‘ఏకగ్రీవాలే’ లక్ష్యంగా ఏకమైన వైసీపీ ‘ముఖ్య’ నాయకులు

161

– మంత్రి మేకపాటి క్యాంప్ కార్యాలయంలో ‘స్థానిక’ వ్యూహం
– గ్రామ స్వరాజ్యం సాకారం దిశగా అడుగులు
– ప్రజాదరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, పారదర్శక సంక్షేమ పాలన ప్రభుత్వ ఆయుధం

సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది మార్కులతో క్లీన్ స్వీప్ తో గెలిచిన నెల్లూరు జిల్లా స్థానికంలోనూ అదే విధంగా విజయదుందుభి మోగించిందేందుకు సన్నద్ధమవుతోంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా  సర్పంచ్ లను ఎన్నుకునే వ్యూహాలను రచించేందుకు మంత్రి మేకపాటి కార్యాలయంలో  నెల్లూరు జిల్లా నేతలంతా ఏకమయ్యారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాల పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఎక్కడా ఘర్షణలకు తావులేకుండా, గ్రామాల ప్రజల ఆమోదంతో, ప్రజాభిష్టంతో వీలైనన్ని ఏకగ్రీవాలు జరిగేలా  చూడాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు.

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేశారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ ను సంతృప్తి పరిచేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చొరవచూపాలని దిశానిర్దేశం  చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, పారదర్శక పాలనతో ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికంలో తిరుగుండబోదని నెల్లూరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నెల్లూరు జిల్లా నాయకులంతా ఏకమై పంచాయతీ ఎన్నికల ఫలితాలలో సత్తా చాటుతామన్నారు. ఈ సందర్భంగా వ్యూహ,ప్రతి వ్యూహాలపై జిల్లా నాయకత్వమంతా  కలిసి చర్చించారు.

వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ  మేకపాటి రాజమోహన్ రెడ్డి తన వ్యక్తిగత అనుభవాలను, గత ఎన్నికలప్పుడు ఎదురైన ఇబ్బందులను మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించి తగు సూచనలిచ్చారు.
మేకపాటి  క్యాంపు  కార్యాలయానికి విచ్చేసిన అగ్రనాయకులందరినీ మంత్రి గౌతమ్ రెడ్డి, మాజీ ఎంపీ  మేకపాటి రాజమోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేకించి మాజీ ఎంపీ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల కోణంలో గల బలాబలాలు మాట్లాడుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే నామినేషన్లు వేయించి ప్రభుత్వ విజయదుందుభిని తగ్గించడానికి చేస్తున్న అంశాలను ఒకరికొకరు చర్చించారు. కావాలనే వైసీపీ రెబల్ అభ్యర్థుల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని చేస్తున్న కుట్రలను ఛేదించాలని ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని ఈ కీలక సమావేశం ద్వారా చాటారు. చర్చల అనంతరం మంత్రి మేకపాటి  దగ్గరుండి  గౌరవమర్యాదలతో సాగనంపిన తీరు,వినయవిధేయతలు ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ,  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి , సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్, కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు .