వైసీపీపై పోరాడండి…బాబు పిలుపు

473

రెండోదశ పంచాయితీ ఎన్నికల ప్రాంతాల టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న టిడిపి ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, ప్రజాప్రతినిధులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం పంచాయితీ ఎన్నికల 2వదశ ప్రాంతాల టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘పంచాయితీ ఎన్నికల 2వదశ నామినేషన్లకు రేపే ప్రారంభం. అన్ని గ్రామాల్లో నామినేషన్లు రేపు దాఖలు చేయాలి.

తొలిదశలో వైసిపిపై వీరోచితంగా పోరాడారు. 3,249పంచాయితీల్లో 22వేల పైగా నామినేషన్లు సర్పంచి స్థానాలకు, 77వేల నామినేషన్లు వార్డు స్థానాలకు వేశారని మీడియాలో చూశాం. రెండోదశలో కూడా రెట్టించిన స్ఫూర్తితో నామినేషన్లు వేయాలి, వైసిపి బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి.
నామినేషన్లు, స్క్రూటినీ, విత్ డ్రావల్స్, పోలింగ్, కౌంటింగ్ లలో అప్రమత్తంగా ఉండాలి. వైసిపి అక్రమాలను, దుర్మార్గాలను సమర్ధంగా ఎదుర్కోవాలి.
రాజకీయంగా ఎదిగేందుకు గ్రామ పంచాయితీనే తొలిమెట్టు. పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటిన వాళ్లకే భవిష్యత్తులో పదవులు..

వైసిపి ఉండేది ఇంకా ఏడాది రెండేళ్లే..గెలిచే సర్పంచి ఉండేది 5ఏళ్లు. వచ్చేది టిడిపి ప్రభుత్వమే..పాత బిల్లుల బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తాం. కొత్తపనులు మీ ద్వారానే జరుగుతాయి.
ప్రతి ఊళ్లో 5ఏళ్లలో రూ5కోట్లతో అభివృద్ది పనులు.. వైసిపి గెలిస్తే ఈ రూ5కోట్లు వాళ్లే స్వాహా చేస్తారు.
రాబోయే 5ఏళ్లలో 13వేల గ్రామాల్లో రూ70వేల కోట్ల పనులు..నరేగా నిధులు, ఆర్ధిక సంఘం నిధులతో గ్రామాభివృద్ది. టిడిపి 5ఏళ్ల పాలనలో చేసిన అభివృద్దే అందుకు సాక్ష్యం.
అభివృద్ది పనుల రూపంలో టిడిపి గ్రామాభివృద్ది మీ కళ్ల ముందే ఉంది.
ప్రతిఊళ్లో ఇళ్లస్థలాల్లో వైసిపి అవినీతి మీ కళ్లముందే ఉంది. మెడలోతు భూముల్లో ఇళ్లపట్టాలు వైసిపి అవినీతికి నిలువెత్తు నిదర్శనాలు.
ప్రతి ఊళ్లో వైసిపి మద్యం మాఫియా ఆగడాలు మీ కళ్లముందే..వైసిపి ల్యాండ్ మాఫియా భూకబ్జాలు మీ కళ్లెదుటే..శాండ్ మాఫియా దోపిడీ 40లక్షల కార్మికుల పొట్టగొట్టింది.

వైసిపి వల్ల మీ ఊళ్లో ప్రతి కుటుంబం ఎంత నష్టపోయిందో వివరించి చెప్పాలి. రెండేళ్లలో రూ 70వేల కోట్ల భారాలు వేశారు. వీధి దీపాలు వేసింది టిడిపి అయితే వాటిపై పన్నులేసింది వైసిపి. మరుగుదొడ్లు నిర్మించింది టిడిపి అయితే వాటిపై పన్నులేసింది వైసిపి. ఇసుక ఉచితంగా ఇచ్చింది టిడిపి అయితే శాండ్ మాఫియా పరం చేసింది వైసిపి. భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చింది టిడిపి అయితే పస్తుపెట్టింది వైసిపి. రైతుల ఆదాయం పెంచింది టిడిపి అయితే, ఆత్మహత్యల పాలు చేసింది వైసిపి. మహిళలకు పసుపు కుంకుమ పెట్టింది టిడిపి అయితే, వాటిని కూడా తుడిచేస్తోంది వైసిపి. బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు సాధికారత తెచ్చింది టిడిపి అయితే, వాళ్ల ప్రాణాలు తీస్తోంది వైసిపి.

ఇన్ని దుర్మార్గాలకు పాల్పడిన వైసిపికి పుట్టగతులు కూడా ఉండవు.
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం.. ప్రత్యేక హోదా లేదు, ఆర్ధికలోటు భర్తీ లేదు, 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు, అమరావతికి నిధులు లేవు, పోలవరానికి నిధులు లేవు. పునర్విభజన చట్టంలో అంశాలకు పరిష్కారం లేదు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్నే జగన్ రెడ్డి తాకట్టు పెట్టాడు. 25మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నమ్మకద్రోహం చేశాడు. 28మంది వైసిపి ఎంపిలను(రాజ్యసభతో కలిపి) తన కేసుల మాఫీ కోసమే వాడుతున్నాడు.

మీ ఊరినుంచే, మీ గడపనుంచే మన పోరాటం ఆరంభం. వైసిపి గెలిస్తే మీ ఊళ్లన్నీ మింగేస్తారు. రౌడీల పాలన అంతానికి తొలిమెట్టు ఇదే..
ఊరు బాగుండాలంటే తెలుగుదేశం గెలవాలి. పొరబాటున వైసిపి గెలిస్తే ఊళ్లకు ఊళ్లే మింగేస్తారు.
జగన్ రెడ్డి సిఎం అయ్యాక ఊరికో బకాసురుడు తయారయ్యాడు. వైసిపి భూ బకాసురులకు ఈ ఎన్నికల్లో బుద్దిచెప్పాలి.

నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే టిడిపి కంట్రోల్ రూమ్ దృష్టికి తేవాలి. నామినేషన్ పేపర్లు, ఫిర్యాదుల నకళ్లను ఎంక్లోజర్స్ తో సహా జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల సంఘానికి, టిడిపి కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఫొటో, వీడియో సాక్ష్యాధారాలను కూడా జత చేయాలని ’’ చంద్రబాబు టిడిపి శ్రేణులకు పిలుపు ఇచ్చారు.