకువెళ్లాలన్న అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిపాదనను పురందీశ్వరి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. గతంలో విశాఖకు ప్రాతినిధ్యం వహించిన పురందీశ్వరి.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల మేరకే, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది. అయితే, ఎట్టి పరిస్థితిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పైవేటీకరించడం ఖాయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేయడమే,  ఏపీ బీజేపీ నేతల ఢిల్లీ పర్యటనకు కారణంగా తెలుస్తోంది.

ఆ ప్రకారంగా ఈ నెల 14న బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని ప్రధానికి వివరించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒకనోట్‌ను సిద్ధం చేస్తోంది. అయితే… కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వీరికి, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తారా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, సొంత పార్టీ వారే దానిని వ్యతిరేకిస్తే అది పార్టీకే నష్టమన్న భావన నాయకత్వంలో ఉంటుంది.

అదీకాకుండా.. ఒక రాష్ట్ర పార్టీ వాదనను వినేందుకు అంగీకరిస్తే, ఇలాంటి సమస్యలున్న మిగతా రాష్ర్టాల పార్టీ నాయకత్వాలు కూడా, అదే సంప్రదాయాన్ని కొనసాగించే ప్రమాదం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నిర్ణయాలు జాతీయ ప్రయోజనాల కోణంలో ఉంటాయే తప్ప, రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఉండవని చెబుతున్నారు.

అందుకే 14వ తేదీన ప్రధాని ఏపీ బీజేపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చంటున్నారు. ఆ రోజు ఆయన కోల్‌కతా వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..ప్రజల దృష్టిలో పార్టీ నేతల ప్రతిష్ఠ దెబ్బతినకుండా,  ఆరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా లేదా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో గానీ భేటీ ఉంటే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.