లక్ష్మణ రేఖ దాటుతుంది ఎస్ఈసీ నిమ్మగడ్డే:మంత్రి బొత్స ఫైర్

509

-ఎస్ఈసీ నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నాం
– పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్స్..

పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను లక్ష్మణరేఖ దాటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను, అందులో ఆయన పేర్కొన్న అంశాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. మా హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా మాపై ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ- ఎన్నికలకు సంబంధం లేని అంశాలను పదే పదే మాట్లాడుతూ.. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, ద్వంద్వ ప్రమాణాలతో, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికి ఎన్నిసార్లు లక్ష్మణ రేఖ దాటారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.

రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుర్చీలో ఉన్న వ్యక్తి  నిష్పక్షపాతంగా ఉండాలి. వాస్తవ దృక్ఫథంతో ఉండాలి. అలాకాకుండా, మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా, కించపరిచే విధంగా గవర్నర్ కు లేఖ రాశారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం.  రాజకీయాల్లోకి కొత్తగా మేం రాలేదు. నేను మొదటిసారి కేబినెట్ మంత్రిని కాదు. మూడోసారి కేబినెట్ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చాలా సీనియర్ మంత్రి.  చట్టం, రాజ్యాంగం పట్ల ఎప్పుడూ గౌరవంతో, వాటికి లోబడి పనిచేసే వాళ్ళం. ఎప్పుడూ మేం వాటిని ఉల్లంఘించలేదు. ఆ ఆలోచనలు కూడా మాకు లేవు. ఎస్ఈసీ దురుద్దేశంతో, ఏకపక్షంగా మాకున్న హక్కులు, గౌరవాన్ని భంగం కలిగిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల చాలా ఆవేదన చెందాం. బాధపడుతున్నాం. మా మీద ఇలాంటి అపవాదులు వేయటం సమంజసం కాదు. మా హక్కుల్ని మీరే కాపాడాలని స్పీకర్ ను కోరాం.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఈ రాష్ట్రంలో బాటలు వేస్తున్నాం. అందులో భాగంగా గ్రామాలలో కక్షలు కార్పణ్యాలకు తావులేకుండా, పార్టీల రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాం. అందులో తప్పేముంది..? దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు, ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సరికాదు అని చెబుతున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని పదే పదే చెబుతున్నా ఆయన వ్యవహార శైలిలో మార్పు రావటం లేదు.

మరోవిషయం ఏమిటంటే… గవర్నర్ చేత నియమించబడిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. గవర్నర్ గారికి రాసిన లేఖలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ మీద విశ్వాసం లేదు, అటార్ని జనరల్ తో మీరు సమాచారం తెలుసుకుని, చర్యలు తీసుకోండి,  ఇదే ఆఖరిసారి, లేకపోతే కోర్టుకు వెళతామని రాయటం అంటే అది లక్ష్మణ రేఖను దాటడం కాదా..? గవర్నర్ ను బెదిరించే విధంగా ఎస్ఈసీ లేఖ రాసిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు. గవర్నర్ కు రాసిన లేఖలో ఎస్ఈసీ వ్యాఖ్యలు చూస్తే బాధేస్తుంది.

కడప పర్యటనకు వెళ్ళి.. స్వర్గీయ వైయస్ఆర్ గారి కుటుంబం గురించి నిమ్మగడ్డ  మాట్లాడిన మాటలు, ఆయన ద్వంద్వ వైఖరి చూస్తే.. ఆయనకు ఆ కుటుంబంపై ఉన్న అక్కసు కనిపించింది. రాజకీయాలు మాట్లాడాలంటే.. ఎస్ఈసీ పదవి నుంచి బయటకు రండి. కడపలో ఎన్నికలకు సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ, వ్యక్తులను ఎత్తిపొడుస్తూ.. ఆయనే మేధావిలా, ఆయన ఒక్కడికే తెలివి ఉన్నట్టు నిమ్మగడ్డ మాట్లాడారు.

నిమ్మగడ్డ ఎన్నికలను పర్యవేక్షించడానికి వెళ్ళాడా.. లేక హరికథలు చెప్పడానికి వెళ్ళాడా..? రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నవారు  ఎవరైనా పరిధి దాటకూడదు. ప్రతి ఒక్కరికీ ఒక రాజ్యాంగం ఉండదు కదా.. అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకటే వాక్ స్వాతంత్ర్యం ఉంటుందన్నది నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలి. ఎన్నికల కమిషనర్ పదవిలో ఉండి, ఎంపైర్ గా ఉండాల్సన వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినా.. ఎంత మంది దుష్ట శక్తులు కట్టకట్టుకుని వచ్చినా.. అంతిమంగా 95 శాతం మాదే విజయం   అన్నారు.