నిమ్మాడపై నిమ్మగడ్డ స్పందించరెందుకు?: సజ్జల రామకృష్ణారెడ్డి

660

– చంద్రబాబుకు కోరస్ లా నిమ్మగడ్డ వ్యవహారం
– పోటీలో ఎవరో ఒకర్ని దించటమే పెద్ద విజయంగా చంద్రబాబు భావిస్తున్నారు.
– ఎస్ఈసీ యాప్‌పై అనేక అనుమానాలున్నాయి..
– చండాలమైన ఆలోచనలు చేయటంలో చంద్రబాబు పరకాష్టకు చేరారు.
– స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. ప్రలోభాలకు తావు లేకుండా చట్టంలో మౌలిక మార్పులు తెచ్చాం
– స్థానికంగా భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు
– నిమ్మాడలో నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి దిగారు
– నిమ్మాడలో ఇంతవరకు స్వేచ్చగా నామినేషన్ వేసిన సందర్భాలు లేవు
– గతంలో నిమ్మాడలో టీడీపీని వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారు
– దశాబ్దాల అచ్చెన్నాయుడి కుటుంబం నేర చరిత్రకు ఏం సమాధానం చెప్తారు..?
– తూ.గో జిల్లాలో చనిపోయిన వారి ఇంటికి నిమ్మగడ్డ వెళ్లారు.. మరి ఎస్ఈసీ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదు?
– నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారనేది మరోసారి రుజువైంది
– విజయవాడలో అధికారప్రతినిధిపై దాడి ఘటనపై టీడీపీ పాత్ర ఉన్నట్టు అనుమానం ఉంది
– అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే డ్రామాలాడారు.. ఇది చూస్తుంటే మల్లెల బాబ్జీ ఘటన గుర్తుకొస్తోంది
– దగ్గుబాటి పుస్తకంలో బస్సులు తగలబెట్టడమే చంద్రబాబు నైజం అని రాశారు
– అంబేడ్కర్, వంగవీటి రంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
– విగ్రహాల ధ్వంసం చేసి ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అరాచక ఆలోచనలు చంద్రబాబుకు అలవాటే
– ఎస్సీలు, కాపుల మద్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు

పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో కక్షలు తలెత్తకూడదని, శాంతికి భగ్నం కలగకూడదని మంచి వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. వీలైనంత వరకు ఏకగ్రీవాలు ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించటానికి చట్టంలో అవకాశం ఉంది. దానికోసం పారితోషకాలు పెట్టడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పారితోషకాలను  జగన్ ప్రభుత్వం పెంచింది. రెండోవైపు ప్రలోభాలకు, మద్యం, డబ్బు సరఫరా లేకుండా చట్టంలో వాటికి అనుగుణంగా మౌలికమైన మార్పులు జగన్ ప్రభుత్వం తెచ్చింది అని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం మంచి వాతావరణంలో ఎన్నికలు జరపాలనుకుంటే టీడీపీ, చంద్రబాబు పోటీలేని ఎన్నికలు ఉండకూడదు. అసలు ఏకగ్రీవం జరగకుండా పోటీలో ఎవరో ఒకర్ని దించటమే పెద్ద విజయంగా చంద్రబాబు భావిస్తున్నారు. ఏకగ్రీవాలు ప్రోత్సహించటమే తప్పు అన్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు.  తన పాటకు కోరస్‌లాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు అన్నారు.

ఇటీవలే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు సొంతూరు నిమ్మాడ. అక్కడ దశాబ్ధాలుగా పోటీ అనేది లేదంట. అలాంటి చోట మరొకరు నామినేషన్ వేయాలని చూస్తే.. అదీ సమీప దాయాది ఎవరో వేయాలని చూస్తే దౌర్జన్యం చేయాలని చూశారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన వాయిస్‌ రికార్డు బయటకు రావటం, తర్వాత దాడి జరిగింది. ఆ ఘటనపై ఇవాళ అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ఇది టీడీపీ అరాచక విధానాలకు, పట్టు దొరికితే మరొకరికి ప్రజాస్వామ్యం అవకాశం ఇవ్వటానికి ఎట్టి పరిస్థితిలో అంగీకరించమనే ధోరణిని తెలియజేస్తోంది. అయితే చంద్రబాబుకు అలాంటి పట్టు దొరకలేదు. దొరికితే కుప్పంలో అయినా ఇంకొకచోట అయినా ఇదే చంద్రబాబు చేస్తారు. నిమ్మాడ మారుమూల ప్రాంతం అయ్యేసరికి టీడీపీకి కుదిరింది. ఎవరిదృష్టిలో పడలేదు  అన్నారు.

