పదవీకాలం పెంపుపై నిమ్మగడ్డ న్యాయపోరాటం?

1077

– కనగరాజ్ నియామకం వల్ల తగ్గిన పదవీకాలం
– నిమ్మగడ్డకు ఆ 45 రోజులు మళ్లీ పొడిగిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం మరో మూడు నెలలు పొడిగిస్తారా?.. గతంలో ఆయన స్థానంలో ప్రభుత్వం నియమించిన కనగరాజ్ పదవీకాలంతో, నిమ్మగడ్డ కోల్పోయిన ఆ 45 రోజుల కాలాన్ని తిరిగి భర్తీ చేస్తారా? ఈ అంశంలో నిమ్మగడ్డ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారా? లేక గవర్నరే జోక్యం చేసుకుని ఉత్తర్వులిస్తారా?.. ఇదీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న సరికొత్త చర్చ.

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ వద్ద,  సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్.. నాటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఇష్టం లేకుండానే, నరసింహన్ ఒత్తిడి వల్ల ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ, దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వర్గంలో ఉండేవారన్న కారణంతో, చంద్రబాబు ఆయనను ఎస్‌ఈసీగా నియమించేందుకు ఇష్టపడలేదు. అయితే, గవర్నర్ సిఫార్సును తిరస్కరించలేక చంద్రబాబు, అయిష్టంగానే నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించారు.

ఆ ప్రకారంగా 2016 ఏప్రిల్ 1న ఎస్‌ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై నిమ్మగడ్డ వైఖరికి ఆగ్రహించిన  జగన్ సర్కారు, ఏప్రిల్10, 2020న ఆయనను డిస్మిస్ చేసింది. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించింది. దానితో రాజ్యాంగబద్ధంగా నియమితుడయిన తనను ఆకస్మికంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ, నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి విజయం సాధించారు.  29 మే 2020న నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించాలని కోర్టు ఆదేశించింది. ఫలితంగా నిమ్మగడ్డ తిరిగి ఆగస్టు 2020న ఎస్‌ఈసీగా పదవీబాధ్యతలు స్వీకరించారు. అంటే 45 రోజుల పాటు నిమ్మగడ్డ తన ఎస్‌ఈసీ పదవికి దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ.. మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ కూడా ఇచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ పదవీకాలం వచ్చే మార్చి 31 నాటికి పూర్తవుతుంది. ఈ క్రమంలో ఎస్‌ఈసీగా కనగరాజ్ నియామకం వల్ల, నిమ్మగడ్డ కోల్పోయిన ఆ 45 రోజుల పదవీ కాలాన్ని ప్రభుత్వం తిరిగి భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో నిమ్మగడ్డపై ప్రభుత్వం ఒంటికాలితో లేస్తున్నందున, ప్రభుత్వం ఆ 45 రోజుల కాలాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది.

కాబట్టి.. నిమ్మగడ్డ తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి, తాను కోల్పోయిన ఆ 45 రోజుల పదవీకాలానికి ప్రత్యామ్నాయంగా, అదే 45 రోజుల పదవీకాలాన్ని భర్తీ చేయటం ద్వారా న్యాయం చేయాలని, గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అదికాకపోతే, నిమ్మగడ్డ స్వయంగా కోర్టుకు వెళ్లి తనకు న్యాయం చేయమని అర్ధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

అయితే, దీనిపై ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ కోల్పోయిన పదవీకాలం సమయంలో జీతభత్యాలు ఇచ్చేసినందున, ఆ పదవీకాలం కలిసే ఉంటుందని చెబుతున్నారు.   ఈ సాంకేతిక కారణాల వల్ల  పదవీకాలం పొడిగింపు అంశం ఉత్పన్నమే కాదని ఒక వర్గం వాదిస్తోంది. కానీ, ఒక ఉద్యోగి తన సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వం జీతం ఇచ్చినప్పటికీ, తన సర్వీసును కలపాలని కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయని మరికొందరు ఉద్యోగ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నిమ్మగడ్డ గవర్నర్ లేదా కోర్టు ద్వారా పదవీకాలం పొడిగింపు తెచ్చుకుంటే.. ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిపించడం ఖాయమంటున్నారు. మరి నిమ్మగడ్డ పదవీకాలం పొడిగింపును, జగన్ సర్కారు ఏవిధంగా అడ్డుకుంటుందోనన్న ఆసక్తి మొదలయింది.