అడకత్తెరలో ‘వెంకయ్య’!

334

విశాఖ ఉక్కుపై మౌనం
ఏదీ నాటి ఉద్యమ ఆవేశం?
వెంకయ్యపై పెరుగుతున్న ఒత్తిళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకయిన విశాఖ ఉక్కును కేంద్రం తెగనమ్మే వ్యవహారంతో.. ఉప రాష్ట్రమతి ఎం.వెంకయ్యనాయుడు పరిస్థితి అడకత్తెరలో పడినట్టయింది. ఆయన జోక్యం చేసుకుంటేనే కేంద్రం, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందన్న అభిప్రాయం బలపడుతోంది. దానితో ఈ అంశంలో వెంకయ్యెపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దానితో ఉప రాష్ట్రపతిగా ఆయన తన పలుకుబడి వినియోగించి కేంద్ర నిర్ణయాన్ని మార్పిస్తారా? లేక ప్రధానిపై ఒత్తిడి తీసుకురాకుండా మౌనం వహిస్తారా? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఫలితంగా గత రెండేళ్ల వరకూ చక్రం తిప్పిన వెంకయ్య పరిస్థితి సంకటంలో పడినట్టయింది.

నాడు విశాఖ హక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించి,ఉద్యమించిన వారిలో ముందువరసలో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి సైతం వెంకయ్య విశాఖ జిల్లా సంఘర్షణ కమిఠఈ అధ్యక్షుడిగా పనిచేసి, నేతలను నడిపించారు. ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి నేతగా, అప్పట్లో  విశాఖతో ఆయన అనుబంధం ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు  ఉప రాష్ట్రపతి స్థాయికి చేరిన వెంకయ్య, తన పలుకుబడి ఉపయోగించి ఉక్కు ఫ్యాక్టరీని రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంపై  రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజనకు మందు ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య, విభజన తర్వాత కూడా కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు, ప్రాజెక్టులు ఇప్పించటంలో కీలరకపాత్ర పోషించారు. కేంద్రమంత్రిగా సహచర మంత్రుల వద్దకు వెళ్లి రాష్ర్టానికి నిధులు ఇప్పించడం ద్వారా, బాబు సర్కారుకు ఇబ్బందులు లేకుండా చూడగలిగారు.

ఏపీకి సంబంధించి అంత కీలకపాత్ర పోషించిన వెంకయ్య..ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే మాత్రం, పెదవి విప్పకపోవడం విస్మయపరుస్తోంది. విద్యార్ధి దశలో విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన వెంకయ్య, ఇప్పుడు పోరాడి సాధించుకున్న అదే ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా, తన పలుకుబడిని ఎందుకు వినియోగించంలే దన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు,  రాష్ట్రం కష్టాల్లోఉంటే ఆదుకున్న వెంకయ్యనాయుడు, ఇప్పుడు తానే నాయకత్వం వహించిన విశాఖ ఉక్కు ప్యాక్టరీ కష్టాల్లో ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ సీఎంగా ఉన్నప్పటికీ.. విశాఖఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య అయినందున, వెంకయ్య జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలు వివిధ వర్లాల్లో వినిపిస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీని కొన నసాగించాలంటూ విశాఖ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అయినా వెంకయ్య  ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడం తెలుగువారిని విస్మయపరుస్తోంది. వెంకయ్య తెలుగువాడన్న గర్వకారణంతోనే గత ప్రభుత్వం, ఆయనకు పౌరసన్మానం చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.