మూడు దశాబ్ధాల కాలంలో నిమ్మాడలో వీళ్లను ప్రశ్నించిన వారిలో 7-8 మందిని చంపేశారు. కింజరాపు కుటుంబం అంటే ఒకరకమైన భయం ఏర్పడింది. దీంతో వీరిని ఎవరు వ్యతిరేకించినా శవమై తేలుతారు. 7-8 మందిని హత్య చేశారు. ఒక మహిళను అయితే వివస్త్రను చేశారట. ఈ హత్యలు అంతా వీళ్లు రిగ్గింగ్ చేస్తో అడ్డుకున్న వాళ్లో, నామినేషన్‌ వేసిన వాళ్లో అయి ఉంటారు. గతంలో అయితే కాంగ్రెస్‌ వాళ్లో, ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ పార్టీ వారు అయి ఉంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఊర్లో చంద్రబాబు చెబుతున్న ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? చంద్రబాబు అనుకుంటున్న బలవంతం ఏకగ్రీవాలు బహుశా దీన్ని చూసే అనుకొని ఉంటారు. రాష్ట్రమంతా పోటీపెడతామని ఈ ఊరిలో మీ ప్రధాన శిష్యుడు అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఎందుకు ఊగిపోయారు. ఎందుకు బెదిరింపులకు దిగారు? ఎందుకు దౌర్జన్యం చేశారో  చంద్రబాబు సమాధానం చెప్పాలి  అన్నారు.

టీడీపీ ఎప్పుడూ ఫ్యాక్షనిస్టు అనే ముద్రను వైయస్‌ఆర్‌ కుటుంబంపై వేయాలని చూశారు. అలాంటి చోట కూడా ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ వేసే పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరూ నామినేషన్ వేయకుండా అడ్డగించిన సందర్భాలు లేవు. గతంలో రేణుకా చౌదరి కూడా పోటీ చేశారు. అప్పట్లో వైయస్‌ఆర్‌ మన ఊరికి ఆడపడుచు వచ్చిందని చీర ఇచ్చి పంపండన్న విషయం తనకు గుర్తు ఉందని సజ్జల అన్నారు. టీడీపీ తరుపున కూడా ఎప్పుడూ సతీష్‌ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. ఇటీవల ఆయన కూడా దూరంగా ఉన్నారు  అన్నారు.

నిమ్మాడ హిస్టరీ చూస్తే ఓ భయంకరమైన సినిమాలాగా ఉంది. కింజరాపు కుటుంబం మొత్తం దీంట్లోనే మునిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు సంబంధించి రెండు విషయాలను సజ్జల సూటిగా ప్రస్తావించారు. చంద్రబాబు తమ రాష్ట్ర అధ్యక్షుడు ఊర్లో పోటీ ఎందుకు వద్దు అనుకున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ గోదావరిలో జిల్లాలో వెళ్లి ఓ వ్యక్తి హత్య మీద చూపిస్తున్న ఆవేశం ఇక్కడకు వెళ్లి ఎందుకు చేయలేదు. ఈ ప్రశ్నలు అందరికీ వస్తాయ్. ఈ ప్రశ్నలనే మేం గట్టిగా అడుగుతున్నాం  అన్నారు.

చంద్రబాబు నంగనాచి మాటలు ఎందుకోసం మాట్లాడుతున్నారో వేలెత్తి చూపుతాం. టీడీపీకి ఎక్కడా పోటీకి మనిషి దొరకని పరిస్థితి ఉంది.  టీడీపీ నాయకులు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏకగ్రీవాలు సహజంగా ఎక్కువగా జరుగుతాయి. దానికి అధికారంతో వీళ్లు ఏదో చేస్తున్నారని మసిపూసి మారేడు కాయ చేయాలని అనుకుంటున్నారు. ఈ దురుద్దేశంతోనే ఎన్నికల తతంగం మొదలవ్వటానికి ముందే చంద్రబాబు, ఎస్‌ఈసీ ఈ రాగం ఎత్తుకొని ఒకటే గొడవ చేస్తున్నారని భావించాల్సి వస్తోంది  అన్నారు.

నిమ్మాడ ఘటనపై కూడా నిమ్మగడ్డ రమేశ్‌ వెళ్లి దానిపై ఖండించినట్లైతే బావుండేది. ఇవాళ సర్పంచ్‌ అభ్యర్థి భర్త చనిపోతే వెళ్లి ఎన్నిక నా పరిధిలో ఉంటుందని నిమ్మగడ్డ మాట్లాడారు. అలాగే సీఐ, ఎస్‌ఐని వీఆర్‌కు పంపమని ఆదేశాలు ఇచ్చారు. ఇదంతా నిమ్మగడ్డ, చంద్రబాబు ఎంత గుడ్డిగా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.  అన్నారు.

