అయోధ్య సరే..భద్రాచలం,తిరుపతి మాటేమిటి?

230

భద్రాచలానికి రైలు మార్గమేదీ?
శ్రీనివాసమంగాపురంపై ఆర్కియాలజీ పెత్తనమేమిటి?
తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు‘ ఆధ్యాత్మిక సంకటం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్:  శ్రీలంక హిందూ దేశం కాదు. అలాగని సెక్యులర్ దేశం కూడా కాదు. క్రైస్తవాన్ని ఎక్కువగా ఆరాధించే దేశం. కానీ.. రామాయణంలో చెప్పిన అన్ని పుణ్యక్షేత్రాలతో కూడిన రామాయణ సర్క్యూట్ దర్శనమిస్తుంది. కానీ.. సీతారామ లక్ష్మణులు నడయాడిన భద్రాచలానికి శతాబ్దాల నుంచి రైలు మార్గం లేదు. ఇదీ హిందూమతానికి పేటెంటీ తీసుకున్న బీజేపీ ఏలుబడిలోని దేశంలో తెలంగాణలో కనిపించే వైచిత్రి.

అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో హిందూ సమాజానికి దగ్గరయేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఆద్మాత్మిక సంకటం పెరుగుతోంది. తెలంగాణలో భద్రాచలం ఆలయానికి రైలు మార్గం, ఏపీలో శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని ఆర్కియాలజీ నుంచి విముక్తం చేసే ప్రధానాంశాలు ఇప్పుడు బీజేపీకి సవాలుగా మరాయి. ప్రధానంగా దేశం మొత్తం మీద శ్రీరామ కల్యాణం నిర్వహించే భద్రాచలం ఆలయానికి కేవలం 14 కిలోమీటర్లు రైలు మార్గం వేయలేని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు తెలంగాణ హిందూ సమాజంలో చర్చనీయాంశమయింది.

భద్రాచలంలోని శ్రీరామ దేవస్థానానికి, ఇప్పటిదాకా రోడ్డు మార్గమే తప్ప రైలు మార్గం లేదు. పక్కనే గోదావరి, పాపికొండలు వంటి సుందర దృశ్యాలు కనిపిస్తుంటాయి. పైగా రాముడి పరివారం నడయాడిన దండకారణ్యంలో వెలసిన దేవాలయం. జటాయువు ఆత్పార్పణ చేసిన ప్రదేశం. సీతాదేవి సేద దీరిన పర్ణశాల. ఇవన్నీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలే. అందుకే ఆ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం, హెరిటేజ్ సిటీగా ప్రకటిస్తే మరింత అభివృద్ధి చెందుతున్న డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో నగరాలను వారసత్వ నగరాలుగా ప్రకటించి, దానికి నిధులు సమకూర్చుతోంది. కానీ శతాబ్దాల చరిత్ర ఉన్న భద్రాచలం పట్టణానికి మాత్రం.. వాజపేయి నుంచి మోదీ వరకూ ఏ ప్రభుత్వం కూడా నయాపైసా ఇవ్వని వైనం చర్చల్లోకి వచ్చింది. ప్రధానంగా తెలంగాణలో హిందుత్వం పేరుతో హడావిడి చేస్తున్న బీజేపీ నేతలకు ఈ ఆధ్యాత్మిక సంకటం పెరుగుతోంది.

అయోధ్యపై హడావిడి చేస్తున్న బీజేపీ.. అదే శ్రీరాముడి కల్యాణం జరిగే ఏకైక దేవాలయమయిన భద్రాచలం పట్టణాన్ని ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నలు, హిందూ మేధావుల నుంచి వె ల్లువెత్తుతుండటం ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది. ప్రధానంగా రాముడిపై అమిత ప్రేమ కనబరిచే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భద్రాచలం ఆలయం వద్దకు ఇన్నేళ్లుగా రైల్వే లైన్ ఎందుకు వేయలేదన్న ప్రశ్నలు, తెలంగాణలో బీజేపీ నాయకులకు ములుకుల్లా తగులుతనన్నాయి. కొత్తగూడెం-మణుగూరు నుంచి వెళ్లే పాండురంగాపురం గ్రామం నుంచి, భద్రాచలానికి కేవలం 14 కిలోమీటర్లే దూరం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అక్కడి నుంచి వేసే రైల్వే లైన్‌కు సుమారు 350 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

