కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా జంపన?

316

10న పూర్తి కానున్న బోర్డు పదవీకాలం
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్లలో ఒకటయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా,   బీజేపీ నేత జంపన ప్రతాప్ నియామకం దాదాపు ఖరారు కానుంది. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో, ఒకసారి నామినేటెడ్ పద్ధతిలో బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బోర్డు సభ్యుల పదవీకాలం ఈనెల 10న పూర్తి కానున్న నేపధ్యంలో, మరో ఆరు నెలల కోసం దేశవ్యాప్తంగా నామినేటెడ్ మెంబర్లను నియమించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అవసరాల దృష్ట్యా జంపనకు నామినేటెడ్ బోర్డుమెంబరుగా నియమించాలని పార్టీ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

సైనికులు ఎక్కువగా నివసించే కంటోన్మెంట్ బోర్డులకు, సివిలియన్స్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 62 బోర్డులకు ఎన్నికలు జరుగుతుంటాయి.  ఇవి సాధారణ మునిసిపాలిటీల మాదిరిగానే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే మునిసిపాలిటీ,కార్పొరేషన్లకు భిన్నంగా ఉంటాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ శాఖ కూడా జోక్యం చేసుకునే వీలుండదు. పెత్దనమంతా కేంద్ర రక్షణ శాఖదే. ఏ నిర్ణయమయినా కేంద్ర కార్యాలయం  నుంచి రావలసిందే.

సివిలియన్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌ను, మిలటరీ పక్షాన  సీఈఓ  బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ రక్షణ శాఖ చట్టాలు, నిబంధనలే అమలవుతాయి. సివిలియన్స్ ఉన్న ప్రాంతాలకు మంచినీటి సరఫరా,డ్రైనేజీ, ఇళ్ల నిర్మాణాల అనుమతులన్నీ కంటోన్మెంట్ బోర్డు ఇవ్వాల్సిందే. ప్రజల ద్వారా ఎన్నికయిన సివిల్ మెంబర్లు కూడా, సివిలియన్స్  సమస్యలనే బోర్డు సమావేశాల్లో ప్రస్తావిస్తుంటారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పెత్తనం ఉండదు.

ప్రజల ఓట్లతో ఎన్నికయ్యే సివిలియన్స్ బోర్డు మెంబర్లుగా వ్యవహరిస్తుండగా, వారిలో ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది.అయితే తాజాగా ఉపాధ్యక్ష పదవికి నేరుగా ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రజల ద్వారా ఎన్నికలు జరిగేది ఒక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోనే కావటం విశేషం.  అయితే ఇవి అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరుగుతుంటాయి.

ఈనెల 10న పాలకవర్గ పదవీకాలంముగియడంతో స్టేషన్ కమాండర్ అధ్యక్షుడు, సీఈఓ,సివిల్ మెంబర్ సభ్యులుగా బోర్డు కొనసాగవలసి ఉంటుంది. వీరి పదవీకాలం ఆరునెలల నుంచి ఏడాది మాత్రమే. అయితే  కేంద్రంలో  అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారినే,  సివిల్ మెంబర్‌గా నియమిస్తుంటారు. ఆ ప్రకారం సహజంగా బీజేపీకి చెందిన నాయకులనే,  సివిల్‌బోర్డు మెంబరుగా నియమించే అవకాశాలున్నాయి.

ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టు కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌తోపాటు.. ఆకుల నాగేష్,ఆకుల శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దశాబ్దాల పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో పట్టు, ఇమేజ్ ఉన్న జంపన బీజేపీలో చేరటంతో, కంటోన్మెంట్‌లో బీజేపీ బలం పెరిగినట్టయింది. ఆయన బలం రానున్న ఎన్నికల్లో బీజేపీకి అదనపు బలం కానుంది.

పైగా ఆయన పేరును మిలటరీ ప్రాంతాలున్న కాలనీ అధ్యక్షులు కూడా బలపరుస్తూ, రక్షణశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. దానికితోడు, కొందరు ఎంపీలు కూడా ఆయన  పేరును కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.