భగ్గుమంటున్న పెట్రోలు!

241

బండి రోడ్డెక్కాలంటే తప్పనిసరైన పెట్రోల్, డీజిల్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వేర్వేరు దేశాల్లో అతి తక్కువ ధర పలుకుతున్న పెట్రోడీజిల్ లు మనదేశంలో ప్రత్యేకంగా ఏపీలో అత్యధిక ధరకు చేరుకుంటున్నాయి. పెట్రోల్ ధరలు ఏపీలో 92 రూపాయలు దాటేయగా డీజిల్ ధర 85 రూపాయలు దాటేసింది. రానున్న రోజుల్లో ఈ ధరలు సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు డీలర్లు, వినియోగదారులు. రోజుల వ్యవధిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు బ్యారెక్ ధర చాలా తక్కువ దేశంలోకి వస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వివిధ రకాల పన్నుల కారణంగా అది మోత మోగిపోతోంది. ఒకసారి ధరలను పరిశీలిస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీలో పెట్రోల్ ధర 92.42 రూపాయలు ఉండగా, డీజిల్ 85.62 రూపాయలు ఉంది.

పెట్రో ధర రూపొందేది ఇలా

పెట్రోల్ బేసిక్ ధర – 27.75 రూపాయలు

కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ – 32.98 రూపాయలు

డీలర్ కమిషన్ – 3.67 రూపాయలు

ఆయిల్ కంపెనీ ఛార్జీలు – 3 రూపాయలు

రాష్ట్ర ప్రభుత్వం

వ్యాట్ – 31 శాతం

లీటరుకు 4 రూపాయలు అడిషినల్ సెస్

రోడ్ల బాగుకి లీటరుకు రూపాయి (ఈ రూపాయిపై 31 శాతం వ్యాట్ కూడా వేస్తారు)

వీటికి ట్రావెల్ ఛార్జి కలిపి మొత్తం – 92.42 పైసలు అవుతుంది. లీటరుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్ నుంచి 25 రూపాయలు ఆదాయం వస్తుంది.

డీజిల్ ధర రూపొందేది ఇలా

డీజిల్ బేసిక్ ధర – 28.66 రూపాయలు

కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ – 31.83 రూపాయలు

డీలర్ కమిషన్ – 2.53 రూపాయలు

ఆయిల్ కంపెనీ ఛార్జిలు – 3 రూపాయలు

రాష్ట్ర ప్రభుత్వం

వ్యాట్ – 22.25 శాతం

లీటరుకు 4 రూపాయలు అడిషినల్ సెస్

రోడ్ల బాగుకి లీటరుకు రూపాయి (ఈ రూపాయిపై 22.25 శాతం వ్యాట్ వేస్తారు)

వీటికి ట్రావెల్ ఛార్జి కలిపి 85.62 రూపాయలు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కూడా గత ఆరేళ్ళలో దారుణంగా పెంచిన పరిస్థితి. దీన్ని ఆయిల్ కంపెనీల డీలర్లు సైతం చెబుతున్నారు. 2014కి ముందు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ డీజిల్ పై లీటరుకి 3.40 రూపాయలు ఉండగా, పెట్రోల్ మీద 9.60 రూపాయలు ఉండేది. ఈ ఆరేళ్ళ కాలంలో అది 30 రూపాయలను దాటేసింది. ఇది కూడా పెట్రో ధరలు ఆకాశాన్ని తాకటానికి ఓ కారణంగా మారాయి. పెట్రో, డీజిల్ బ్యారెల్ ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల పన్నులు వేరే విధంగా ఉండటంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య కూడా పెట్రో ధరల్లో తేడాలు ఉంటున్నాయి. పక్క పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటంతో సరిహద్దుల్లో ఉన్న పెట్రోలు బంకులు బోర్డులు పెట్టి మరీ అమ్మకాలు చేస్తున్నాయి. ఇదే ఈ రాష్ట్ర సరిహద్దుకు చివరి పెట్రోలు బంకు..ఇది దాటి వెళ్ళాక పెట్రోలు, డీజిల్ అధిక రేట్లు కాబట్టి ఇక్కడ పెట్రో,డీజిల్ కొంటే డబ్బులు ఆదా అనే స్థితికి బంకులు వచ్చేశాయి. ప్రధానంగా ఏపీ, టీఎస్ సరిహద్దుల్లో ఉన్న బంకుల్లో ఇలాంటి బోర్డులు ఎక్కువగా దర్శనమిస్తాయి. తెలంగాణలో కంటే ఏపీలో పెట్రోల్ 2.60 రూపాయలు ఎక్కువ ఉండగా, డీజిల్ 2.80 వరకు ఎక్కువ ఉంది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలలో ఏపీలో కంటే పెట్రోలు డీజిల్ ధరలు తక్కువగా ఉంటున్నాయి.