ఖాజానాను కాపాడుతున్న ‘కేసీఆర్ ప్లానింగ్’

490

అప్పుల సేకరణపై సీఎం కూడికలు తీసివేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్: ప్రణాళిక, ముందుచూపు, భవిష్యత్తుపై అంచనా, ఆర్ధిక పరిస్థితిపై పట్టు ఉన్న ముఖ్యమంత్రులెవరూ అప్పుల కోసం అర్రులు చాచరు. వచ్చే ఆదాయం, ఖర్చు మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ వీలయినంత తక్కువ అప్పులు చేయడం ద్వారా..  ఖజానాను కాపాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైనాన్స్ ప్లానింగ్‌ను చూసి, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. అప్పుల సేకరణకు కేంద్రం అనేక మార్గాల్లో వెసులుబాటు కల్పించినా, దానిని అతి తక్కువగా వినియోగించుకుంటున్న సీఎంగా,  కేసీఆర్ జాతీయ స్థాయిలో అందరినీ మెప్పిస్తున్నారు.

నిజానికి ఆర్ధికమంత్రిగా హరీష్‌రావు ఉన్నప్పటికీ, కీలకమైన అంశాలన్నీ కేసీఆర్ సలహా సూచనలతోనే నడుస్తున్నాయి. రాష్ట్రి్ధ ఆర్ధిక పరిస్థితిపై కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉండటంతో, ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది గుర్తించి, ప్రాధాన్యత పరంగా వాటికే నిధులు కేటాయిస్తున్నారు. అప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపు, బిల్లుల క్లియరెన్సుకు అంత పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దానితో సహజంగానే బిల్లులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, వాటి కన్నా స్థూల ఆర్ధిక పరిస్థితి, పునరుత్పత్తి రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా, అనుకున్న ఫలితాలు రాబడుతున్నారు.  సాగు-తాగు నీటి పథకాలపై విమర్శలు-ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి కేటాయిస్తున్న నిధుల వల్ల లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. దానితో తెలంగాణ జిల్లాల్లో పొలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా జీవన స్థితిగతులతోపాటు, రైతుల ఆర్ధిక పరిస్థితులు కూడా గణనీయంగా మెరుగవుతున్నాయి. ఫలితంగా అది ఖజానా పరిపుష్ఠం కావడానికి దోహదపడుతోంది.

అయితే, విపక్షాలు ఈ కోణంలో కాకుండా,  ప్రతిదీ రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా తెలంగాణ ప్రజల ఆర్ధిక  పరిస్థితులను, పునరుత్పాదశక్తిని పెంచేవేనని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయం, నీటిపారుదలపై పెట్టే వందలు-వేల కోట్లతో ఆయా రంగాలు అభివృద్ధి అయితే, దాని వల్ల రైతు ఆర్ధికంగా శక్తువంతుడవుతారని విశ్లేషిస్తున్నారు.అఏక రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న ఆర్ధిక వెసులుబాటుతో యధేచ్చగా అప్పులు చేస్తుంటే, కేసీఆర్ సర్కారు మాత్రం ఆచితూచి,అవసరమైనంత మేరకే అప్పులు చేస్తోందని టీఆర్‌ఎస్ నేతలు వివరిస్తున్నారు.

‘జీఎస్డీపీలో తెలంగాణ తనకు 29 శాతం అప్పులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అవసరానికి మించి అప్పులు చేస్తే వచ్చే అనర్ధాన్ని గుర్తించిన కేసీఆర్ సర్కారు,దానిని 22.8 శాతానికే పరిమితం చేసిన వైనాన్ని విస్మరించకూడదు. ఈవిధంగా ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం వల్లనే, కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు, గ్రాంట్లు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకుందని’ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ నేత గట్టు రామచందర్‌రావు  విశ్లేషిస్తున్నారు. నిధులు లేవని కేసీఆర్‌ను విమర్శించే ఎంపీలు, కేంద్రంపై ఒత్తిడి చేసి తమ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్న చిత్తశుద్ధి లేకపోవడాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు.