తాకట్టు+వేలంపాటలు+అప్పులు=కేంద్ర బడ్జెట్‌

524

కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి మూడుముక్కల్లో చెప్పుకోవాలంటే ఇది ఆస్తుల వేలం, తనఖాలు, అప్పుల మయంగా తేల్చవచ్చు. గత నాలుగైదేండ్లుగా ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవు తుందన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌ వివరాలు, రిజర్వు బ్యాంకు విడుదల చేసే పద్దుల వివరాల్లో గానీ, ఆర్థిక సర్వేలో కానీ ఈ సంక్షోభం భావన కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.ఎట్టకేలకు కాకిపొడిస్తే రాచపుండు పగిలినట్లు కోవిద్‌ దెబ్బకు మన ఆర్థిక వ్యవస్థ అసలు రంగు బట్టబయలవుతోంది.

బడ్జెట్‌ ఉపన్యాసంలో ఆర్థిక మంత్రి ఓ వాస్తవాన్ని అంగీకరించారు. ఇప్పటి వరకు భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం మన స్వయంకృతాపరాధమన్నదే ఈ వాస్తవం. ”ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంక్షోభానికి దేశీయ కారణాలే ప్రధానమైతే నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం ప్రపంచ వ్యాప్త స్వభావం కలిగిందని” ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రముఖ ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తుంటే ఇప్పటి వరకు పెడచెవిన పెట్టిన కేంద్రం నేడు బాహాటంగా ఒప్పుకోవటం విశేషమే.

పన్ను ఆదాయం పద్దులు గమనిస్తే పాలకవర్గ పక్షపాతం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో సంపాదించాలనకున్న ఆదాయం 24,23,020 కోట్లు. కోవిడ్‌ పుణ్యమా అంటూ ఈ పద్దులో సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. అంటే ప్రభుత్వం పన్నుల ద్వారా ఆశించిన ఆదాయంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు రాలేదు. ఈ మేరకు ప్రభుత్వ బడ్జెట్‌ లోటు పెరగాలి.

బడ్జెట్‌ లోటు పెరగటం అంటే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి దృష్టిలో ”శుభకార్యానికి వెళ్తూ పిల్లిని చంకన బెట్టుకున్నట్టన్నమాట”. అంటే ఏ దేశంలో ద్రవ్య లోటు అధికంగా ఉంటే ఆ దేశంలో లాభాల రేటు తక్కువగా ఉంటున్నదన్నది ద్రవ్య పెట్టుబడి సూత్రం. గుడిలోకి వెళ్లినా చిత్తం చెప్పుల మీదనే అన్నట్లు ఎంతగా జాతీయత, స్వదేశీ రాగం తీస్తున్నా పాలకవర్గం చిత్తం విదేశీ పెట్టుబడులపైనే ఉంటుంది. అందుకే వారి ముందు అంతా ఆరోగ్యంగానే ఉన్నామన్న ఫోజు పెట్టడానికి ఈ లోటును వివిధ రూపాల్లో సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు.

పన్నుల ఆదాయం ద్వారా వచ్చే లోటులో ప్రత్యేకించి పరిశీలించాల్సిన అంశం ప్రత్యక్ష పరోక్ష పన్ను ఆదాయాల పొందిక. 2021 మార్చితో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్‌ పన్ను ద్వారా (పధానంగా కంపెనీలు చెల్లించే పన్నులు) ఆశించిన ఆదాయంలో రూ.2,35,000 కోట్ల మేర గండి పడింది. పన్నేతర ఆదాయంలో మరో 1,78,479 కోట్ల రూపాయలు గండిపడింది. ఈ రెండు కలిపితే రూ.4,13,479కోట్ల లోటు. ఈ లోటు పూడ్చుకోవటానికి కేంద్రం అనుసరించిన విధానం పరోక్ష పన్నులు.

ప్రత్యేకించి కేంద్రం విధించే ఎక్సైజు పన్నులు రెట్టింపు చేసేసింది. ఫలితంగా యూనియన్‌ ఎక్సైజు సుంకం ద్వారా రూ.2,67,000ల కోట్లు వసూలవుతుందనుకున్న ఆదాయం ఏకంగా రూ.3,61,000 కోట్లు వసూలైంది. అంటే ఈ ఒక్క సంవత్సరమే పెట్రోలియం ఉత్పత్తులపై అదనంగా విధించిన పన్నుల ద్వారా ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారాన్ని మోపిన వాస్తవాన్ని కేంద్ర బడ్జెట్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో మరో ఆందోళనకర కోణం మార్కెట్‌ రుణాలు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.5,40,869 కోట్ల మేర మార్కెట్‌ రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలకు గండి పడటంతో పనిలో పనిగా 10లక్షల కోట్ల మేర మార్కెట్‌ రుణాలు సమీకరించింది. వచ్చే ఏడాది మరో రూ.917707 కోట్ల మేర మార్కెట్‌ రుణాలు సమీకకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దిగ్విజయంగా నడిపించి దాని పై వచ్చే పన్నుల ద్వారా పరిపాలన సాగించటం లేదు. అధోగతి పాలైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించలేక రుణసమీకరణలతో పబ్బం గడుపుతోందని చెప్పటానికి ఈ వివరాలు చాలు.

