ఏపీలో ఎండోమెంటు రద్దు సరే..మరి బీజేపీ రాష్ట్రాల మాటేమిటి?

754

ఆన్‌లైన్ నామినేషన్ల విధానం  బీజేపీ రాష్ట్రాల్లో ఉందా?
గుజరాత్ కోర్సు బీజీపీ రాష్ట్రాల్లో ఏవీ?
అగ్రనేతల డిమాండ్లతో అడ్డంగా క్యాడర్ అయోమయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జాతీయ పార్టీ అయిన బీజేపీ రాష్ట్రానికో విధంగా చేస్తున్న డిమాండ్లు, ఆ పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడవేస్తున్నాయి. నవ్ల్వులపాలు చేస్తున్నాయి.  అధికార పార్టీలపై తాత్కాలికంగా పైచేయి కోసం అగ్రనేతలు చేస్తున్న డిమాండ్లతో,  ఆ పార్టీ నేతలు టీవీ చర్చల్లో ప్రత్యర్ధులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఒక అంశంపై డిమాండ్ చేసేముందు సీనియర్లతో చర్చించని ఫలితంగా, ఏపీ బీజేపీ నేతలు నవ్వులపాలవుతున్నారు.   తాజాగా కృష్ణా జిల్లా వీర్రాజుకాండ్రపాడు గ్రామంలో బీజేపీ ఆఫీసును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ప్రారంభించారు. ఆ సందర్భంలో తమ పార్టీకి ఆఫీసు అద్దెకు ఇచ్చినందునే, ఇంటి యజమానికి పెన్షన్ ఇవ్వకుండా నిలివేశారని  సోము వీర్రాజు ఆరోపించారు. అయితే, దానిని ఆ యజమాని రాయల బుల్లి ఖండించారు. నెలకోసమని ఇల్లు తీసుకుని ఎనిమిది నెలలయినా ఖాళీచేయడం లేదని, మీడియా ముందు చెప్పడంతో పార్టీ పరువు పోయినట్టయింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అందువల్ల ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఈ డిమాండ్ చేసిన వారికి బుర్ర-బుద్ధి ఉన్నట్లు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో,  ఎక్కడా వీర్రాజు డిమాండ్ చేసినట్లు ఆన్‌లైన్ నామినేషన్లు లేకపోవడమే.. అంబటి వ్యంగ్యాస్త్రలకు కారణమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాము అధికారంలో ఉన్న  రాష్ట్రాల్లో ఆన్‌లైన్ నామినేషన్ల విధానం అమలు చేస్తుంటే, ఏపీలో కూడా అమలుచేయాలని డిమాండ్ చేస్తే, దానికి విశ్వసనీయత ఉంటుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇక ఏపీలో దేవదాయ శాఖను రద్దు చేసి, దానిని పీఠాథిపతులకు అప్పగించాలన్న బీజేపీ డిమాండ్‌పైనా చర్చ జరుగుతోంది. పార్టీ వైఖరి, ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ముందు బీజేపీ పావిత రాష్ట్రాల్లో దానిని రద్దు చేసిన తర్వాత దానిని డిమాండ్ చేసినట్టయితే, తమ డిమాండు సమంజసమన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పక్కనే తమ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో, రెవిన్యూలో భాగంగా ఉన్న దేవాదాయ శాఖను రద్దు చేయలేదని, ఉత్తరాఖండ్‌లో ఉన్న పెద్ద ఆలయాలను అక్కడి తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, మహారాష్ట్రలో షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు, ముంబయిలో గణపతి దేవాలయాన్ని  కూడా అప్పటి తమ సర్కారు స్వాధీనం చేసుకుందని గుర్తు చేస్తున్నారు.

ఏపీలో ఎండోమెంట్‌శాఖను రద్దు చేయాలంటున్న తమ నాయకత్వం.. చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా  ఉన్నప్పుడు.. తిరుమల, కనకదుర్గ దేవాలయాలు సహా, అన్ని దేవాలయాల్లో బీజేపీ నేతలను ఏవిధంగా డైరక్టర్లుగా నియమించిందని ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తే, తాము ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు. ఇప్పటికే బీజేపీ మంత్రి ఉన్నప్పుడే బెజవాడలో 64 దేవాలయాలు కూల్చేశారన్న ఆరోపణలను తిప్పికొట్టలేకపోతున్నామని బీజేపీ నేతలు వాపోతున్నారు.