జగ్గంపేట నియోజకవర్గంలోని గొల్లలకుంటలో సర్పంచ్ అభ్యర్థి భర్త చనిపోయారు. మొదట అది కిడ్నాప్ అన్నారు. తర్వాత సూసైడ్ అన్నారు. అసలు సంగతి ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. దీనికి ఎన్నికల కోణం ఉందేమో పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆస్తి తగాదాలు, ఎన్నికల తగాదాలు ఉండొచ్చేమో.

అయితే ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయ్. ఏకగ్రీవం కోసం.. బెదిరించి ఉంటే.. చనిపోయింది అభ్యర్థి కాదు. అభ్యర్థి భర్త. అది ఏరకంగా ప్రభావం చూపదు. అదీగాక అక్కడ ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. అంత చండాలమైన పనికి ఎవరైనా దిగే అవకాశం లేదు. ఒక పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో వేరే కోణంకు అవకాశమూ ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన ఘర్షణ అయితే అభ్యర్థిని ఏదైనా చేస్తారు కానీ అభ్యర్థి భర్తనో, ఇంకొకరినో చేయటానికి వేరే కారణాలు ఉంటాయి. కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే ఇదంతా కనపడుతుంది. ప్రతిదాంట్లో దుర్భుద్ధితో ప్రభుత్వాన్ని, అధికార పార్టీని తప్పుడుగా చూపటానికి ప్రయత్నిస్తున్నారు. లోకేశ్‌ అయితే సంఘటన జరిగిన ఐదు నిమిషాలకే స్పందించారు. దానికి ఇంకా ప్రాచుర్యం కల్పించటానికి నిమ్మగడ్డ ఏదేదో మాట్లాడి వచ్చారు. టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. దీనికి ఆయన నిమ్మాడకు వెళ్లకపోవటం.. ఇక్కడకు వెళ్లటం ద్వారా రుజువు చేస్తున్నారు  అన్నారు.

నిమ్మాడలో ఏకగ్రీవం కావాలి. పోటీ వద్దు అని ఎందుకు అడ్డుకున్నారో, ఈ ఘటనపై ఎస్ఈసీ ఎందుకు స్పందించలేదో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. పైగా అక్కడ దశాబ్ధాలుగా ఏకగ్రీవం ఉంది. అక్కడ ఏకగ్రీవాలు ప్రజాభిమానంతో కాదు.. ప్రజలు నెత్తిన పెట్టుకొని ఎన్నుకున్నవి కాదు. అసలు దశాబ్ధాలుగా ఏకగ్రీవం ఎందుకు ఉందంటే నిమ్మాడలో వరుసపెట్టి హత్యలు జరిగాయి కాబట్టే  అన్నారు.

టీడీపీకి సంబంధించిన ఓ నాయకుడి మీద విజయవాడలో దాడి జరిగిందని అంటున్నారు. దాడి చేయటం పిరికిపందల పని. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశమే లేదు. ఆ దాడి  వ్యక్తిగతమేమో చూడాలి. ఆ సదరు నాయకుడు ఎవరైతే దాడికి గురయ్యారో అతను ప్రముఖ వ్యక్తి కాదు.. ఈమధ్య కాలంలో ఎక్కువగా మీడియాలో కనపడుతున్నారు. పూర్వంలో ఏమేమి గొడవలు ఉన్నాయో తెలియదు. ఆ మధ్య కారు మీద దాడి జరిగిందని అన్నారు. ఒక రాయి వచ్చి పడిందన్నారు. ఎవ్వరైనా సరే భౌతికదాడులను ఖండించాల్సిందే.  ఇదేమీ టీడీపీ పాలన కాదు. జగన్ పాలన. ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకుంటాం కానీ భౌతికదాడుల ద్వారా ఏదో జరుగుతుందని నమ్మే పార్టీ కాదు. అలా నమ్మే వ్యక్తి జగన్ కాదు. పదేళ్లు ఎదురుదెబ్బలు తింటూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడారు తప్ప హింసాత్మక ఆలోచనలు జగన్ ఏనాడూ చేయలేదు. ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుంది. అయితే ఆ సందర్భంలో చంద్రబాబు హుటాహుటిన అక్కడకు పోవటం, ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అనుమానం వస్తోంది  అన్నారు.