భద్రాచలానికి రైలు సౌకర్యం ఏర్పడితే, దేశం నలుమూలల నుంచి రామభక్తులు వచ్చే అవకాశం ఉన్నా, బీజేపీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదన్న భక్తుల ప్రశ్నలకు ఆ పార్టీ నుంచి సమాధానం లేదు. అయోధ్య రాముడిని రాజకీయంగా ఉపయోగించుకున్న బీజేపీ, అదే భద్రాచల రాముడిని మాత్రం ఎందుకు విస్మరిస్తోంది? అక్కడ కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉన్నందుకా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర విభజన వల్ల భద్రాచల ఆలయ అధీనంలోని వెయ్యి ఎకరాలు ఏపీకి వెళ్లిపోవడంతో,  రాముడు ఆస్తిలేని నిరుపేదగా మారాడన్న ఆవేదన భక్తుల నుంచి వినిపిస్తోంది. భద్రాచలంలోని ఐదు మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడం ద్వారా, భద్రాచల ప్రతిష్ఠ నిలబెట్టాలన్న తపన కూడా తెలంగాణ బీజేపీ నేతలకు లేకుండా పోయిందన్న విమర్శలు హిందూ సమాజంలో వినిపిస్తున్నాయి.

‘ఇప్పుడు మణుగూరులో ఉన్నది కూడా గూడ్సు లైన్ మాత్రమే. కొత్తగూడెం నుంచి భద్రాచలానికి సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి కూడా రైల్వే లైన్ వేయలేని బీజేపీ, అయోధ్యలో రాముడి గురించి మాట్లాడటమే వింతగా ఉంది. కేంద్రానికి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అయోధ్య ఆలయం కంటే ముందే భద్రాచల రాముడి ప్రాంతంలో రైల్వేలైను కోసం పోరాడిఉండేవారు’ అని టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత గట్టు రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.

ఇక భారత్‌లో వాటికన్ సిటీగా పేరున్న తిరుపతిలో ఉన్న శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని, ఆర్కియాలజీ డిపార్టుమెంటు చెర నుంచి విడిపించడంలోనూ బీజేపీ విఫలమయిందన్న అసంతృప్తి హిందూ సమాజం నుంచి వెల్లువెత్తుతోంది. తిరుమల మాదిరిగానే అక్కడ కూడా నిత్య కైంకర్యాలు, కల్యాణం జరుగుతాయి. హుండీ నిధులు కూడా టీటీడీకే చెందుతాయి. కానీ అక్కడ చిన్న గోడ నిర్మించాలన్నా, చివరకు ఒక ఇటుక వేయాలన్నా కేంద్రప్రభుత్వ అధీనంలోని  ఆర్కియాలజీ అనుమతి అవసరం. ఇక తిరుపతి ఏర్పేడు వద్ద ఉన్న గుడిమల్లం శివాలయంపైనా ఆర్కియాలజీ పెత్తనమే ఉందని గుర్తు చేస్తున్నారు. కోణార్క్‌లోని చారిత్రక సూర్యదేవాలయాన్ని కూడా ఆర్కియాలజీ చెరలోనే ఉన్నా, బీజేపీ నేతలు దాని గురించి ఎందుకు ఉద్యమించరన్న ప్రశ్నలు హిందూ సమాజం నుంచి వినిస్తున్నాయి. అక్కడ ఆలయం బయటకు కనిపించకుండా,  అడ్డంగా గోడ కట్టిన వైనాన్ని అటు కొందరు పీఠాథిపతులు కూడా ప్రస్తావిస్తున్నారు.

 ‘ఆర్కియాలజీ విధించే సవాలక్ష అవ రోధాలతో విసిగి వేసారి పోయిన రాష్డ్ర ప్రభుత్వం, దాని పెత్తనం నుంచి మినహాయించాలని దశాబ్దాల నుంచి కోరుతున్నా కేంద్రంలో స్పందన లేదు. మేం కూడా వైఎస్ ఉన్నప్పుడే తీర్మానించి పంపాం. కానీ ఫలితం లేదు. గుడిమల్లం, కోణార్క్ దేవాలయాలను బీజేపీ నేతలు ఎందుకు ఆర్కియాలజీ పెత్తనం నుంచి విడించలేకపోతున్నారు? ఆలయాలు, హిందుత్వంపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ నేతలకు ఏమాత్రం వెంకన్నపై భక్తి ఉన్నా, వెంటనే శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని ఆర్కియాలజీ చెరనుంచి విడిపించాల’ని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడయిన ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో వలస కార్మికుల కోసం, నయాపైసా సేకరించని బీజేపీ నేతలు ఇప్పుడు గుడి కోసం చందాలు సేకరిస్తు, మానవసేవే మాధవ సేవ అన్న విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. బీజేపీ నేతల కన్నా సోనూసూద్ గొప్పవాడని రమణ వ్యాఖ్యానించారు.