జడ్జిలు మారినా జగన్ సర్కారుకు తొలగని జంజాటాలు!

485

‘స్థానిక’ఎన్నికల నుంచి.. అశోక్‌గజపతి వరకూ ఎదురుదెబ్బలే
తాజాగా డీజీపీ మళ్లీ హైకోర్టుకు హాజరు
ఐఏఎస్-ఐపిఎస్‌లపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ సీనియర్ల అంతర్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నేరుగా హైకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదు చేసి, దేశంలో సంచలనం సృష్టించిన ఏపీ సీఎం జగన్ పోరాటం ఆ అంశం వరకూ ఫలించినా, తీర్పులు మాత్రం యధాతథంగా ఒకదాని వెంట మరొకటి ప్రతికూలంగా రావడం వైసీసీ వర్గాలను ఖంగుతినిపిస్తోంది. దానితో జడ్జిలు మారిన సంతోషం పార్టీ వర్గాల్లో లేకుండా పోయింది. పైగా.. గతంలో కంటే తీవ్రమైన వ్యాఖ్యలు బెంచిమీద నుంచి వినిపించడంతో,  వైసీపీ వర్గాలు మరింత ఆందోళన చెందుతున్నాయి.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు, మరికొందరు  న్యాయమూర్తుల పక్షపాతంపై సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం, దేశంలో రాజకీయ- న్యాయవర్గాలను కుదిపివేసింది. దేశ చరిత్రలో ఆ స్ధాయిలో,  న్యాయవ్యవస్థపై తిరుగుబాటు చేసిన జగన్ ధైర్యాన్ని చాలామంది మెచ్చుకున్నారు. న్యాయవ్యవస్థ తీరుపై అసంతృప్తిగా ఉన్న అనేకమంది, జగన్ చేసిన ధైర్యానికి అబ్బురపడి ఆయన అభిమానులుగా మారారు.  జగన్ చర్య ఒకరకంగా న్యాయవ్యవస్థను ఆత్మరక్షణలో నెట్టివేసినట్టయింది.

ఆ తర్వాత ఏపీ చీఫ్ జస్టిస్‌తోపాటు, మరొక న్యాయమూర్తి ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. దానితో వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకోగా, విపక్షాలు మాత్రం అది జగన్ ఢిల్లీ పర్యటన ఫలితమేనని ఆరోపించాయి. వీరందికంటే ముందు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం, హైకోర్టు సీజేని బదిలీ చేయబోతున్నారని, ఆ మేరకు జగన్-బీజేపీ పెద్దలకు ఒప్పందం కుదిరించదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. కొద్దిరోజుల తర్వాత నారాయణ మాటే నిజమయింది.

అయితే హైకోర్టు జడ్జిలు మారారన్న సంతోషం వైసీపీ నేతలకు మిగలకుండా పోయింది. న్యాయమూర్తులు మారినప్పటికీ, తీర్పులు మాత్రం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రావడంపై,  వైసీపీ వర్గాల్లో మళ్లీ కలవరం మొదలయింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఒక్క అనుకూల తీర్పు మినహా, మిగిలిన అన్ని తీర్పులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుండటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకులేకపోతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఫుల్‌బెంచ్ ఆదేశించగా, సుప్రీంకోర్టుకు వెళ్లిన సర్కారుకు అక్కడా చుక్కెదురవడంతో, ఎన్నికలు నిర్వహించడం అనివార్యమయింది. ఇది జగన్ సర్కారుకు ఇటీవలి కాలంలో ఎదురయిన, భారీ ఎదురుదె బ్బగానే వైసీపీ సీనియర్లు భావిస్తున్నారు. ఒకరకంగా నిమ్మగడ్డ చేతిలో తాము రాజకీయంగా ఓడిపోయామన్న అవమానభారం, వైసీపీ సీనియర్ల అంతర్గత సంభాషణల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు జరపకూడదన్న తమ అధినేత జగన్ పట్టుదల, కోర్టు ఆదేశాలతో జారిపోయినట్టయిందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి.

తాజాగా విజయనగరం జిల్లాలో రామతీర్ధాలు ట్రస్టు బోర్డు నుంచి మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజును తొలగించడాన్ని, హైకోర్టు కొట్టివేయడంతో.. వైసీపీ వర్గాలు మరింత కుంగిపోయాయి. ఆయనను తిరిగి ట్రస్టీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం వల్ల, వివాదరహితుడైన రాజు గారిని ప్రభుత్వం అనవసరంగా వేధించిందన్న జనాభిప్రాయాన్ని, కోర్టు తీర్పు కూడా బలపరిచినట్టయిందన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. హైకోర్టు తాజాగా డీజీపీ సవాంగ్‌ను మరోసారి కోర్టుకు పిలిపించిన సందర్భంలో.. ఐఏఎస్,ఐపిఎస్‌లు చట్టానికంటే అతీతులుగా భావిస్తున్నారంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు, అటు ప్రభుత్వ-ఇటు వైసీపీ వర్గాలను ఖంగుతినిపించాయి. అదే సందర్భంలో డీజీపీ సిన్సియారిటీపై అంతకుముందు ఉన్న తమ అభిప్రాయాన్ని, బలవంతంగా మార్చుకోవలవసి వస్తోందంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయింది. ఒక ఎస్‌కు సీఐ ప్రమోషన్ విషయంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలుచేయలేదని హైకోర్టు ఆగ్రహించే వరకూ వెళ్లింది.

మరోవైపు ఒక అటెండరు ప్రమోషను కేసులో కోర్టుకు హాజరుకాని ముగ్గురు అధికారులకు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసేందుకు సమాయత్తం కావడం అధికార వర్గాలను హడలెత్తించింది. చివరాఖరకు అందులో ఇద్దరు అధికారులు హుటాహుటిన కోర్టుకు హాజరయి, నాన్‌బెయిలబుల్ వారెంట్ల నుంచి తప్పించుకోగా,  విద్యాశాఖ ఆర్జేడీ మాత్రం ఎన్‌బిడబ్ల్యు వారెంటు నుంచి తప్పించుకోలేకపోయిన వైనం అధికార వర్గాలకు హెచ్చరికగా మారింది.

అంతకంటే ముందు. సీఎం ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, వారిపై అత్యాచార ప్రయత్న కేసులు నమోదు చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. దానితో కేసును కాపీ పేస్టు చేయడం వల్ల అలా జరిగిందని, ఎఫ్‌ఐఆర్‌లో అత్యాచార కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఫలితంగా  నాయకులకు బెయిల్ ఇవ్వడం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

ఈవిధంగా అధికారుల పనితీరుపై, బదిలీ అయిన న్యాయమూర్తుల కంటే ఎక్కువగా బెంచ్‌పైనుంచి వ్యాఖ్యానిస్తుండటంతో, జగన్ చేసిన ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం లేకుండా పోయిందన్న నిరాశాపూరిత వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ‘జడ్జిలు బదిలీ అయిన తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయన్న మా పార్టీ క్యాడ ర్ అంచనాలు తలకిందులవుతున్నాయి. మా బాస్ అంతకష్టపడి, ఎంతో రిస్కు తీసుకుని హైకోర్టు జడ్జిలపై చేసిన పోరాటం నిరుపయోగమేనని అర్ధమవుతోంద’ని  ఓ సీనియర్ నేత పార్టీ వర్గాల మనోభావాలు ఆవిష్కరించారు.