గొల్లలగుంటలో శ్రీనివాస రెడ్డి హత్యపై మండిపడ్డ చంద్రబాబు

229

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచి అభ్యర్ధి పుష్పవతి భర్త శ్రీనివాస రెడ్డిని హత్య చేసి పొలంలో వేలాడదీయడంపై తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నిన్న కిడ్నాప్, ఈ రోజు హత్యచేసి చెట్టుకు వేలాడ దీయడం, వైసిపి ఉన్మాదానికి, కిరాతక చర్యలకు నిదర్శనం. కిడ్నాప్ చెరనుంచి శ్రీనివాస రెడ్డి బైటపడి, టివి ఛానళ్లలో మాట్లాడి కొన్ని గంటలు కూడా కాకముందే హత్యకు గురికావడం రాష్ట్రంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థకు, రూల్ ఆఫ్ లా లేదనడానికి, క్షీణించిన శాంతిభద్రతలకు ప్రబల నిదర్శనం.
స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన వ్యక్తులు కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారంటే రక్షకుల్లో కొందరు భక్షకులుగా మారడమే.. వైసిపి ఫాక్షనిస్టులతో పోలీసుల్లో కొందరు,కుమ్మక్కై ఈ హత్యాకాండకు సహకారం అందించడం సిగ్గుచేటు..గురజాలలో దోమతోటి విక్రమ్ హత్య, ఇప్పుడీ శ్రీనివాస రెడ్డి ప్రాణాలు కోల్పోవడం ప్రత్యక్ష సాక్ష్యాలు.. నిందితులను యధేచ్ఛగా వదిలేసి బాధితులనే వేధింపులకు గురిచెయ్యడం పోలీస్ స్టేషన్లలో నిత్యకృత్యం అయ్యింది.
మ్యాన్ ఈటర్ల పార్టీగా వైసిపి మారింది. ప్రజల ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకుంది. గతంలో పులివెందులకే పరిమితమైన పాలెగాళ్ల రాజ్యం జగన్ రెడ్డి సిఎం కాగానే రాష్ట్రం మొత్తానికి విస్తరించింది. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో హింసా విధ్వంసాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారు. చివరికి గోదావరి జిల్లాల్లో కూడా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
రేపటి పంచాయితీ ఎన్నికల్లో వైసిపి గెలిస్తే ఇక ప్రతిఊరు పాలెగాళ్ల రాజ్యమే అవుతుంది. జగన్ ఫాక్షన్ గ్యాంగ్ లే గ్రామాల్లో స్వైర విహారం చేస్తాయి. కాబట్టి ప్రతి పల్లె మేల్కొనాలి, వైసిపికి బుద్ది చెప్పాలి.
శ్రీనివాస రెడ్డి హత్య వైసిపి ప్రభుత్వ హత్య. పోలీసుల ఉదాసీనతకు, వైసిపి హింసా రాజకీయాలకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒక అభ్యర్ధి పసుపు-కుంకుమలు నేలరాలాయి.
శ్రీనివాస రెడ్డి హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.