తాజాగా తమ పార్టీకి చెందిన సంచయనిని మాన్సాస్ ట్రస్టుకు వైసీపీ సర్కారు చైర్మన్‌గా నియమిస్తే, బీజేపీ నాయకత్వం దానిని తిరస్కరించకుండా, ఆమోదించింది. దానితో తమ డిమాండుపై  తమకే నమ్మకం లేదన్న భావన ప్రజల్లో వెళ్లదా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు మరొక పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పదవులను ఇంకొక పార్టీలో ఉన్న నేతలు స్వీకరిస్తే, దాని సంకేతాలేమిటన్న ఆలోచన తమ నాయకత్వానికి లేకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

తమది  జాతీయ పార్టీ అయినందున, ఒక అంశంపై డిమాండ్ చేసేముందు తలెత్తే, తదనంతర పరిణామాలను కూడా తమ నాయకత్వం అంచనా వేయకపోవడం వల్ల, టీవీ చర్చల్లో  పార్టీ ప్రతినిధులు అడ్డంగా దొరికిపోయి,  నోరెళ్లబెట్టాల్సి వస్తోందని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఇటీ వల జరిగిన ఒక చర్చలో సోమనాధ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉందని కాంగ్రెస్ నేత వేసిన ప్రశ్నకు, తమ పార్టీ మహిళా నేత చెప్పలేక నోరెళ్లబెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి అవగాహన లేని నేతలకు, పదవులిచ్చినందువల్ల ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు.

కాగా నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటుచేసిన ‘టెంపుల్ మేనేజ్‌మెంట్ కమిటీ’ ఇప్పుడు చర్చలోకి వచ్చింది. ఆ మేనేజ్‌మెంట్ కోర్సు చదివిన వారికే, దేవాలయాల్లో వివిధ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి మోదీ ప్రవేశపెట్టారు. మరి అదే విధానాన్ని దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయకపోవడమే విస్మయం కలిగిస్తోంది. ఏపీలో ఆలయాలను ప్రభుత్వ అధీనం నుంచి విముక్తి చేసి, వాటిని పీఠాథిపతులకు అప్పగించాలన్న బీజేపీ డిమాండ్  మంచిదేనంటున్నారు. అయితే అదే పని.. ముందు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో మొదలుపెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల నష్టం కూడా ఎక్కువేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వానికి లెక్క చూపించి అవినీతికి పాల్పడుతుంటే, ప్రభుత్వ అధీనంలో లేని ఉత్తరభారత దేశంలో,  లెక్కలు చూపించకుండా అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అందువల్ల అవినీతికి తావులేని వ్యవస్థను రూపొందించాలన్న సూచన, వివిధ పీఠాథిపతుల నుంచి వ్యక్తమవుతోంది.

దీనిపై శ్రీ భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ, ఏపీలో కూడా  గుజరాత్‌లో మాదిరిగా టెంపుల్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రవేశపెట్టి, వారికి కొన్ని ప్రముఖ ట్రస్టులతో శిక్షణ ఇప్పించడమే ఈ సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించారు. దీనిని ఇప్పటినుంచే అలవాటుచేస్తే మరో పదేళ్లకు, ఆలయాల్లో తిరుగులేని వ్యవస్థ తయారవుతుందని చెప్పారు.

‘ఇప్పుడు స్వామినారాయణ్ ట్రస్టుగానీ, ఇస్కాన్ గానీ ఆలయ వ్యవస్థ నిర్వహణపై శిక్షణ ఇస్తున్నాయి. దేశంలో దేవాలయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు స్వామి నారాయణ్ ట్రస్టు ఇస్తున్న శిక్షణ అత్యుత్తమమైనది. కాబట్టి వారి వద్దకు ఆలయ ఉద్యోగులకు శిక్షణకు పంపించాలి. లేదా గుజరాత్ మాదిరిగా టెంపుల్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశపెట్టాలి. కాబట్టి ఈ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుచేసి, అదేవిధానాన్ని ఏపీ-తెలంగాణలో కూడా అమలుచేయాలని కోరడమే సబబ’ని కమలానంద భారతి స్వామి వ్యాఖ్యానించారు. ఆలయాల పరిసరాల్లో మైనింగ్ జరపవద్దన్న అంశంపై, హిందూసంస్థలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులిచ్చే డబ్బులన్నీ ఈఓలు, ఆర్‌జేసీల జీతాలకే ఖర్చవుతున్నాయి. అది మంచిదికాదని చెప్పారు