మతమార్పిళ్లపై అమిత్‌షా ఆరా?

368

ఎంపీ రాజును ప్రశ్నించిన హోంమంత్రి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో జరుగుతున్న మతమార్పిళ్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి తన వద్దకు వచ్చిన సమాచారం- నివేదికల్లో వాస్తవాన్ని ఆయన, తన వద్దకు వస్తున్న ఏపీ ఎంపీలను అడిగి మరీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రితో 20 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న మతమార్పిళ్లు, ఆలయాలపై దాడుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా మతమార్పిళ్లకు సంబంధించిన అంశంపైనే ఆయన ఆరేడు నిమిషాలు ఎంపీ రాజు వద్ద ఆరా తీసినట్లు సమాచారం.

విశ్వసనీయ సమచారం ప్రకారం..  ఇవి ఏ స్థాయిలో జరుగుతున్నాయి? ఎవరి సహకారంతో జరుగుతనన్నాయని ప్రశ్నించారు. తాను ఆ విషయంపై ఆందోళన వ్కక్తం చేసినందుకే, తనపై కొందరు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారని రాజు బదులిచ్చారు. రామాలయాన్ని భక్తులే నిర్మించుకుంటుండగా, ఏపీలో మాత్రం ప్రభుత్వమే చర్చిలకు నిధులు, పాస్టర్లకు జీతాలిస్తున్న వైనం వివాదానికి దారితీసిందని హోంమంత్రికి వివరించారు. దీనిని విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నిజానికి ఎంపీ రాజుకు హోంమంత్రి పది నిమిషాల సమయమే కేటాయించగా, మతమార్పిళ్ల అంశం ప్రస్తావనకు రావడంతో సమయాన్ని మరో పదినిమిషాలు పొడిగించారు. దీన్నిబట్టి, ఏపీలో జరుగుతున్న మత మార్పిళ్లపై కేంద్రం ఏ స్థాయిలో పరిశీలిస్తుందో స్పష్టమవుతోంది.

మాతృభాషలో విద్యాబోధనను తాను వ్యతిరేకించగా, కేంద్రం దానిని విధాన నిర్ణయంగా తీసుకున్నందుకు రాజు కృత జ్ఞతలు తెలిపారు. దానిని సభలో ప్రస్తావించినందుకే పార్టీ నాయకత్వం, తనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అయితే అది తమ పార్టీ జాతీయ విధానమని, మోదీ కూడా మాతృభాషలో విద్యావిధానానికే కట్టుబడి ఉన్నారని అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీలో న్యాయవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అంశాలపై, తన వద్దకు వస్తున్న ఫిర్యాదులను ఆయన ఎంపీ రాజు వద్ద ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశం కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే సంఘ్‌పరివార్ సంస్థలు ఇచ్చిన నివేదికలను దృష్టిలో ఉంచుకున్న అమిత్‌షా.. వాటిపై ప్రజల స్పందనను ఎంపీ రాజు వద్ద ఆరా తీసినట్లు తెలుస్తోంది. జరుగుతున్న సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, అయితే మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీ ప్రజలు ప్రతి అంశంపై స్పందించి రోడ్డెక్కే తత్వం కాదని, సమయం వచ్చినప్పుడే సమాధానం చెప్పే మనస్తత్వం ఉన్న వారని అమిత్‌షాకు వివరించారు. తర్వాత తనకు భద్రత కల్పించినందుకు కృత జ్ఞత చెప్పిన రఘురామకృష్ణంరాజు, ఏపీ పర్యటనకు రావలసిందిగా అమిత్‌షాను ఆహ్వానించారు. దానికి అంగీకరించిన హోంమంత్రి,  తాను 3 రోజులు ఏపీలో పర్యటిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

టీడీపీ బృందం వద్ద పాస్టర్ ప్రవీణ్ ప్రస్తావన..

ఆ తర్వాత తనను కలసిన టీడీపీ ఎంపీల ప్రతినిధి బృందం వద్ద కూడా, రాష్ట్ర పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీసినట్లు తెలిసింది. తమ పార్టీ నేతలపై వైసీపీ సర్కారు వేధింపులతో పాటు.. కొన్ని కీలకమైన దేవాలయయాలపై దాడులు, మతమార్పిళ్లకు సంబంధించి టీడీపీ ఎంపీల బృందం ఇచ్చిన వినతిపత్రాన్ని  ఆసక్తిగా అమిత్‌షా చదివారు. ఆ సందర్భంలో టీడీపీ బృందం ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న,  పాస్టర్ ప్రవీణ్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. పాస్టర్ చర్యలపై కొద్దిసేపు సంభాషణ జరిగింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై తగిన చర్య తీసుకుంటానని అమిత్‌షా హామీ ఇచ్చారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా అమిత్‌షా, తొలిసారి తమ వద్ద సానుకూల వైఖరితో మాట్లాడారని టీడీపీ ఎంపీలు చెప్పారు