నిజమైన గాంధేయవాది వైయస్ జగన్: సజ్జల రామకృష్ణారెడ్డి

456

ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన మహాత్మాగాంధీ తత్వాన్ని చేతల్లో చేసి చూపిన నిజమైన గాంధేయవాది ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు  సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

– పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన ప్రతి చర్యలోనూ గాంధేయవాదాన్ని జగన్ ఆచరించి చూపారని తెలిపారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో కూడా సరిగ్గా గాంధీ ఆలోచనా విధానంతోనే పచ్చని పల్లెల ప్రగతిని కాంక్షిస్తూ… కక్షలు-కారణ్యాలకు దూరంగా ఏకగ్రీవాలు జరగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే…..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్  ప్రవేశపెట్టిన అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆనాడు గాంధీజీ కలలుగన్నవే. జగన్‌ను గాంధీతో పోలుస్తున్నారేంటని ఈరోజు కొందరు అనుకోవచ్చు. ఇప్పటి వరకు మాటల్లోనే ఉన్న గాంధీతత్వాన్ని చేతల్లో చేసి చూపించిన జగన్‌ను గాంధీజీతో ఎందుకు పోల్చకూడదు. అందరూ గాంధీ టాక్ అంటారు కానీ… జగన్  మాత్రం తన ప్రతి చర్యలోనూ గాంధీ పథంను గుర్తుకు తెచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారు. డే టు డే లైవ్ లో ఆచరించి చూపించారు.

నగరీకరణ పెరిగిన నేటి నవీన కాలంలో గ్రామ పరిపాలనను సుసాధ్యం చేసిన మంచి మనిషి జగన్. నేటి ఆధునిక యుగంలో నానాటికీ పెరుగుతున్న నాగరికత, వలసల దశలో ఏపీ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్  చేపట్టిన గ్రమ స్వరాజ్య స్థాపన ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. తద్వారా ఆయన గ్రామీణులకు అతిపెద్ద భరోసా అందించారు. ప్రజలంతా శాశ్వత ప్రాతిపదికన తమ సొంత కాళ్ళపై తాము నిలబడేలా స్వావలంబన కోసం జగన్  వేసిన పునాదులు చరిత్రలో నిలిచిపోతాయి. వాటి ఫలాలను రానున్న రెండేళ్ళ కాలంలో ప్రజలంతా అందుకోనున్నారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పచ్చని పల్లెల్లో ప్రశాంతతతో కూడిన ప్రగతిని కాంక్షించాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ పరిపక్వత గల మహర్షిలా ఆలోచించి కక్షలు-కారణ్యాలకు దూరంగా ప్రస్తుత పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా పల్లెలు ప్రగతి పథంలో పరుగులు పెడతాయి. గాంధీజీ వర్థంతి సందర్భంగా… మరింత మెరుగైన సమాజ సాధనలో అటు ప్రభుత్వం, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది.

శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏం మాట్లాడారంటే…
ప్రపంచ గర్వించదగ్గ మహనీయుడు గాంధీజీ. నా జన్మ, నేను నడిచే మార్గమే సమాజానికి నేనిచ్చే సందేశమని చెప్పిన మహాత్ముడు గాంధీజీ. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా గతంలో ఏ ఒక్కరూ కూడా పరిపాలనను గ్రామస్థాయికి తీసుకెళ్ళే సాహసం చేయలేదు. అలా చేసిన ఏకైక సాహసికుడు ముఖ్యమంత్రి  జగన్. గాంధీజీ ప్రవచించిన నినాదాన్ని 20 నెలల కాలంలోనే ఆచరణలో చేసి చూపించారు.

పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో ప్రగతి సాధించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. గ్రామ స్థాయి నుంచి గడప స్థాయికి కూడా సేవలు తీసుకెళ్ళి ప్రజల ముంగిటకే పథకాలను అందుబాటులోకి తెచ్చారు. 62శాతంగా ఉన్న రైతాంగం సమస్యలు తనవిగా భావించి వారి కోసం పరిపాలనను ప్రత్యేకంగా పొలం గట్టు స్థాయికి సైతం తీసుకెళ్ళారు. అందుకు ఉదాహరణ రైతు భరోసా కేంద్రాలు. గాంధీజీ సూత్రాలు, ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్  చరిత్రలో నిలిచిపోతారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఈదా రాజశేఖర్ రెడ్డి,అంకంరెడ్డి నారాయణమూర్తి, పద్మజ తదితరులు పాల్గొన్నారు