నిజంగా దాడి చేయాలని అనుకున్నవారు ఇలా చేస్తారని అనుకోవటం లేదు. చంద్రబాబు పోవటం, ఖండించటం వరకు బాగానే ఉంది. దీనికి  జగన్  సమాధానం చెప్పాలని ఖబడ్ధార్.. అని అర్థంపర్థంలేకుండా మాట్లాడటంలో అర్థం కాలేదు. చంద్రబాబు అంత పూనకం వచ్చినట్లు ఎందుకు ఊగిపోయారో కూడా తెలియటం లేదు. ఇది చూస్తుంటే గతంలో ఎన్టీఆర్‌ మీద మల్లెల బాబ్జీ దాడి ఘటన గుర్తుకు వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా దాడి చేయించి దాన్ని మరోలా మలుపు తిప్పాలనుకున్నారు. – అచ్చెన్నాయుడు ఘటన జరిగింది కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి చేయాలన్నట్లు ఉంది. చంద్రబాబు వెళ్లి ఖండించి వస్తే ఎవ్వరికీ అనుమానం వచ్చేది కాదు. కానీ మాట్లాడిన తీరు చూశాక అనుమానం వస్తోంది. ఈ సంఘటన  అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి ఖబడ్ధార్‌ జాగ్రత్త  అంటూ చంద్రబాబు అన్న తర్వాత ఇదంతా డ్రామా అన్న అనుమానం వస్తోంది  అన్నారు.

టీడీపీ నాయకుడుపై వైయస్‌ఆర్‌సీపీ వాళ్లు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని చూసి టీడీపీ వాళ్లు టెర్రరైజ్ అవుతారా? ఆ వ్యక్తికి వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయేమో. స్థానికంగా ఆయనంటే పడనివారు ఏమైనా చేస్తున్నారేమో. అయితే ఇలా వ్యవహరించటం మాజీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు స్థాయికి తగిందని కాదని చెప్పదల్చుకున్నాను. అయితే చంద్రబాబు ఏదైనా క్రియేట్  చేసి దాన్ని హైలైట్ చేయటం వంటి లక్షణాలు ఉన్నాయి. దానికి ఉదాహరణే మల్లెల బాబ్జీ ఘటన. – ఏదైనా ఉద్యమం, బంద్ అంటూ జరిగితే రెండు బస్సులు తగలడకపోతే ఎలా బ్రదర్ అని చంద్రబాబు అన్నారని దగ్గుబాటి తన పుస్తకంలో రాశారు. హింస లేకపోతే దానికి రిజల్ట్ ఉండదనే ఆలోచనలు చంద్రబాబులో ఉన్నాయి. ఆయన చరిత్ర మన కళ్ల ముందు కనపడుతోంది. చంద్రబాబు మాటలు కూడా అవే సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే అంశాలు ఉంటే వాటిని ప్రశ్నించండి. విధానపరమైన నిర్ణయాలు కానీ, ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రశ్నించండి. కానీ ఊర్లో, వీధిలో ఏదో జరిగితే దానివెనుక పెద్ద కుట్ర అంటే జనం చెవిలో పూలు పెట్టుకోలేదు. ఎవ్వరూ వాటిని విశ్వసించరని చంద్రబాబు గమనించాలి  అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. అపచారం జరిగిందన్న విషయం తన దృష్టికి వచ్చింది. ఇది ఒక ట్రెండ్‌ను సూచిస్తోందని గట్టిగా నమ్ముతున్నాను. మా దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం దేవాలయాలపై దాడుల్లోనూ టీడీపీ సానుభూతి పరులు, యాక్టివిస్ట్‌లే అరెస్ట్ అయ్యారు. ఇది ప్రజలు గమనించారు. మేం ముందు నుంచి చెబుతున్నాం. దారిపోయేవాడు ఎవరో నగల కోసమో ఇంకొదాని కోసమో దాడులు  చేయలేదు. మతసామరస్యం దెబ్బతీయాలని రాజకీయాల కోసం వాడుకునేవారో, టీడీపీ మనుషులో చేసి ఉంటారని అనుకున్నాం. అదే నిజమవుతూ వచ్చింది. రాజమండ్రి సంఘటనలోనూ పూజారికి టీడీపీ వాళ్లే డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి చేయించారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది  అన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా తమ పార్టీ నాయకులకు రహస్యంగా సందేశాలు పంపుతున్నారని తెల్సింది. అంబేద్కర్ విగ్రహాలు, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వంసం చేసి ఆ నేరాలను వైయస్‌ఆర్‌సీపీ మీదకు తోయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. గోదావరి జిల్లాల్లోనే అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలున్నాయ్. దీనిమీదే దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వీటిపై దాడులు చేసి ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు. ఇది ఘంటాపథంగా చెప్పగలం. చంద్రబాబు తనదగ్గరి వాళ్లతో అన్నట్లు అక్కడ నుంచి ఆ సమాచారం కిందకు పోతున్నట్లు తెల్సింది. ఈ విషయమై అందరూ అప్రమత్తతతో ఉండాలని కోరుతున్నాం. టీడీపీ వాళ్ళు ఎంత నీచానికైనా తెగిస్తారు. చండాలమైన ఆలోచనలు చేయటంలో చంద్రబాబు పరకాష్టకు చేరారు. వాటిని అమలు చేయటంలో తగిన అలవాట్లు చంద్రబాబుకు ఉన్నాయి. అవి చేసే యంత్రాంగం, వాటిని ప్రచారం చేసే యంత్రాంగం, వాటిని న్యాయవ్యవస్థలో పెట్టి లిటిగెంట్‌ గల లాయర్లు కూడా చంద్రబాబుకే ఉన్నారు. శూన్యంలో నుంచి ఏదైనా తీసి సృష్టించగలనే ధీమా కలిగిన నాయకుడు చంద్రబాబు. దీనికి తార్కాణాలు కూడ ఉన్నాయ్  అన్నారు.

ఇప్పుడు దేవాలయాలు అయిపోయాయి. మళ్లీ కులాల మధ్యనో, ఎస్సీల మధ్య, ఎస్సీలు, కాపుల మధ్య, కాపులకు ఇతర కులాలకు మధ్య రాజకీయంగా వైయస్‌ఆర్‌సీపీని డ్యామేజి చేసే విధంగా చంద్రబాబు కుట్ర చేయాలని అనుకుంటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాలు వస్తాయనే ఆశతో, దురాశతో ప్లాన్ వేస్తున్నట్లు కచ్చితంగా తెలుస్తోంది. అన్ని వర్గాల వారు.. జాతి హితం కోరేవారు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను  అన్నారు.

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ యాప్‌ తీసుకువస్తుందంటే ఎస్‌ఈసీ ఒప్పుకోలేదు. పంచాయితీరాజ్‌ యాప్‌ ను ఎస్‌ఈసీ ఒప్పుకోకుండా సొంతంగా చేస్తాం అన్నారు. ప్రభుత్వ శాఖ తయారు చేసిన యాప్‌ కాకుండా సొంతంగా యాప్‌పై వైయస్‌ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిపై అప్లికేషన్‌ ఇచ్చాం. ప్రభుత్వ యాప్‌ను వాడాలని లేకపోతే ఎన్‌ఐసీ చేసి ఇచ్చిన సీ-విజిల్‌ వాడమని చెప్పాం. దానికి డేటా బేస్‌ సర్వర్‌ ఉందని పారదర్శకంగా ఉంటుందని విజ్ఞప్తి చేశాం. రేపు ఏదో కొత్తది లాంచ్ చేస్తామంటున్నారు. ఏదైతే పారదర్శంకాకుండా, సెక్యూరిటీ ఫైర్‌వాల్స్‌ సక్రమంగా లేకుండా కొత్తగా యాప్‌ పెడుతున్నారో దాన్ని నమ్మటానికి వీల్లేదని వైయస్‌ఆర్‌సీపీ కచ్చితంగా భావిస్తుంది  అన్నారు.

నిమ్మగడ్డకు ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అర్జెంట్‌గా కావాలంటే కొత్తగా సెలక్ట్‌ చేసింది టెక్నికల్‌గా చెక్‌ చేసే సమయం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినదైనా వాడండి. మీరు ఆధారపడాల్సింది ప్రభుత్వ అధికారుల మీదనే. వారికి చూపించి అమల్లోకి తీసుకురండి. లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసిన సీ-విజిల్ తెప్పించి వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా నిష్పక్షపాతంగా ఉన్నానని నిమ్మగడ్డ నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను  అన్నారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
– నిమ్మగడ్డ చెబుతున్న ఆ యాప్‌లో కొన్ని ఫిల్టర్‌ చేసే అవకాశం ఉండొచ్చు. మా కంప్లైంట్స్‌ చేరకపోవచ్చు. దీనిపై మా కార్యకర్తలను, కింద వారు టీడీపీ అరాచకాలు మాకు పంపిస్తే ఇక్కడ నుంచి ఎస్‌ఈసీకి కంప్లైంట్ చేస్తాం. మా వ్యవస్థలు మేం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లటం మంచిది. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా లేదని రోజూ నిరూపించుకుంటున్న నేపథ్యంలో మేం ఇలాంటివి డిమాండ్ చేస్తున్నాం.