‘ఫలితాల’లో వైఎస్ దారిలో జగన్?

473

విజయం సాధించకపోతే వేటు తప్పదా?
సచివుల సత్తాకు ‘స్థానిక’ పరీక్ష!
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకిపెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు.. స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రుల పనితీరుకు పరీక్షగా మారాయి. ప్రతిభ చూపని మంత్రుల పదవులకు ఎసరు తప్పదన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్, గతంలో తన తండ్రి వైఎస్ నిర్ణయాలనే అనుసరించనున్నారన్న వార్తలు మంత్రులను ఠారెత్తిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ హయాంలో జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఫలితాలు కనబరచని పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన మంత్రి మాగంటి రవీంద్రనాధ్ చౌదరి, కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి మారెప్పను మంత్రివర్గం నుంచి తొలగించారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతిభ కనబరచని మంత్రులపై, జగన్ కూడా అదే విధానం అనుసరించే అవకాశం లేకపోలేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

నిజానికి రెండున్నరేళ్ల తర్వాత ప్రతిభ కనబరచని మంత్రులను తొలగిస్తామని,  జగన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజునే స్పష్టం చేశారు. అయితే, వచ్చే ఏడాది నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందువల్ల మంతివర్గ ప్రక్షాళనకు, స్థానిక ఎన్నికల ఫలితాలే సరైన వేదికగా సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఇప్పటికే రెండేళ్లు పూర్తయినందున, ఎన్నికల్లో ఫలితాలు తీసుకురాని మంత్రులను తొలగించేందుకు ఇదే సరైన అవకాశమని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నామినేషన్లు ముగిసి, రెండో దశ పర్వం ప్రారంభమయింది. 3,249 గ్రామ పంచాయతీలలో, 32,504 వార్డుకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అత్యధికంగా చిత్తూరు,తూర్పు గోదావరి జిల్లాలలో నే 4 వేలకు పైగా వార్డులున్నాయి. అత్యల్పంగా నెల్లూరులో 163 పంచాయితీలున్నాయి. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలపైనే మంత్రులు దృష్టి సారించడం ద్వారా,  వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ ఆర్ధికంగా బలహీనంగా ఉన్నప్పటికీ.. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మాత్రం రాజకీయంగా వైసీపీని ప్రతిఘటిస్తోంది. అక్కడ టీడీపీ నాయకత్వం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. కార్యకర్తలకు ప్రత్యకంగా రూపొందించిన యాప్ ద్వారా, వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయింది. దానితో ఈ జిల్లాల్లో పోటీ తప్పేలా కనిపించడం లేదు.

ఇక తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు. నెల్లూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే రోజా వంటి నేతలకు-మంత్రుల మధ్య విబేధాలున్నాయి. శ్రీకాకుళంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, కర్నూలులో మంత్రి జయరాం- ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు. ఈ పరిణామాలన్నీ ఎన్నికలలో ప్రభావం చూపిస్తే, అది మంత్రుల ఖాతాలోనే కలిసే ప్రమాదం కనిపిస్తోంది. దీనితో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సర్దుకుపోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఫలితాలు రాకపోయినా, దానికి జిల్లా మంత్రులే బాధ్యత వహించక తప్పని ఇరకాట పరిస్థితి, కొందరు మంత్రులను ఇప్పటినుంచే భయపెడుతోంది.

టీడీపీ మాదిరిగా వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆర్ధిక ఇబ్బందులేమీ కనిపించడం లేదు. ఇటీవల ఇళ్ళ స్థలాల కోసం చేసిన భూ సేకరణ కొనుగోలు వ్యవహారం, వారిని ఆర్ధికంగా నిలదొక్కు‘కొనేలా’ చేసిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే పార్టీ నుంచి నిధులు రాకున్నా, వాటితోనే ఎన్నికలు జరిపించేంత శక్తి వారికి ఏర్పడిందంటున్నారు. అయినప్పటికీ…  టీడీపీ రాజకీయంగా బలంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలు మంత్రులను కలవరపెడుతున్నాయి. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ విశ్వరూపం ప్రదర్శిస్తుండటం, తమకు సహకరించే అధికారులపై జిల్లాల్లో టీడీపీ నేతలు దృష్టి సారిస్తుండటం, ప్రతి చిన్న అంశాన్నీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తుండటంతో కొందరు మంత్రుల పరిస్థితి ఇబ్బందుల్లో పడినట్టయింది. నిమ్మగడ్డ దూకుడు వల్ల, చాలామంది అధికారులు తమకు సహకరించే అవకాశం లేదన్న ఆందోళన వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ కనిపిస్తోంది.

ఆ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు.. నెంబర్‌టూ స్థానంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్, సుచరిత, కన్నబాబు, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, ముత్తంశెట్టి శ్రీనివాస్ సత్తాకు అగ్నిపరీక్షగా మారాయి. వీరిలో పెద్దిరెడ్డి, బొత్స జిల్లాలే కొంచెం సురక్షితంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.