మరో ప్రమాదకరమైన అంశం ప్రభుత్వ రుణాలు. అంటే ప్రజలు వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం తన అవసరాలకు, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు వినియోగిస్తూ ఉంటుంది. అయితే ప్రజలు ఇలా దాచుకునే సొమ్ము సహజంగా ఏ స్కీమ్‌ల రూపంలోనో ఉంటుంది. అంటే ఐదేండ్లకో పదేండ్లకో వేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలోనో, లేదా ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలోనో ఉంటాయి. ఇటువంటి ప్రజా పొదుపు సాధనాల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు దిమ్మతిరిగే స్థాయికి చేరుకుంటున్నాయని బడ్జెట్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారమే 2016 మార్చి నాటికి రూ.59,69,968 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,03,19,213 కోట్లకు పెరిగాయి. అంటే గత నాలుగేండ్లల్లో ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులు సుమారు యాభై లక్షల కోట్లు. వచ్చే సంవత్సరానికి మరో 35లక్షల కోట్ల మేర అప్పు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ లెక్కలు తెలియ చేస్తున్నాయి. ఈ అప్పు అంతా ఐదేండ్ల తర్వాతనో, పదేండ్ల తర్వాతనో తీర్చాల్సిన అప్పే. అంటే ఇప్పుడు తాను చేసే ఖర్చులకు తన ఆర్థిక వ్యవస్థ వైఫల్యాలను అధిగమించాలంటే రాబోయే ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన ప్రయాణం చేయక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక విధానాల కోసం పని చేస్తున్న వారంతా గమనించాల్సిన విషయం ఇది.

ఈ స్థాయిలో దీర్ఘకాలిక రుణాలతో పాటు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి ప్రభుత్వ ఆస్తులు కుదవ పెట్టడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు తెగనమ్మటం ఓ ముఖ్యమైన మార్గంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. దానికనుగుణం గానే రానున్న కాలంలో ప్రభుత్వ ఆస్తులు కుదువ పెట్టే వ్యవహారాలు చూడటానికి ఎస్సెట్‌ మానిటైజేషన్‌ విభాగాన్ని ప్రారంభించనున్నన్నారు. అంటే ఏ ప్రభుత్వ ఆస్థిని ఎంత కాలం కుదవ పెట్టి ఎంత మొత్తం అప్పు తీసుకోవచ్చో, దాని కోసం రూపొందించే ఒప్పందాలు ఎలా కుదుర్చుకోవాలి, ఎలా అమలు చేయాలి అన్న విషయాలు ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో ఆగక గుండెలు చీల్చి చూసినా తమకు ప్రయివేటు పెట్టుబడి ప్రయోజనాలే కనిపిస్తాయని చెప్పే క్రమంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన మూడు నాలుగు రంగాల్లో మినహా మిగిలిన రంగాల్లోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టనున్నట్టు ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం విస్తరిస్తూ ఉండటంతో ఇప్పటికే గత రెండు మూడేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతగా ప్రభుత్వ రంగ సంస్థల వేలం పాట వేస్తున్నా కొనుగోలు దారులు దొరకటం లేదు. దాంతో ఈ వేలం పాటలు మరింత ఆకర్షణీయంగా మార్చటానికి వీలుగా కొత్త కొత్త ఆఫర్లు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక సామాజిక రంగాలకు కేటాయింపుల విషయానికి వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బతికించే రంగాలు, పనులకు సంబంధించిన నిధులు లక్ష కోట్ల మోతాదులో ప్రకటించినా ఇది ఐదారేండ్ల కాల వ్యవధిలో ఖర్చయ్యేవి కనుక ఆయా రంగాలకు ఇప్పటికిప్పుడు ఒరిగిపడేదేమీలేదు. వాక్సిన్‌ వితరణ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించ నున్నామని ప్రకటించటం ఒక్కటే గుడ్డిలో మెల్ల.

అయితే ఈ సొమ్ముతో ప్రజలకు ఉచితంగా వాక్సిన్‌ అందుబాటులోకి తెస్తారా, లేక రాయితీ ధరలతో అందుబాటులోకి తెస్తారా లేక వాక్సిన్‌ ఉత్పత్తికి పురమాయించిన కంపెనీలకు ఉత్పత్తి ఆధారిత రాయితీగా పంచుతారా అన్న వివరాలు మాత్రం బడ్జెట్‌లో లేవు. చివరిగా వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు కల్పించటానికి అయ్యే ఖర్చు కూడా ప్రత్యేక సెస్‌ ద్వారా వసూలు చేయాలని నిర్ణయించింది. కరువు, కోవిడ్‌ కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఉపాధి హామీ చట్టం గురించి గానీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన పట్టణ ప్రాంత ఉపాధి హామీ పథకం గురించి కానీ ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. ఏతావాతా చూస్తే ఈ బడ్జెట్‌ ఉన్న కొద్ది పాటి ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి రోడ్‌ మాప్‌ వేసేదిగా ఉంది తప్ప ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించటానికి ఉపకరించేదిగా లేదు.

– కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037