నిరుపేదలకు ప్రభుత్వమే వైద్యం చేయించే పథకం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ

478

–  రైట్ హిప్ జాయింట్ ఇంజూర్తో బాధపడుతున్న పుష్పలత
 – సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా కార్పోరేట్ స్థాయి వైద్యం చేయించే పథకం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . బుధవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆస్టియో ఆర్థిటిక్స్ రైట్ హిప్ జాయింట్ ఇంజూర్స్ సమస్యతో బాధపడుతున్న ఎం పుష్పలత కలిశారు .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరులోని ఆదిత్య మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు . తనకు టోటల్ హిప్ రీప్లేస్ మెంట్ చేయాల్సి ఉందని , ఇందుకు రూ .2.75 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు . ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధి ద్వారా ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు . దీనిపై మంత్రి కొడాలి నాని సీఎం కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు . పుష్పలత అనారోగ్య సమస్యలను వివరించారు . పూర్తి వివరాలను సీఎం కార్యాలయ అధికారులకు పంపారు .

ఆస్టియో ఆర్థిటిక్స్ రైట్ హిప్ జాయింట్ ఇంజూర్స్ సమస్యపై సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడి అవసరమైన వైద్యం చేయిస్తారని , ఈ వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు . ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2,434 వ్యాధులకు ఉ చిత చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు . ఈ పథకం మరో జన్మను ఇచ్చే పథకమని అన్నారు . నిరుపేదలు , నిస్సహాయులు ఆస్థులు అమ్ముకునే అవసరం లేకుండా ప్రభుత్వమే స్వయంగా కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయిస్తుందన్నారు . వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఇతర పథకాలకు భిన్నంగా ఉంటుందన్నారు . కోవిడ్ కష్టకాలంలో రాష్ట్రం ఆర్ధికంగా కనీవినీ ఎరుగని రీతిలో ఓడిదుడుకులను ఎదుర్కొందన్నారు . అయినప్పటికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు . రూ . 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేశామన్నారు .

రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నాయన్నారు . రూ.వెయ్యి దాటిన ప్రతి వైద్య ఖర్చునూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు . గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 చికిత్సలకు మాత్రమే వైద్యం అందేదని చెప్పారు . జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించారన్నారు . కోవిడ్ ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారన్నారు . వైద్యం , ఆరోగ్యపరంగా మేని ఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సీఎం జగన్మోహనరెడ్డి నిలబెట్టుకుంటున్నారన్నారు .

శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు ఇంటికి వెళ్ళిన తర్వాత వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో రూ .5 వేల ఆర్ధికసాయం , దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ . 3 వేల నుండి రూ .10 వేల వరకు సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు . ప్రతి ఆసుపత్రిలోనూ నాణ్యమైన వైద్యం అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు .