స్వరూపానంద లేకుండా..తిరుపతిలో పీఠాథిపతుల ధర్మాచార్యుల సభ

787

మతమార్పిళ్లు, దేవాలయాలపై దాడులే అజెండా
త్వరలో కోటిమంది భక్తులతో జిల్లాకో హిందూ ధర్మపరిరక్షణ సభ?
దళితవాడల్లో పీఠాథిపతుల ధార్మిక కార్యక్రమాలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్ రాజగురువయిన విశాఖ శారదా పీఠాథిపతి స్వరూపనంద సరస్వతి లేకుండానే, పీఠాథిపతులు ధర్మాచార్యుల సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న మత మార్పిళ్లు, దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడుల నిరోధమే అజెండాగా,  ఫిబ్రవరి 3వ తేదీన తిరుపతిలో ధర్మాచార్యుల సభ నిర్వహించనున్నారు. తొలిసారి విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ సూచనలు లేకుండానే, పీఠాథిపతులే చొరవ తీసుకుని, కొన్ని దఫాలుగా చర్చించుకుని నిర్వహించనున్న ఈ సభకు ప్రాధాన్యం ఏర్పడింది.

ధర్మంపై దాడులు జరుగుతున్నప్పటికీ, పీఠాథిపతులు స్పందించడం లేదంటూ.. హిందూ సమాజం నుంచి వెల్లువెత్తిన అసంతృప్తిని పీఠాథిపతులు పరిగణనలోకి తీసుకున్నారు. దాని ఫలితంగానే  ఈ సభ నిర్వహించాలని జనవరిలో జరిగిన పీఠాథిపతుల సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగానే  తిరుపతిలో  సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 3న తిరుపతిలో జరగనున్న ఈ సభకు సుమారు పదిమంది పీఠాథిపతులు హాజరుకానున్నట్లు సమాచారం. రామతీర్థం ఘటన తర్వాత, కొంతమంది పీఠాథిపతులు అమరావతిలో తొలిసారి భేటీ అయి, కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ తర్వాత జరిగిన వరస భేటీలలో తిరుపతి వేదికగా ధర్మాచార్యుల సభ నిర్వహించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ సభలో రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లను అడ్డుకునేందుకు తీసుకోవలసి చర్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా.. దళితవాడల్లో ఆలయ నిర్మాణాలు, దళితవాడల్లో పీఠాథిపతుల కార్యక్రమాలు నిర్వహించే అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు,  భక్తులతో కలసి నిర్వహించాల్సిన ఆద్మాత్మిక, హిందూ చైతన్యసభల నిర్వహణపైనా చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. రాష్ట్రంలో కోటి మంది భక్తులను కలవడమే లక్ష్యంగా, 13 జిల్లాల్లో హిందూ ధర్మ పరిరక్షణ సభలు నిర్వహించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా లేదా రెండు జిల్లాలకు కలిపి లక్షమంది భక్తుల సమక్షంలో ఈ సభలు నిర్వహించాలని, గత నెలలో జరిగిన పీఠాథిపతుల తొలి సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

ఆ తర్వాత పీఠాథిపతులే ప్రభుత్వం వద్దకు వెళ్లి, ఆలయాలపై దాడుల గురించి చర్చించాలా? లేక ప్రభుత్వ ప్రతినిధినే తమ వద్దకు తీసుకువచ్చేలా చేసి, హిందువుల మనోభావాలు వెల్లడించాలా? అన్నది ఫిబ్రవరి 3న జరగనున్న ధర్మాచార్యుల సభలో నిర్ణయిస్తారని తెలుస్తోంది.

కాగా, తిరుపతిలో జరగనున్న ఈ సభకు.. సీఎం జగన్ రాజగురువయిన, విశాఖ పీఠాథిపతి స్వరూపానందకు ఆహ్వానం పంపకుండానే  ధర్మాచార్యులు ఒకే వేదికపైకి వస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. పదిమంది పీఠాథిపతులు హాజరయ్యే ఈ సభకు, ఆయనను ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న స్వరూపానంద హాజరయితే, ధర్మాచార్యుల సభ సంకల్పం, అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ముందుచూపుతోనే, ఆయనను ఆహ్వానించలేదని సమాచారం.

రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్లు, దేవాలయాలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించకపోగా, ఇది ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా వ్యాఖ్యానించడాన్ని,  హిందూ సంస్థలు- హిందూ సమాజం స్వరూపానందపై గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయనను కూడా ధర్మాచార్యుల సభకు ఆహ్వానిస్తే, అది సహజంగా ‘ప్రభుత్వ అనుకూల సభ’ అన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్న భావనతోనే, స్వరూపానందను ఆహ్వానించలేదని స్పష్టమవుతోంది.

అయితే సహజంగా ఆర్‌ఎస్‌ఎస్ లేదా వీహెచ్‌పీ ప్రోత్సాహం, ఆశీస్సులతోనే ఇలాంటి సభలు, భేటీలు జరుగుతుండటం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ఈసారి ఆ రెండు సంస్థలతో సంబంధం లేకుండా, పీఠాథిపతులే కీలమైన ధర్మాచార్యుల సభ నిర్వహించుకోవడం విశేషం. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై,  ఆ రెండు సంస్థలు దూకుడుగా వెళ్లడం లేదన్న అసంతృప్తి అటు హిందూ సంస్థల్లో నెలకొంది. తెలంగాణలో మాత్రం దూకుడుగా వెళుతున్న ఈ సంస్థలు ఏపీలో మాత్రం ఆశించినంత పనిచేయడం లేదన్న అసంతృప్తి కూడా వారిలో లేకపోలేదు. ఈ  నేపథ్యంలో, పీఠాథిపతులే చొరవ తీసుకుని, ధర్మాచార్యుల సభ నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది