కడుపు నిండిన రైతులు..కడుపు మండిన రైతులు..

649

రైతులు అందరూ ఒకటి కాదు..కొందరు కడుపు నిండిన రైతులు ..ఎందరో కడుపు మండిన రైతులు..కడుపు మండిన రైతుల ఆవేదన చూడండి.
ఇన్నాళ్లూ ఎక్కడ చచ్చారు? అసలేం తెలుసు మీకు?

నా పంట చేతికొచ్చాక ధర పడిపోతే ఎవడూ మాట్లాడలేదు… ఇప్పుడు ముందే ధర నిర్ణయిస్తానని ముందుకొచ్చే చట్టం తెస్తే మీరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఎందుకు…
నా టమాటా రోడ్డుపై పారబోస్తే ఆడిగినోడు లేదు.. ఎగుమతులు రద్దు చేసి మా నోళ్ళల్లో మన్ను కొడితే ప్రశ్నించినోడు లేడు..

ఇప్పుడు మా పంటకు ముందే ధర నిర్ణయించి కొని ఎగుమతి చేసుకుంటాం అని వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇన్నాళ్ల పోరాటం అదే కధ?  కంపెనీలు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయిస్తున్నాయి. రైతు పండించిన పంటకు దళారి ధర నిర్ణయించడం ఏంటి? రైతు పంటకు రైతే ధర నిర్ణయించుకోవాలి అని కదా నినాదం.. ఇప్పుడు నా పంట కోసం కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతుంటే, నా ఇష్టం వచ్చిన ధర నేనే చెప్పుకునే చారిత్రక సందర్భం.

మరి మీ కన్నెర్ర ఏంటి.. నా పొలం కొట్టుకుపోతే ఒక్కడన్నా పలకరించాడా.. కార్పొరేట్ కంపెనీలు ఇన్సూరెన్స్ చేసి వాడు నష్టపరిహారం ఇస్తానని ముందే అగ్రిమెంట్ ఇస్తుంటే మీ కొచ్చే నష్టం ఏంటి..ఎవడ్రా అంబానీ, ఆదానీ, నాకు రేటు గిడితేనే అమ్ముకుంటా.. ఊర్లో సావుకారు మిత్తికి మిత్తికి పెంచి చక్ర వడ్డీ కట్టి పొలం కాయితాలు పెట్టుకొని ఏళ్ల తరబడి దోచుకున్నపుడు ఎవడు మాట్లాడింరు. ఎరువుల సంస్థలకు రోజులకు రోజులు పాస్బుక్కులు పట్టుకొని  లైన్లో నిలబడి ఎండ దెబ్బ తగిలి రైతు చచ్చిపోతే దిక్కు ఎవ్వడు లేడుఎద్దు ఎవసం అమ్ముకొని కూలీగా మారినప్పుడు నేను దగా పడ్డా అని అప్పుడు తెలియదా..
ఒరే ఇప్పుడు ఊళ్ళల్లో పత్తి జీరో బిజినెస్ చేసేది కూడా కార్పొరేట్ బినామీలే కదా…ఇప్పుడు రేటు దింపి కొంటున్నాడు అప్పుడు ముందే ఫిక్స్ చేసిన రేటుకు కొంటాడు. నాకు కార్పొరేట్ వాడు పెట్టుబడులు పెడతాడు, విత్తనాలు ఇస్తాడు, లోన్ ఇస్తాడు, మందులు ఇస్తాడు, పండిన పంటను ముందే నిర్ణయించిన రేటుకు కొంటాడు.. పంట నాశనం అయితే ఇన్సూరెన్స్ చెల్లిస్తాడు..

ఇదంతా చట్టబద్ధమైన అగ్రిమెంట్ కద.. నా పాస్ బుక్కులు వాడు తనకా పెట్టుకోడు.. ఒక ఏడాది పంట మీదనే వాడికి హక్కు..  షావుకారికి, దొరగారికి నా ఇంటిమీద, ఒంటిమీద, ఇల్లాలిమీద, పొలం మీద హక్కు చూపినపుడు ఈ కార్పొరేట్ ని మించిన కసాయి దోపిడీని మీరు అడ్డుకున్నారా… ఇప్పుడు రైతు దగా పడటం ఏంట్రా.. తరాలుగా మేము మీకు తిండి పెట్టి పడేదే దగా.. నాకు వాడు ధర పెట్టకుంటే మార్కెట్లో కనీస మద్దతు ధరకు అమ్ముకుంటా.. ఎవడ్రా మార్కెట్లు రద్దు చేస్తాడని చెప్పింది.. చట్టంలో ఏ లైన్ లో ఉంది.. ఇన్నాళ్లకు స్వామినాథన్ సిఫారసులను అనుసరిస్తూ రైతులకు మేలు చేసే చట్టం వస్తే మా నోళ్ళల్లో మన్ను కొట్టే ఉద్యమం చేస్తార్రా.. మేం మార్కెట్ కు వెళ్తే ట్రాక్టర్ కిరాయిలు కూలీల కిరాయి కట్టలేక వాడు చెప్పిన ధరకు అమ్మి తీరాలి..

ఇప్పుడు నా చేలో పంట, నేను ముందే అగ్రిమెంట్ చేసుకున్న ధరకు, వాడి వాహనంలో తీసుకెళ్లాడు.. నాకు పంట నష్టపోతాను అనే బెంగ లేదు, పెట్టుబడి దొరకదు అనే భయం లేదు, నా పొలం జప్తు చేస్తారనే వణుకు లేదు. రేటు పడిపోతుంది అనే మానాది ఉండదు.. ఇప్పుడేందుకురా మొసలి కన్నీళ్లు కారుస్తూ ఏసీ గధుల్లోంచి బయటికొచ్చి ధర్నాలు.. మా చేతులకు బేడీలు వేసినప్పుడు మీ కాళ్ళు కదలలేదు.. మా పంట రోడ్లపై పోసి కొనండి అని కాళ్ళు పట్టుకున్నా కనికరించనపుడు మీ జెండాలు ఎక్కడ ఉన్నాయి.. రైతుకు మీరు మద్దతు ఇస్తున్నట్టు మా భుజాలపై పెట్టిన మీ తుపాకీలు తియ్యండి.. మీ గురి ఉన్నోణ్ణి దింపి పీఠం ఎక్కే గురి.. రైతు గుండెతో రాజకీయాలు వద్దు…

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసి సంఘం  జాతీయ అధ్యక్షులు
9666606695